వరల్డ్ కప్ గతి మార్చిన ఆ 'ఏడు' మార్పులు! | 7 game changing tech of Cricket World Cup 2015 | Sakshi
Sakshi News home page

వరల్డ్ కప్ గతి మార్చిన ఆ 'ఏడు' మార్పులు!

Published Sat, Mar 28 2015 5:02 PM | Last Updated on Sat, Sep 2 2017 11:31 PM

7 game changing tech of Cricket World Cup 2015

సిడ్నీ: వన్డే వరల్డ్ కప్ సమరం మరో మ్యాచ్ తో ముగియనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వరల్డ్ కప్ లో ఐసీసీ కొన్ని వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా ఉపయోగించుకున్న ఈ మార్పులు.. క్రికెట్ గతినే మార్చేశాయి. అవేంటో చూద్దామా..


1. హాట్ స్పాట్.. గతంలో మనకు పరిచయమున్న హాట్ స్పాట్ నిబంధనను ఈ వరల్డ్ కప్ నుంచి తొలగించారు. బంతి బ్యాట్ కు తగిలినా, బ్యాట్స్ మెన్ కు తాకినా, ప్యాడ్ తాకినా హాట్ స్పాట్ నిబంధనతో కచ్చితంగా తెలిసేది.  దీనికి ఇరువైపులా రెండు ఇన్ ఫ్రా కెమెరాలను అమర్చి బంతి ఎక్కడ తాకింది అనేది నిర్ణయించేవారు. ఇది అత్యధిక ఖర్చుతో కూడుకున్నదే కాకుండా అన్ని వేదికల్లో అమర్చడం కష్టంతో కూడుకున్న నేపథ్యంలో ఈ వరల్డ్ కప్ నుంచి హాట్ స్పాట్ విధానాన్ని తొలగించారు.


2. బాల్ స్పిన్ ఆర్పీఎమ్ (రొటేషన్ పెర్ మినిట్).. ఇది ఈ వరల్డ్ కప్ లోనే ప్రవేశపెట్టిన నూతన విధానం. బాల్ స్పిన్ ఆర్పీఎమ్ లో స్పిన్నర్ వేసే బంతి వేగాన్ని కచ్చితంగా తెలుసుకునే వీలుంది.

బౌలర్ చేతి నుంచి బంతి విడుదలయ్యాక దాని పరిభ్రమణాన్ని తెలుసుకోవడానికి ప్రవేశపెట్టిన విధానం ఇది. ఈ విధానంతో టీవీ స్క్రీన్ లపై స్పిన్నర్ బంతిని ఏ రకంగా విసిరాడో సగటు క్రీడాభిమాని కూడా తెలుసుకోవచ్చు.


3. స్పైడర్ కేమ్.. ఇదొక సరికొత్త విధానం. గేమ్ ను విస్తారంగా వీక్షించేందుకు క్రికెట్ బ్రాడ్ కాస్టర్స్ ప్రవేశపెట్టిన విధానం. స్డేడియంలో పైభాగాన స్పైడర్ కేమ్ ను అమర్చి.. దీనికి గ్రౌండ్ లో కొన్ని కేబుల్స్ ను అనుసంధానం చేస్తారు. దీంతో మ్యాచ్ ను విశాలంగా వీక్షించే అవకాశం ఉంది.

 

 


4. పిచ్ విజన్.. క్రికెట్ అంటేనే బ్యాట్స్ మెన్ కు బౌలర్ కు జరిగే పోరాటం. బౌలర్ చేతి నుంచి రిలేజ్ అయ్యే బంతిని క్రీజ్ లో ఉన్న బ్యాట్స్ మెన్ ఏరకంగా ఆడుతున్నడో టీవీ స్ర్కీన్ ల ద్వారా తెలుసుకునే వీలుంది.

ఇది బ్యాట్స్ మెన్ కు శాపంగానే చెప్పవచ్చు. బ్యాట్స్ మెన్ వీక్ జోన్ ను అంచనా వేసి బంతులను సంధించడానికి బౌలర్ కు చక్కటి అవకాశం.


5. హాక్ ఐ బాల్ ట్రాకింగ్.. బౌలర్ బౌన్స్ , స్వింగ్ తో పాటు స్పీడ్ ను అంచనా వేయడానికి ప్రవేశపెట్టిన సాంకేతిక విధానం. దీనికి ఆరు కెమెరాలను ఫీల్డ్ లో అమర్చి బౌలర్ బంతి వేగాన్ని నిర్దేశిస్తారు. కెమెరాలు రికార్డు చేసిన డేటాను కంప్యూటర్ ద్వారా క్షణాల్లో త్రీడీ ఇమేజ్ గా మార్చడమే హాక్ ఐ బాల్ ట్రాకింగ్ విధానం.

 


6. రియల్ టైమ్ స్నికో... ఇదొక క్రికెట్ లో నమ్మకమైన విధానంగానే చెప్పవచ్చు. బంతి బ్యాట్ ను తాకిందో లేదో  దీనిద్వారా తెలుసుకుంటారు.

బంతి బ్యాటును తాకితే, వచ్చే శబ్దాన్ని ఇది తక్షణం రికార్డు చేస్తుంది. ఒకవేళ తాకకపోతే.. శబ్దం రాదు కాబట్టి గ్రాఫ్ లో విషయం తెలిసిపోతుంది. ఈ పద్దతిని గతంలో పలు రకాలుగా ఉపయోగించారు. డీఆర్ఎస్(నిర్ణయ సమీక్ష పద్ధతి)లో రియల్ టైమ్ స్నికోను వాడిన సంగతి తెలిసిందే.


7. ఎల్ఈడీ స్టంప్స్, బెయిల్స్.. స్టంప్ కెమెరాలు మనకు ఎప్పటినుంచో తెలిసినవే. అయితే ఎల్ఈడీ స్టంప్స్, బెయిల్స్ మాత్రం ఈ తాజా టోర్నమెంట్ లో ఐసీసీ తెరపైకి తీసుకొచ్చింది.

దీంతో బెయిల్స్ పడినప్పుడు లైట్లు వెలిగి అంపైర్లు తమ నిర్ణయాన్ని తొందరగానే కాకుండా కచ్చితంగా వెలువరించడానికి ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. ప్రధానంగా రనౌట్ల విషయంలో ఇది బాగా ఉపయోగపడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement