శ్రీలంక ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న సంగతి తెలిసిందే. ఆర్థిక సంక్షోభం కారణంగా లంక రూపాయి విలువ దారుణంగా పడిపోడవడంతో నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. రోజుకు 12 గంటల పాటు కరెంట్ సరఫరా నిలిపివేస్తున్నారు. ఈ సంక్షోభానికి ప్రధాన కారణమైన ఆ దేశ అధ్యక్షుడు గొటబోయ రాజపక్స గద్దె నుంచి దిగిపోవాలంటూ వారం రోజుల నుంచి ప్రజలు సెక్రటరియట్ ఎదుట ఆందోళన నిర్వహిస్తున్నారు.
ప్రజలు చేస్తున్న పోరాటానికి లంక మాజీ దిగ్గజ క్రికెటర్.. రాజకీయ నేత అర్జున రణతుంగ తన మద్దతు ఇచ్చారు. క్రికెట్ రిత్యా వేరే దేశాల్లో ఉన్న లంక క్రికెటర్లు కూడా ఆటను వదిలి వారం పాటు లంకకు వచ్చి ప్రజల పోరాటానికి మద్దతు ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. కాగా రణతుంగ వ్యాఖ్యలు పలువురు మాజీ క్రికెటర్లను కదిలించాయి. సహచర మాజీ క్రికెటర్.. సనత్ జయసూర్య ఇప్పటికే రణతుంగతో కలిసి గొటబయ రాజపక్సకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన వ్యక్తం చేశాడు.
''ఈరోజు బయట మా అభిమానులు తినడానికి తిండి లేక అల్లాడిపోతున్నారు. ఇంకా అధికారిక ప్రభుత్వానికి భజన చేస్తూ కూర్చోలేం.. ప్రజలకు మా అవసరం ఉంది.. అందుకే ప్రత్యక్ష పోరాటానికి దిగాం.. క్రీడాకారులైనా సరే.. దేశం కష్టాల్లో ఉందంటే చూస్తూ ఊరుకోరు.'' అంటూ రణతుంగ పేర్కొన్నాడు. కాగా జయసూర్య నినాదాలు చేస్తూనే రాజపక్స ఇంటి ముందు ఏర్పాటు చేసిన బారికేడ్లు దూకే ప్రయత్నం చేయడం ఆసక్తి కలిగించింది. అయితే పోలీసులు అడ్డుకోవడంతో జయసూర్య లోపలికి వెళ్లే అవకాశం లేకుండా పోయింది. కాగా వీరిద్దరికి తాజాగా మరికొందరు మాజీ క్రికెటర్లు పరోక్షంగా తమ మద్దతు తెలిపారు.
రాజకీయపరంగా నిరకుంశ పాలనతో దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నారని.. గొటబయ రాజపక్స గద్దె దిగాలని మాజీ క్రికెటర్ మహేళ జయవర్దనే అభిప్రాయపడ్డాడు. మరో మాజీ క్రికెటర్ కుమార సంగక్కర కూడా ట్విటర్ వేదికగా తన నిరసనను వ్యక్తం చేశాడు. ఇక మాజీ టెస్టు క్రికెటర్.. ఐసీసీ మ్యాచ్ రిఫరీ రోషన్ మహనామా శ్రీలంక ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభాన్ని గతంలో జింబాబ్వే ఎదుర్కొన్న సంక్షోభంతో పోల్చాడు. అప్పుడు రాబర్ట్ ముగాబే.. ఇప్పుడు గొటబయ రాజపక్స ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు.
''కొన్ని సంవత్సరాల క్రితం నేను జింబాబ్వే వెళ్లినప్పుడు.. అక్కడి ప్రజలు రాబర్ట్ ముగాబే ప్రభుత్వంపై త్రీవ నిరసన వ్యక్తం చేశారు. నా కారు డ్రైవర్ డీజిల్ తేవడానికి గంటల పాటు క్యూలైన్‌లో నిల్చోవాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితి నా దేశంలో రావద్దని కోరుకున్నా. కానీ నా అంచనా తలకిందులైంది. ఒకప్పుడు జింబాబ్వే ఎదుర్కొన్న సంక్షోభాన్ని ఇప్పుడు లంక ప్రజలు అనుభవిస్తున్నారు'' అంటూ చెప్పుకొచ్చాడు.
చదవండి: Dhammika Prasad: నిరాహారదీక్షకు దిగిన శ్రీలంక మాజీ క్రికెటర్
Arjuna Ranatunga: దేశం తగలబడిపోతుంటే ఐపీఎల్ ముఖ్యమా.. వదిలి రండి!
Comments
Please login to add a commentAdd a comment