ఆస్ట్రేలియా జోరు | Australia beat New Zealand by 60 runs | Sakshi
Sakshi News home page

IND vs AUS: ఆస్ట్రేలియా జోరు

Published Wed, Oct 9 2024 3:52 AM | Last Updated on Wed, Oct 9 2024 7:04 AM

Australia beat New Zealand by 60 runs

న్యూజిలాండ్‌పై 60 పరుగులతో విజయం

3 పరుగులిచ్చి 3 వికెట్లు తీసిన మేగన్‌ షుట్‌  

షార్జా: డిఫెండింగ్‌ చాంపియన్, ఆరుసార్లు విజేత ఆస్ట్రేలియా జట్టు మహిళల టి20 వరల్డ్‌ కప్‌లో తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. తొలి మ్యాచ్‌లో శ్రీలంకను చిత్తు చేసిన ఆసీస్‌ వరుసగా రెండో విజయంతో గ్రూప్‌ ‘ఎ’లో తమ అగ్ర స్థానాన్ని పటిష్ట పర్చుకుంది. మంగళవారం జరిగిన పోరులో ఆస్ట్రేలియా 60 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. 

బెత్‌ మూనీ (32 బంతుల్లో 40; 2 ఫోర్లు), ఎలైస్‌ పెరీ (24 బంతుల్లో 30; 3 ఫోర్లు, 1 సిక్స్‌) కీలక ఇన్నింగ్స్‌ ఆడగా... కెప్టెన్‌ అలీసా హీలీ (20 బంతుల్లో 26; 4 ఫోర్లు), ఫోబీ లిచ్‌ఫీల్డ్‌ (18 బంతుల్లో 18; 2 ఫోర్లు) అండగా నిలిచారు. ఒకదశలో 109/2తో పటిష్ట స్థితిలో నిలిచిన ఆసీస్‌ జట్టు ఆ తర్వాత దూకుడుగా ఆడే క్రమంలో 29 పరుగుల వ్యవధిలో 6 వికెట్లు కోల్పోయింది.  

కివీస్‌ బౌలర్లలో అమేలియా కెర్‌ 26 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టగా... హ్యాలిడే, రోజ్‌మేరీ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం న్యూజిలాండ్‌ 19.2 ఓవర్లలో 88 పరుగులకే కుప్పకూలింది. అమేలియా కెర్‌ (31 బంతుల్లో 29; 3 ఫోర్లు), సుజీ బేట్స్‌ (20) మినహా ఎవరూ ప్రభావం చూపలేకపోయారు. 

‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ మేగన్‌ షుట్‌ 3.2 ఓవర్లు బౌలింగ్‌ చేయగా... ఈ 20 బంతుల్లో 18 డాట్‌ బంతులు వేసింది. 3 పరుగులు మాత్రమే ఇచ్చిన ఆమె 3 వికెట్లు పడగొట్టింది. ఇతర బౌలర్లలో అనాబెల్‌ సదర్లాండ్‌ (3/21), సోఫీ మాలినెక్స్‌ (2/15) కివీస్‌ పతనంలో ప్రధాన పాత్ర పోషించారు.  

టి20 ప్రపంచకప్‌లో నేడు 
భారత్‌ X శ్రీలంక
వేదిక: దుబాయ్‌; రాత్రి గం. 7:30 నుంచి
స్కాట్లాండ్‌ X దక్షిణాఫ్రికా
వేదిక: దుబాయ్‌  ;మధ్యాహ్నం గం. 3:30 నుంచి  స్టార్‌ స్పోర్ట్స్, హాట్‌ స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement