మాజీ క్రికెటర్‌పై ఇండియన్ ఫ్యాన్స్ గరం
సాక్షి, స్పోర్ట్స్: శ్రీలంక సీనియర్ క్రికెటర్, మాజీ కెప్టెన్ అర్జున రణతుంగపై ఇండియన్స్ గరంగరంగా ఉన్నారు. అసంబద్ధ వ్యాఖ్యల నేపథ్యంలో లంక మాజీ కెప్టెన్ పై ట్విట్టర్‌లో టీమిండియా ఫ్యాన్స్ తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
ఆగష్టు 27న పల్లెకల్లె మూడో వన్డే సందర్భంగా లంక ఓటమిని తట్టుకోలేక శ్రీలంక ఫ్యాన్స్ బాటిళ్లను మైదానంలోకి విసిరి రచ్చ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆరగంట సేపు ఆటను నిలిపివేసి అనంతరం తిరిగి ప్రారంభించగా, భారత్ విక్టరీ సాధించింది. అయితే వరసగా ఓటమి పాలవుతున్న తమ జట్టును చూసి మండిపడుతున్న శ్రీలంక ఫ్యాన్స్ ను అర్జున రణతుంగ ఊరడించే క్రమంలో ఇండియన్ ఫ్యాన్స్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఈడెన్ గార్డెన్ లో 1996లో వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా, శ్రీలంక జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టీమిండియా వరుస వికెట్లు కోల్పోవడంతో ఫ్యాన్స్ వాటర్ బాటిల్స్ విసిరి, ప్లకార్డులు తగలబెట్టి అప్పట్లో పెద్ద రచ్చ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ విషయాన్ని ఉటంకిస్తూ అభిమానులతో రణతుంగ... ‘మీకు నా విన్నపం ఒక్కటే. క్రికెట్ చరిత్రలో మనకంటూ ఓ చరిత్ర, సాంప్రదాయం ఉన్నాయి. దయచేసి భారత క్రికెట్ అభిమానుల్లాగా మాత్రం ప్రవర్తించకండి. ఇలాంటి ప్రవర్తనతో లంక టీం పరువు తీయకండి’ అంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో సోషల్ మీడియాలో రణతుంగా వార్ ప్రకటించిన ఇండియన్ క్రికెట్ లవర్స్ ట్వీట్లతో రణతుంగపై విరుచుకుపడుతున్నారు.