
మన పక్కదేశం శ్రీలంక ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న సంగతి తెలిసిందే. కరోనా తదనంతర పరిణామాల అనంతరం లంకకు ఆదాయం తెచ్చిపెట్టే టూరిజం బాగా దెబ్బతింది. దీంతో పెట్రోల్ సహా నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటాయి. తినడానికి తిండి లేక అక్కడి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. కొందరు దేశం విడిచి వలస పోతుంటే.. మరికొందరు పుట్టిన మట్టిని వదిలిరాలేక ఆకలితో అలమటిస్తున్నారు. రోజురోజుకు అక్కడ పరిస్థితి దిగజారుతూనే వస్తుంది. దీనికి ప్రధాన కారణమైన గొటబొయ రాజపక్స ప్రభుత్వంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే శ్రీలంక మాజీ క్రికెటర్.. మంత్రి అర్జున రణతుంగ శ్రీలంక ఆటగాళ్లకు ఒక విజ్ఞప్తి చేశారు. ''ఆర్థిక సంక్షోభంతో దేశం కొట్టుమిట్టాడుతోంది.. దయచేసి ఐపీఎల్‌లో ఆడుతున్న లంక క్రికెటర్లు తిరిగి వచ్చి దేశానికి మద్దతుగా ఉండాలని కోరుకుంటున్నా. దేశం తగలబడిపోతున్నా కొందరు క్రికెటర్లు ఏం పట్టనేట్లే ఉన్నారు. మాకెందుకు ఇదంతా అన్నట్లు ఐపీఎల్‌లో ఆడుతూ సొంత దేశం గురించి పట్టించుకోవడం మానేశారు. ప్రస్తుత పరిస్థితిలో ప్రజలకు, ప్రభుత్వానికి సంబంధాలు పూర్తిగా చెడిపోయాయి.
కాగా క్రికెటర్లు దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికి.. సదరు బోర్డు ఒక మినిస్ట్రీ ఆధ్వర్యంలోనే ఉంటుంది. ఇప్పుడు ఆ బోర్డులో ఉన్న ఉద్యోగులు, క్రికెటర్లు తమ జాబ్‌లు కాపాడుకోవడానికే ప్రాధాన్యమిస్తున్నారు. ఇలాంటి సంక్షోభ సమయంలో యంగ్ క్రికెటర్లు ముందుకు వచ్చి తమ మద్దతు అందించాల్సిన అవసరం ఉంది. ఏదైనా తప్పు జరుగుతున్నప్పుడే ధైర్యంగా మాట్లాడే వ్యక్తులు కావాలి.
మీరెందుకు నిరసన వ్యక్తం చేయడం లేదని ప్రజలు అడుగుతున్నారు. దానికి నా దగ్గర కారణం ఉంది. నేను రాజకీయాల్లోకి వచ్చి 19 ఏళ్లయింది. అయితే ఇప్పుడున్నది రాజకీయ సమస్య కాదు.. ఆర్థిక సమస్య. ఇంతకముందు వనిందు హసరంగా, బానుక రాజపక్స ఆర్థిక సంక్షోభానికి మద్దతు ఇచ్చారు. కానీ ఇప్పుడేమో వెళ్లి ఐపీఎల్ ఆడుకుంటున్నారు. నేను మీ జాబ్‌ను పూర్తిగా వదిలేయమని చెప్పను.. ఒక వారం పాటు ప్రత్యేక అనుమతి తీసుకొని దేశానికి వచ్చి మీ మద్దతు ఇవ్వండి చాలు'' అంటూ పేర్కొన్నాడు.
చదవండి: దివాళా తీశాం.. విదేశీ రుణాలు తీర్చలేం: లంక ఆర్థిక శాఖ
మా పాలన కాదు! తీవ్ర సంక్షోభానికి అసలు కారణం చెప్పిన లంక ప్రధాని
Comments
Please login to add a commentAdd a comment