
తుది పోటీ.. ఎవరో మేటి?
మెల్ బోర్న్: ఆతిథ్య దేశాలు అమీతుమి తేల్చుకునేందుకు సిద్దమయ్యాయి. వన్డే వరల్డ్ కప్ టైటిల్ కోసం ఇరుజట్లు ఆదివారం మెల్ బోర్న్ క్రికెట్ మైదానంలో పోటీ పడనున్నాయి. ప్రపంచవిజేత కావాలన్న తమ చిరకాల స్వప్నాన్ని నెరవేర్చకోవాలని కివీస్ టీమ్ పట్టుదలతో ఉంది. ఈ మెగాటోర్ని తుది సమరంలో తమ ఆధిపత్యం కొనసాగించాలని కంగారూ టీమ్ భావిస్తోంది. టోర్ని ఆసాంతం జోరు మీదున్న కివీస్ తుదిపోరులోనూ పైచేయి సాధించి తొలిసారి సగర్వంగా కప్పు అందుకోవాలని తహతహ లాడుతోంది. లీగ్ దశలో పరాజయానికి కివీస్ పై ప్రతీకారం తీర్చుకుని టైటిల్ కైవసం చేసుకోవాలని క్లార్క్ సేన తలపోస్తోంది. సొంత గడ్డపై చెలరేగాలని ఆసీస్, చివరి సవాల్ అధిగమించాలని కివీస్ బరిలోకి దిగనున్నాయి.
బలాబలాల విషయంలో ఇరు జట్లు సమ ఉజ్జీలుగా కనబడుతున్నాయి. ఆల్ రౌండర్లతో అలరారుతున్నాయి. లీగ్ దశలో ఆసీస్, నాకౌట్ లో దక్షిణాఫ్రికాను ఓడించిన కివీస్ ముందు ఏ జట్టైనా నిలబడడం కష్టమే. మెక్ కల్లమ్, గప్టిల్, విలియమ్సన్, ఆండర్సన్, ఇలియట్ బ్యాటింగ్ లో సత్తా చాటారు. అయితే రాస్ టేలర్ ఫామ్ లోకి రాకపోవడం, కీపర్ రోంచి అనుకున్నంతగా రాణించకపోవడం కివీస్ కు మైనస్ గా మారింది. బౌలింగ్ లో ట్రెంట్ బౌల్ట్, టీమ్ సౌతీ అనూహ్యంగా చెలరేగుతున్నారు. స్పిన్నర్ వెటోరి సైలెంట్ గా తన పని కానిస్తున్నాడు. సెమీస్ లో జట్టులో స్థానం దక్కించుకున్న పేసర్ హెన్రీ కూడా రాణించడం కివీస్ కు కలిసొచ్చింది.
లీగ్ దశలో ఉత్కంఠపోరులో కివీస్ చేతిలో ఓడినప్పటికీ క్లార్క్ సేన తర్వాత స్థాయికి తగిన ఆటతీరుతో ఫైనల్ చేరింది. వార్నర్, ఫించ్, స్మిత్, మ్యాక్స్ వెల్, వాట్సన్ మెరిశారు. అయితే గాయం నుంచి కోలుకుని టీమ్ పగ్గాలు చేపట్టిన కెప్టెన్ క్లార్క్ భారీ ఇన్నింగ్స్ బాకీ ఉన్నాడు. ఇప్పటివరకు అతడి అవసరం రాకుండానే విజయాలు దక్కాయి. ఫైనల్లో రాణించకుంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇక బౌలింగ్ లో కంగారూలకు వంక పెట్టడానికి లేదు. స్టార్క్, హాజిల్ వుడ్, జాన్సన్ త్రయం ప్రత్యర్థులకు వణుకు పుట్టిస్తోంది. ఇక ఫాల్క్ నర్ బంతి, బ్యాటుతోనూ రాణిస్తున్నాడు.
వీళ్లే కీలకం..
వార్నర్ vs మెక్ కల్లమ్
ఇరు జట్లలోనూ డాషింగ్ ఓపెనర్లు ఉన్నారు. వీరు చెలరేగితే భారీ స్కోరు ఖాయం. ముఖ్యంగా కివీస్ కెప్టెన్ బ్రెండన్ మెక్ కల్లమ్ చెలరేగితే అతడిని ఆపడం కష్టం. పిచ్ ఏదైనా, బౌలర్ ఎవరైనా బాదడం అతడి ప్రత్యేకత. వార్నర్ కూడా భారీ షాట్లు ఆడడంలో సిద్ధహస్తుడే.
స్మిత్ vs గుప్టిల్
రెండు టీమ్ లలో స్మిత్, గప్టిల్ నిలకడగా రాణిస్తున్నారు. గప్టిల్ డబుల్ సెంచరీ తానెంటో నిరూపించాడు. ఇండియాతో జరిగిన సెమీఫైనల్లో స్మిత్ సూపర్ షోతో సత్తా చాటాడు.
బౌల్ట్ vs స్టార్క్
వికెట్ల వేటలో పోటీ పడుతున్న వీరిద్దరిలో ఎవరు పైచేయి సాధిస్తే విజయం వారివైపు మొగ్గే అవకాశముంది.
సిక్సర పిడుగులు
మ్యాక్స్ వెల్, షేన్ వాట్సన్, కోరె ఆండర్సన్, ఇలియట్ మెరుపు ఇన్నింగ్స్ తో ఆట గమనాన్ని మార్చే హిట్టర్స్.