
1983 వరల్డ్ కప్ పునరావృతం కానుందా?
మెల్ బోర్న్: హర్యానా హరికేన్ కపిల్ డేవ్ సారథ్యంలో భారత్ తొలిసారి వరల్డ్ కప్ గెలిచిన సందర్భం గుర్తుందా? భారతీయులకు చిరస్మరణీయమైన వరల్డ్ కప్ అందించిన ఆ ఫైనల్ మ్యాచ్ ను మరోసారి జ్ఞప్తికి తెచ్చుకుందాం? ఏంటీ ఇప్పడు భారత్ ఫైనల్లో లేకపోయిన ఆ విషయం ఎందుకు అనే సందేహం తప్పక కలుగమానదు. ఆ ఫైనల్ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 183 పరుగులకే ఆలౌటైంది. అప్పటికే మన ఫైనల్ ప్రత్యర్ధి అయిన వెస్టిండిస్ రెండు వరల్డ్ కప్ లను గెలిచి మంచి ఊపు మీద ఉండటంతో అందరూ ఆ మ్యాచ్ లో భారత్ ఓడిపోవడం ఖాయం అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఆ మ్యాచ్ లో వెస్టిండీస్ 140 పరుగులకే ఆలౌట్ కావడంతో భారత్ తొలి వరల్డ్ కప్ ను సగర్వంగా అందుకుంది.
వరల్డ్ కప్ 2015 భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుగుతున్న ఫైనల్ మ్యాచ్ లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ 183 పరుగులకే చాపచుట్టేసి నాటి ఫైనల్ ను జ్ఞప్తికి తెచ్చింది. మంచి బౌలింగ్ లైనప్ ఉన్న న్యూజిలాండ్ ఆస్ట్రేలియాని 183 లోపే కట్టడి చేస్తే న్యూజిలాండ్ కూడా తొలిసారే వరల్డ్ కప్ సాధించినట్లు అవుతుంది. మరి న్యూజిలాండ్ బౌలర్లు ఏమి చేస్తారో అనేది మాత్రం వేచి చూడాల్సిందే.