తిట్టడం కరెక్ట్ కాదేమో!
ప్రపంచకప్ సెమీఫైనల్లో భారత్ ఓడిపోవడం వల్ల ప్రపంచమేమీ అంతమైపోదు. ఎవరి జీవితాలూ మారిపోవు. కాకపోతే ‘అవసరమైతే ఉద్యోగమైనా మానేస్తాగానీ... ఆఫీస్‌కు రాను’ అని బాస్‌కి చెప్పి టీవీకి అతుక్కుపోయిన అభిమానుల పరిస్థితే అర్థం కావడం లేదు. ఇప్పుడు ఆఫీస్‌కు వెళ్లి ఏం చెప్పాలి?
వరుసగా ఏడు మ్యాచ్‌లు గెలిచిన జట్టును ఒక్క మ్యాచ్ ఓడిపోగానే తిట్టడం కరెక్ట్ కాదేమో! ఇంత పెద్ద టోర్నీలో ఏదో ఒక మ్యాచ్ ఓడిపోవడం సహజం. అయితే అది లీగ్ దశలో ఏ వెస్టిండీస్ చేతిలోనో ఓడితే బాగుండేది. నెల రోజులకు పైగా మీ జోరును, మీ ఉత్సాహాన్ని చూసి ఇక కప్ మనదేనన్న ధీమాతో ఉన్న మాకు ఇదో పెద్ద షాక్. తొలి సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా ఓడిపోయినా... ఆ పోరాటం మా మనసుల్ని దోచింది. కానీ మీరు ఆడిన తీరే నిరాశపరిచింది. పిచ్చి మ్యాచ్‌లన్నీ అద్భుతంగా గెలిచి, అసలైన మ్యాచ్‌కొచ్చేసరికి కనీసం పోరాడలేకపోయారు. బయటకు చెప్పుకోలేని వేదన.
టాస్ గెలిచిన ఆస్ట్రేలియా 300 చేయడం ఊహించలేని విషయమేం కాదు. ఒక దశలో 400 కూడా బాదుతారేమో అని భయమేసినా... పాపం బౌలర్లు ఎలాగోలా కష్టపడి దూకుడును ఆపారు. చివర్లో ఆ 20 అదనంగా రాకుండా ఉంటే బాగుండేది. సరే... 329 పరుగులు ఛేజ్ చేయడం చాలా కష్టం. ప్రపంచకప్ సెమీఫైనల్ లాంటి మ్యాచ్‌లో తీవ్ర ఒత్తిడిలో ఛేజ్ చేయడం అంటే అద్భుతమే. అయితే మన బ్యాటింగ్ బలం జగద్విదితం. ఓపెనర్లు ఇద్దరూ అద్భుతంగా ఆడిన తర్వాత ధావన్ కాస్త తొందరపడ్డాడు. కానీ ఆ కోహ్లికి ఏమైంది.
ఏదో పని ఉన్నట్లు ఐదు నిమిషాల్లో వెనక్కి వెళ్లాల్సిన అవసరమేముంది. ఇక రోహిత్ కూడా తన వంతు పాత్ర పూర్తిగా పోషించలేకపోయాడు. సురేశ్ రైనా షార్ట్‌పిచ్ బలహీనత ప్రపంచానికి తెలిసిందే. ఈ టోర్నీలో తన బలహీనతను అధిగమించాడనుకుంటే... మళ్లీ అదే షార్ట్ బంతికి బలయ్యాడు. అక్కడితోనే ఓటమికి మానసికంగా సిద్ధమయ్యాం. అయినా ధోని ఉన్నాడని ఓ ఆశ. ఆ ఆశతోనే చివరి వరకూ టీవీ కట్టేయలేకపోయాం. పాపం అతను మాత్రం ఏం చేస్తాడు. మహామహులంతా పెవిలియన్‌లో కూర్చున్నాక... కొండంత లక్ష్యాన్ని క ళ్ల ముందుంచుకుని ఏం పోరాడతాడు. తను అవుట్ కావడంతోనే అంతా అయిపోయింది.
ప్రపంచకప్ ఆరంభానికి ముందు ధోనికి కూతురు పుట్టింది. ఇప్పటివరకూ తను కనీసం కూతురి స్పర్శను ఆస్వాదించలేదు. కావాలంటే భార్య, కూతురిని ఆస్ట్రేలియా పిలిపించుకోలేడా? కానీ ఒక పెద్ద టోర్నీ మధ్యలో ఆట తప్ప మిగతా విషయాల మీదకు దృష్టి పోకూడదు. మరి కోహ్లికి ఏం తొందరొచ్చిందనో అనుష్క శర్మను పిలిపించుకున్నాడు. అక్కడికీ మ్యాచ్ మధ్యలో వస్తున్న యాడ్‌లో బామ్మ చెబుతూనే ఉంది. ‘నువ్వు ఆట మీద దృష్టిపెట్టు. షూటింగ్‌లు ఎందుకు’ అని. అయినా కోహ్లి చెవులకు అది ఎక్కలేదు.
వెనక్కు ఇవ్వొద్దు (వోంట్ గివ్ ఇట్ బ్యాక్) అంటూ కోట్లాది మంది గొంతెత్తి అరుస్తున్నా... లక్షలాది మంది పనులు మానుకుని ప్రార్థనలు చేస్తున్నా.... మీరు ఓ మ్యాచ్ ముందే కప్‌ను ఇచ్చేశారు. ఓ వైపు కోపం వస్తోంది, మరోవైపు బాధేస్తోంది. కానీ ఏం చేయగలం. మహా అయితే మాలో మేం నాలుగు తిట్లు తిట్టుకుంటాం. కానీ క్రికెట్‌ను చూడటం అయితే ఆపలేం కదా. ఓ పది రోజులు ఆగితే మళ్లీ ఐపీఎల్ వస్తుంది. ఇప్పుడు ఎంత తిట్టుకున్నా... మళ్లీ ఆ సమయానికి ఆటోమేటిక్‌గా చేయి టీవీ రిమోట్ అందుకుంటుంది.
-బాధతో ఓ భారత అభిమాని