
కివీస్ కకావికలం
మెల్ బోర్న్: కంగారూ బౌలర్ల ధాటికి కివీస్ బ్యాట్స్ మెన్ కకావికలం అయ్యారు. టైటిల్ పోరులో స్వల్ప స్కోరుకే చాపచుట్టేశారు. వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఆదివారమిక్కడ ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 45 ఓవర్లలో 183 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ ముందు 184 పరుగుల టార్గెట్ ఉంచింది.
ఇలియట్(83), టేలర్(40) మినహా మిగతా ఆటగాళ్లు విఫలమవడంతో కివీస్ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. 39 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన కివీస్ ఇలియట్, టేలర్ ఆదుకున్నారు. వీరిద్దరూ నాలుగో వికెట్ కు 137 బంతుల్లో 111 పరుగులు జోడించడంతో కివీస్ కోలుకుంది. అయితే 150 స్కోరు వద్ద టేలర్ అవుటవడంతో మ్యాచ్ గతి మారిపోయింది.
ఆసీస్ బౌలర్లు ఆధిపత్యం చెలాయించడంతో కివీస్ ఒక్కసారిగా కుప్పకూలింది. 33 పరుగుల తేడాతో కివీస్ 6 వికెట్లు చేజార్చుకుని చాపచుట్టేసింది. ఆస్ట్రేలియా బౌలర్లలో ఫాల్కనర్, జాన్సన్ మూడేసి వికెట్లు పడగొట్టారు. స్టార్క్ 2 వికెట్లు తీశాడు. మ్యాక్స్ వెల్ ఒక వికెట్ దక్కించుకున్నాడు.