
ఇదే నా చిట్ట చివరి మ్యాచ్:మార్టిన్ క్రో
మెల్ బోర్న్:వన్డే వరల్డ్ కప్ లో భాగంగా ఆదివారం జరిగే ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచే తాను చూసే చివరి మ్యాచ్ కావచ్చని న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ మార్టిన్ క్రో(51) స్పష్టం చేశాడు. గత రెండు సంవత్సరాలుగా ఫాలిక్యులర్ లింఫోమా అనే క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న క్రో రేపటి ఫైనల్ మ్యాచ్ ను తప్పకుండా వీక్షిస్తానన్నాడు. తన అస్థిరమైన జీవితంలో చాలా గేమ్ లను చూస్తూ ఆనందిస్తున్నానని తెలిపాడు. అయితే రేపటి ఫైనల్ మ్యాచే తనకు చివరి మ్యాచ్ కూడా కావచ్చన్నాడు.
'నాకు వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచే చివరి మ్యాచ్ కావొచ్చు. రెండు సంవత్సరాల క్రితం ఈ వ్యాధి సోకింది. గత సంవత్సరం ఈ వ్యాధితో చాలా బాధపడ్డాను. ఈ క్యాన్సర్ వ్యాధికి కీమోథెరపీ కాకుండా సహజ సిద్ధమైన వైద్యాన్నే చేయించుకుంటున్నాను. ఈ వ్యాధితో బాధేపడేవాళ్లు 12 నెలల కంటే ఎక్కువగా బ్రతికే వాళ్లలో ఐదు శాతం మాత్రమేనని' క్రో ఆవేదన వెలిబుచ్చాడు.
న్యూజిలాండ్ తరపున 1980 నుంచి 1990 వరకూ క్రికెట్ కు సేవలందించిన మార్టిన్ క్రో 77 టెస్ట్ మ్యాచ్ లు, 143 వన్డేలు ఆడాడు. ఆ సమయంలో వరల్డ్ బెస్ట్ బ్యాట్స్ మెన్ లలో ఒకడిగా కూడా క్రో గుర్తింపు పొందాడు.