మీ కోసమే గుండె గెలవాలంటోంది | World Cup final: Australia v New Zealand | Sakshi
Sakshi News home page

మీ కోసమే గుండె గెలవాలంటోంది

Published Sun, Mar 29 2015 2:27 AM | Last Updated on Wed, Oct 17 2018 4:43 PM

మీ కోసమే గుండె గెలవాలంటోంది - Sakshi

మీ కోసమే గుండె గెలవాలంటోంది

మరణానికి చేరువవుతూ ‘నా జీవితానికి ఇదే చివరి మ్యాచ్’ అంటూ గుండెలు పిండేసేలా మాట్లాడిన మార్టిన్ క్రో కోసం ఎలాగైనా గెలవాలని కోరుకుంటున్న న్యూజిలాండ్... మైదానంలోనే చివరి శ్వాస విడిచిన హ్యూస్ జ్ఞాపకాలు వెంటాడుతుండగా, సొంతగడ్డపై స్నేహితుడికి కప్‌ను అంకితం ఇవ్వాలనే ఆలోచనతో ఆస్ట్రేలియా.
 
18 ఏళ్ల పాటు అలుపెరుగకుండా జట్టు భారాన్ని మోసిన వెటోరికి టోర్నీని  కానుకగా అందించాలనుకుంటున్న కివీస్... ప్రపంచకప్‌ను ఐదో సారి గెలుచుకొని తమ కెప్టెన్ క్లార్క్‌కు ఘనంగా వీడ్కోలు ఇవ్వాలని భావిస్తున్న ఆసీస్.
 

గతంలో పది ప్రపంచకప్‌లు జరిగాయి. ప్రతీ ఫైనల్లోనూ విజయం సాధించాలనే పట్టుదల, పోరాటం, వేదన, సంబరం చూశాం. కానీ ఈ ప్రపంచకప్ తుది పోరు మాత్రం వాటన్నింటికీ భిన్నం. మైదానంలో ఎలా ఆడినా క్రికెటర్లు కూడా మానవమాత్రులే. స్కోర్లు, గణాంకాలే కాదు... భావోద్వేగాలూ ఉంటాయ్. అందుకే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి టైటిల్ పోరు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ల మధ్య ఉద్వేగభరిత వాతావరణంలో జరగబోతోంది. ఇరు జట్ల ఆటగాళ్లూ మైదానంలో తమ ‘హృదయం’తో ఆడబోతున్నారు. సర్వశక్తులొడ్డి ఈ ప్రపంచకప్‌ను చిరస్మరణీయం చేసుకోవాలని పరితపిస్తున్నారు.
 
మెల్‌బోర్న్: విశ్వవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన రోజు రానే వచ్చింది. 45 రోజుల వినోదం తర్వాత... ప్రపంచకప్‌లో భారీ క్లైమాక్స్‌కు రంగం సిద్ధమైంది. నేడు (ఆదివారం) జరిగే తుది పోరులో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తలపడబోతున్నాయి. టోర్నీలో ఏడు సార్లు ఫైనల్‌కు చేరిన ఘనత ఆసీస్‌ది కాగా... కివీస్ తమ చరిత్రలో తొలిసారి ఫైనల్‌కు అర్హత సాధించింది. ఈ సారి టోర్నీలో వరుసగా ఎనిమిది మ్యాచ్‌లు నెగ్గిన కివీస్ సూపర్ ఫామ్‌లో కనిపిస్తుండగా... అటు ఆసీస్ సొంత మైదానంలో తిరుగులేనిదిగా కనిపిస్తోంది. లీగ్ దశలో కివీస్ జట్టు ఆసీస్‌పై గెలిచింది. టోర్నీలో వ్యూహ ప్రతివ్యూహాల్లో దూకుడు ప్రదర్శించిన ఇరు జట్ల   కెప్టెన్లు తమ విజయంపై ధీమాగా ఉన్నారు.  
 
