టీమిండియా.. ఎందుకిలా...?
సిడ్నీ: లీగ్ మ్యాచుల్లో ఒక్క ఓటమి కూడా లేకుండా నాకౌట్ చేరిన టీమిండియాకు సెమీస్ లో భంగపాటు ఎదురైంది. గ్రూపు దశలో ఊహించని విధంగా రాణించిన ధోని దండు కీలక పోరులో తడబడింది. కంగారూలకు తల వంచింది. మెగా టోర్నీకి ముందు ఏ జట్టు చేతిలో అయితే ఘోర పరాజయాలు చవిచూసిందో అదే ప్రత్యర్థితో జరిగిన తాజా పోరులో ఓడింది. ఆసీస్ ను ఓడించి టీమిండియా ప్రతీకారం తీర్చుకుంటుందనుకున్న అంచనాలు తప్పాయి.
గత ఏడు మ్యాచుల్లో ప్రత్యర్థులను ఆలౌట్ చేసిన భారత బౌలర్లు ఈ మ్యాచ్ లో గతి తప్పారు. క్లార్క్ సేనకు కళ్లెం వేయడంలో విఫలమయ్యారు. 15 పరుగులకే ఫస్ట్ వికెట్ తీసిన టీమిండియా బౌలర్లు 197 పరుగుల వరకు రెండో వికెట్ తీయలేకపోయాడు. ఫలితంగా ఆసీస్ భారీ స్కోరుకు బాటలు పడ్డాయి. చివర్లో వికెట్లు తీయకుంటే ఆసీస్ మరింత స్కోరు చేసేదే.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కు ఓపెనర్లు శుభారంభం అందించినా సద్వినియోగం చేసుకోలేకపోయింది. కీలక సమయంలో కోహ్లి(1), రైనా(7) అవుటవడంతో టీమిండియా ఆశలు ఆవిరయ్యాయి. వీరిద్దరూ అవుటవడంతో మ్యాచ్ ఆసీస్ చేతుల్లోకి వెళ్లింది. రహానే, ధోని కాసేపు పోరాడిన ఫలితం లేకపోయింది. వీరిద్దరూ ఐదో వికెట్ కు 80 బంతుల్లో 70 జోడించి గట్టెక్కించే ప్రయత్నం చేసినా మ్యాచ్ కంగారూల చేతుల్లోకి వెళ్లిపోయింది.
ధోని అర్ధసెంచరీ ఒంటరి పోరాటం చేసినా సాధించాల్సిన రన్ రేట్ ఎక్కువగా ఉండడంతో ఓటమి తప్పలేదు. ధోని(65), జడేజా(16) లను డైరెక్ట్ హిట్ లతో రనౌట్ చేయడంతో భారత్ పరాజయం ఖాయమైంది. చివరకు 46.5 ఓవర్లలో 233 పరుగులకు ఆలౌటైంది. వరసగా 7 మ్యాచుల్లో ప్రత్యర్థులను ఆలౌట్ చేసిన టీమిండియా సెమీస్ ఫైనల్లోమాత్రం తానే ఆలౌటైంది.