
స్మిత్ హీరో... కోహ్లి జీరో!
సిడ్నీ: ఛేజింగ్ స్టార్ చతికిలపడ్డాడు. అభిమానుల ఆశలను వమ్ము చేశాడు. కీలక పోరులో భారత భావి కెప్టెన్ విరాట్ కోహ్లి విఫలమవగా, ఆసీస్ భావి నాయకుడు స్టీవెన్ స్మిత్ సత్తా చాటాడు. 15 పరుగులకే వికెట్ కోల్పోయిన దశలో బ్యాటింగ్ దిగిన స్మిత్ సంయమనంతో బ్యాటింగ్ చేసిన జట్టుకు భారీ అందించాడు. రెండో వికెట్ విలువైన భాగస్వామ్యం నెలకొల్పి జట్టు విజయంలో కీలకభూమిక పోషించాడు. అంతేకాదు ఫీల్డింగ్ లోనూ మెరుపులు మెరిపించాడు. డైరైక్ట్ త్రోతో జడేజాను రనౌట్ చేసి ఔరా అనిపించాడు.
ఓపెనర్లు శుభారంభం అందించినా ఒత్తిడికి లోనయి కోహ్లి వికెట్ సమర్పించుకున్నాడు. ఛేజింగ్ లో చెలరేగి ఆడతాడని అభిమానులు పెట్టుకున్న అంచనాలను తల్లకిందులు చేశాడు. కనీస పోరాట పటిమ కనబరచకుండా ఈ స్టార్ బ్యాట్స్ మెన్ వికెట్ పారేసుకోవడం అభిమానులను నిరాశపరిచింది.
టీమిండియా ఓటమికి కోహ్లి ఒక్కడినే బాధ్యుడిని చేయడం కరెక్టు కాకపోయినా... అతడు నిలదొక్కుకునివుంటే పరిస్థితి మరోలా ఉండేదనడంలో సందేహం ఏమాత్రం లేదు. ధోని వారసుడిగా చెలామణి అవుతున్న కోహ్లి కీలక మ్యాచుల్లో సత్తా చాటితేనే భారత్ కు చిరస్మరణీయ విజయాలు అందించగలుగుతాడు.