
న్యూజిలాండే కప్ గెలవాలట!
ప్రపంచ కప్లో టీమిండియా పోరాటం ముగిసింది. ఉపఖండం జట్లు శ్రీలంక, పాకిస్థాన్, బంగ్లాదేశ్లు క్వార్టర్స్లోనే వెనుదిరిగాయి. టైటిల్ రేసులో ఆతిథ్య ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు మిగిలాయి. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ అభిమానుల మద్దతు ఎవరికి? ఆదివారం ఆసీస్, కివీస్ల మధ్య జరిగే ఫైనల్లో ఎవరు గెలవాలని కోరుకుంటున్నారు? సాక్షి ఫేస్బుక్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారి అభిప్రాయం కోరింది. క్రికెట్ అభిమానులు భారీ సంఖ్యలో స్పందించి తమ అభిప్రాయలను పోస్ట్ చేశారు.
దాదాపు 95 శాతం మంది అభిమానులు న్యూజిలాండ్కు మద్దతు పలకడం విశేషం. కివీస్ ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించి ప్రపంచ చాంపియన్ కావాలని ఆకాంక్షించారు. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ప్రపంచ కప్ గెలవాలని కివీస్ తొలిసారి జగజ్జేత కావాలని పోస్ట్ చేశారు. ఆసీస్ ఇప్పటికే నాలుగుసార్లు కప్ సొంతం చేసుకున్నందున కివీస్కు మద్దతు ప్రకటించారు. చాలాకొద్ది మాత్రం ఆస్ట్రేలియాకు ఓటేశారు. కంగారూలు మరోసారి కప్ గెలిచి ఫిలిప్ హ్యూజ్కు అంకితమివ్వాలని అభిప్రాయపడ్డారు. ఆసీస్ క్రికెటర్ హ్యూజ్ ఓ మ్యాచ్ సందర్భంగా తీవ్రంగా గాయపడి మరణించిన సంగతి తెలిసిందే. ఇదిలావుండగా, మరికొందరు అభిమానులు ఫైనల్ మ్యాచ్పై ఆసక్తి చూపలేదు. సెమీస్లో భారత్ ఓడినందున నిరుత్సాహంగా ఉందని పోస్ట్ చేశారు.