
వెట్టోరి, క్లార్క్ గుడ్ బై
మరో ఇద్దరు క్రికెటర్లు వీడ్కోలు పలికారు. న్యూజిలాండ్ దిగ్గజం డానియల్ వెట్టోరి అంతర్జాతీయ క్రికెట్కు పూర్తిగా రిటైర్మెంట్ ప్రకటించగా.. ఆస్ట్రేలియా కెప్టెన్ మైకేల్ క్లార్క్ వన్డేల నుంచి వైదొలిగాడు. రిటైర్మెంట్ నిర్ణయం ముందే ప్రకటించిన వెట్టోరి, క్లార్క్కు ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ ఆఖరిది. కాగా క్లార్క్ టెస్టుల్లో కొనసాగనున్నాడు.
18 ఏళ్లపాటు న్యూజిలాండ్ క్రికెట్కు సేవలందించిన 36 ఏళ్ల వెట్టోరి అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలిగాడు. 18 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన వెట్టోరి కెప్టెన్గా, ఆల్రౌండర్గా విశేష సేవలందించాడు. 113 టెస్టులాడిన వెట్టోరి 4531 పరుగులు చేశాడు. ఇందులో ఆరు శతకాలు, 23 అర్ధ శతకాలున్నాయి. టెస్టుల్లో 362 వికెట్లు పడగొట్టాడు. ఇక 295 వన్డేలాడిన కివీస్ మాజీ కెప్టెన్ 2251 పరుగులు చేశాడు. కాగా ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయాడు. 4 హాఫ్ సెంచరీలు చేయగా, 305 వికెట్లు తీశాడు. 34 టీ-20లు ఆడిన వెట్టోరి 205 పరుగులు చేసి, 38 వికెట్లు పడగొట్టాడు.
ఆసీస్ కెప్టెన్, 34 ఏళ్ల క్లార్క్ 12 ఏళ్ల క్రితం వన్డేల్లో అరంగేట్రం చేశాడు. క్లార్క్ తన కెరీర్లో 245 వన్డేలు ఆడాడు. 8 సెంచరీలు, 58 హాఫ్ సెంచరీలతో 7981 పరుగులు సాధించాడు. 108 టెస్టులాడిన క్లార్క్ 28 సెంచరీలు, 27 హాఫ్ సెంచరీలతో 8432 పరుగులు చేశాడు.
దిగ్గాజాల నిష్ర్కమణ: ప్రపంచ కప్లో చాలా మంది దిగ్గజాలు వీడ్కోలు పలికారు. శ్రీలంక వెటరన్లు కుమార్ సంగక్కర, మహేల జయవర్దనె.. పాకిస్థాన్ కెప్టెన్ మిస్బా, మాజీ కెప్టెన్ అఫ్రీది.. జింబాబ్వే మాజీ కెప్టెన్ బ్రెండన్ టేలర్ రిటైరయిన సంగతి తెలిసిందే. తాజాగా వెట్టోరి, క్లార్క్ వైదొలిగారు.