జోరు మీదున్న కివీస్
సొంత గడ్డపై చెలరేగుతూ అజేయ ప్రదర్శనతో ఫైనల్‌కు చేరిన న్యూజి లాండ్ అదే జోరును ఇక్కడా కొనసాగించాలని పట్టుదలగా ఉంది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లలో ఆ జట్టు అద్భుత ఆటతీరు కనబర్చింది. మెకల్లమ్, గప్టిల్, ఇలి యట్, అండర్సన్‌లతో పాటు ఈ మ్యాచ్‌లో టేలర్, విలియమ్సన్ కూడా చెలరేగితే కివీస్‌కు తిరుగుండదు. అయితే న్యూజిలాండ్ బ్యాటింగ్‌కు మెల్‌బోర్న్ మైదానం సవాల్ విసురుతోంది. టోర్నీ ఆసాంతం న్యూజిలాండ్‌లోనే ఆ జట్టు అన్ని మ్యాచ్‌లు ఆడింది. అక్కడి చిన్న మైదానాలతో పోలిస్తే ఎంసీజీ చాలా పెద్దది.

2011నుంచి కివీస్ ఇక్కడ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. కాబట్టి పిచ్, స్వింగ్‌లాంటివి కూడా వారికి కొత్తగానే చెప్పవచ్చు. బౌలింగ్‌లో ట్రెంట్ బౌల్ట్ టోర్నీలో అత్యధిక వికెట్లతో (21)  చెలరేగాడు. అతను ప్రతీ మ్యాచ్‌లో జట్టుకు శుభారంభం అందించగా... హెన్రీ సెమీస్ మ్యాచ్‌లో ఆకట్టుకున్నాడు. ఆరంభంలో ఇంగ్లండ్‌పై 7 వికెట్లతో చెలరేగిన అనంతరం ఇప్పటివరకు చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇవ్వని టిమ్ సౌతీ ఈ మ్యాచ్‌లో రాణిం చాలి. ఇక కివీస్ తరఫున ఆఖరి మ్యాచ్ ఆటబోతున్న వెటోరిది ఈ ఫైనల్‌లో కీలక పాత్ర. ప్రపంచంలో అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకడిగా గుర్తింపు తె చ్చుకున్న వెటో రి... మధ్య ఓ వర్లలో కీలకం కాగలడు.
 
ఆసీస్‌కు వేదిక బలం
ఆస్ట్రేలియా జట్టు ఎంసీజీలో ఫైనల్ ఆడటంలో ఉన్న ప్రయోజనాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలని భావిస్తోంది. ఇక్కడ ఆడిన గత ఆరు మ్యాచ్‌లలోనూ ఆసీస్ నెగ్గింది. మై దానంపై ఆ జట్టుకు పూర్తి అంచనా ఉంది. ప్రపంచకప్‌లో సెమీస్‌కు ముందు ఆస్ట్రేలియాపై ఏదో మూలన కొన్ని అనుమానాలుండేవి. అయితే భారత్‌పై అద్భుత గెలుపుతో ఆ జట్టు వాటిని పటాపంచలు చేసింది. బ్యాటింగ్‌లో వార్నర్ ఫామ్‌లో లేకపోవడం ఆ జట్టును కొంత ఆందోళపరుస్తోంది. అయితే  ఫించ్ ఫామ్‌లోకి రాగా, స్మిత్ రూపంలో సూపర్ బ్యాట్స్‌మన్ కొండంత అండ.

