రిటైర్ కావట్లేదు
టి20 ప్రపంచకప్ తర్వాత ఆలోచిస్తా
సిడ్నీ: అంతర్జాతీయ క్రికెట్ నుంచి ఇప్పట్లో తప్పుకునే ఆలోచన లేదని భారత వన్డే జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని స్పష్టం చేశాడు. వచ్చే ఏడాది జరిగే టి20 ప్రపంచకప్ అనంతరం ఈ విషయంలో ఓ అంచనాకు వస్తానని తేల్చాడు. గతేడాది టెస్టు ఫార్మాట్ నుంచి ధోని అనూహ్యంగా తప్పుకున్న విషయం తెలిసిందే. దీంతో 2019 వన్డే ప్రపంచకప్‌లో తను ఆడగలడా? లేదా? అనే సందేహాలు నెలకొన్నాయి. ‘నాకిప్పుడు 33 ఏళ్లు. నేనిప్పటికీ బాగానే పరిగెత్తుతున్నాను. పూర్తి ఫిట్‌గా ఉన్నాను. 2016లో జరిగే టి20 ప్రపంచకప్ అనంతరం ఈ విషయం ఆలోచించేందుకు సరైన సమయం. 2019 వన్డే ప్రపంచకప్‌లో ఆడాలా.. లేదా అనే అంశంపై అప్పుడే స్పష్టత వస్తుంది’ అని సెమీస్ అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో తెలిపాడు.
‘నా భవిష్యత్‌ను మీరు నిర్ణయించండి’
సెమీఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలోఓటమి అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ధోని తన సహజధోరణిలోనే ఛలోక్తులు విసురుతూ కనిపించాడు. తన క్రికెట్ భవిష్యత్ గురించి అడిగిన ప్రశ్నకు కాస్త వ్యంగ్యంగానే సమాధానమిచ్చాడు. ‘నా రిటైర్మెంట్ గురించి అడుగుతారని ఊహించాను. కానీ అదే తొలి ప్రశ్న అవుతుందనుకోలేదు. మీరంతా ఈ విషయంలో పరిశోధన చేసి జరగబోయే దానిపై కథనం రాయండి. దానికి పూర్తి వ్యతిరేకంగా జరుగుతుంది! క్రికెట్‌ను ఆస్వాదించేందుకే నేను ఆడుతున్నాను. ఎప్పుడైతే వెళ్లాలనుకుంటానో వెంటనే నా బ్యాగ్స్ సర్దుకుని సంతోషంగా గుడ్‌బై చెప్పేస్తా’ అని ధోని అన్నాడు.
‘నేనేమైనా ముసలివాణ్ణా..?’
అలాగే టెస్టుల నుంచి తప్పుకుంటున్నట్టుగానే ఎవరూ ఉహించని విధంగా రేపే వన్డే, టి20లకు వీడ్కోలు చెబుతారా అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘లేదు.. రేపు ప్రకటించను. అయినా నేనేమైనా అంత ముసలివానిగా కనిపిస్తున్నానా? ఇప్పటికే చెప్పాను కదా. మీరే పరిశోధించి వ్యతిరేకంగా కథనాలివ్వండి’ అని దెప్పిపొడిచాడు. ఇప్పటికే ఆసీస్ గడ్డపై నాలుగు నెలలు గడిచాయని, మరో 20 రోజులుంటే పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సరదాగా వ్యాఖ్యానించాడు.