మ్యాక్స్‌వెల్, వాట్సన్‌లు చెలరేగితే ప్రత్యర్థికి కష్టాలు తప్పవు. గొప్ప వన్డే బ్యాట్స్‌మన్‌లలో ఒకడిగా గుర్తింపు లేకపోయినా క్లార్క్ తన కెరీర్ ఆసాంతం మిడిలార్డర్‌లో బాగా రాణించాడు. తన ఆఖరి మ్యాచ్‌లో అతను కూడా గుర్తుంచుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడాలని భావిస్తున్నాడు. టోర్నీలో 20 వికెట్లు తీసిన మిషెల్ స్టార్క్ బౌలింగ్‌లో ఆసీస్‌కు పెద్ద బలం.  హాజల్‌వుడ్ నిలకడగా బౌలింగ్ చేస్తుండగా, బౌలింగ్ స్థానం మార్చిన తర్వాత జాన్సన్ చెలరేగిపోతున్నాడు. ఆ జట్టులో ప్రధాన స్పిన్నర్ లేకపోయినా ఈ టోర్నీలో ఇప్పటివరకు దాని వల్ల నష్టం జరగలేదు కాబట్టి జట్టులో మార్పులు ఉండకపోవచ్చు.

జట్ల వివరాలు (అంచనా)
ఆస్ట్రేలియా: క్లార్క్ (కెప్టెన్), వార్నర్, ఫించ్, స్మిత్, మ్యాక్స్‌వెల్, వాట్సన్, హాడిన్, ఫాల్క్‌నర్, జాన్సన్, స్టార్క్, హాజల్‌వుడ్
న్యూజిలాండ్: మెకల్లమ్ (కెప్టెన్), గప్టిల్, విలియమ్సన్, టేలర్, ఇలి యట్, అండర్సన్, రోంచి, వెటోరి, సౌతీ, బౌల్ట్, హెన్రీ.
 
పిచ్, వాతావరణం
పిచ్‌పై బౌన్స్ ఉన్నా ఈ ప్రపంచకప్ మొత్తం బ్యాటింగ్‌కు అనుకూలించింది.  ఫైనల్‌కు కూడా ఇలాగే ఉండవచ్చు. పేస్‌కు పెద్దగా సహకరించకపోవచ్చు. ఆదివారం వర్ష సూచన లేదు. ఒక వేళ వాన వచ్చినా రిజర్వ్‌డే ఉంది.
 
‘సరైన సమయంలోనే రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నా. ఇంకా టెస్టులు ఆడగల సత్తా నాలో ఉంది కాబట్టి కొనసాగుతున్నా. ఒక జట్టును ఫేవరెట్ అనడాన్ని నేను నమ్మను. లీగ్ దశలో వారి చేతిలో ఓడాం. అయినా మా స్థాయికి తగ్గ ఆటతీరు కనబరిస్తే కివీస్‌ను ఓడించగలమన్న నమ్మకముంది. నా తమ్ముడు (హ్యూస్) జ్ఞాపకాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి’
 -క్లార్క్, ఆసీస్ కెప్టెన్
 
‘ఫైనల్లో మాకు 50-50 అవకాశం ఉందనే ప్రస్తుతం చెప్పగలను.  ఎంసీజీ పెద్దదైనా మేం పరిస్థితులకు తగినట్లుగా ఆడతాం.  సమష్టితత్వమే మా బలం. వెటోరి తన సగం జీవితాన్ని క్రికెట్‌కే అంకితం చేశాడు. క్రోను చూస్తే బాధగా ఉంది. ఆయనకు ఈ సమయంలో కాస్త ఆనందంతో పాటు ప్రశాంతత ఇవ్వాలని కోరుకుంటున్నాం. క్రికెట్‌ను ప్రేమించే భారత అభిమానులు ఈ మ్యాచ్‌లో మాకు మద్దతుగా నిలవాలని కోరుతున్నా’
 -మెకల్లమ్,  కివీస్ కెప్టెన్
 
‘ఇకపై నా జీవితం క్రికెట్ చూసే అవకాశం ఇవ్వకపోవచ్చు. ఈ మ్యాచ్ జ్ఞాపకాలతో చివరి వరకూ సంతోషంగా బతికేస్తా’
 - మార్టిన్ క్రో
(న్యూజిలాండ్ దిగ్గజం క్రో క్యాన్సర్‌తో బాధపడుతున్నారు.  ఆయన ఎంతో కాలం బతకరని వైద్యులు చెప్పారు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement