
పాపం.. కివీస్ కల చెదిరింది
కల చెదిరింది. ఆశలు ఆవిరయ్యాయి. కోట్లాది అభిమానుల గుండె పగిలింది. వెట్టోరికి విజయంతో వీడ్కోలు పలకాలన్న కోరిక నెరవేరలేదు. జీవిత చరమాంకంలో ఉన్న మార్టిన్ క్రో కోసం గెలవాలన్న ఆకాంక్ష తీరలేదు. పాపం.. న్యూజిలాండ్ మరోసారి ప్రపంచ కప్ అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. కప్ ఊరించి.. చేతుల దాకా వచ్చినా.. కివీస్ ఆఖరి మెట్టుపై చేజార్చుకుంది. మేటి జట్లను మట్టికరిపించిన న్యూజిలాండ్ కీలక ఫైనల్ సమరంలో ఒత్తిడికి చిత్తయ్యింది. లీగ్ దశలో ఆస్ట్రేలియాను ఓడించిన కివీస్.. టైటిల్ పోరులో అదే జట్టు చేతిలో పరాజయం చవిచూసింది. తొలిసారి ప్రపంచ కప్ ముద్దాడాలని కలలు కన్న కివీస్.. చివరకు రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది. ప్రపంచ కప్ కోసం మరో నాలుగేళ్లు ఎదురు చూడకతప్పదు. ఆసీస్ ఐదోసారి జగజ్జేతగా అవతరించింది.
ప్రపంచ కప్ చరిత్రలో కివీస్ ఒక్కసారి కూడా కప్ అందుకోలేదు. అసలు ఇంతకుముందు ఫైనల్కు చేరనేలేదు. ఈసారి కాకపోతే మరెప్పుడు ప్రపంచ చాంపియన్ అయ్యేది అన్న పట్టుదలతో తాజా ఈవెంట్లో న్యూజిలాండ్ బరిలో దిగింది. సొంతగడ్డపై జైత్రయాత్ర సాగించింది. లీగ్ దశలో అన్ని మ్యాచ్ల్లో నెగ్గింది. మరో ఆతిథ్య జట్టు ఆసీస్నూ కంగారెత్తించి గ్రూపు టాపర్గా నిలిచింది. నాకౌట్ సమరంలోనూ అదే జోరు కొనసాగించింది. క్వార్టర్స్లో భారీ స్కోరు సాధించి వెస్టిండీస్ను చిత్తుచేసింది. సెమీస్లో దక్షిణాఫ్రికాపై భారీ లక్ష్యాన్ని ఛేదించింది. ఉత్కంఠ విజయం సాధించి తొలిసారి ఫైనల్ చేరింది.
ప్రపంచ కప్ ఫైనల్ వరకు ఓటమే లేని జట్టు న్యూజిలాండ్ మాత్రమే. ఆల్రౌండ్ ప్రదర్శనతో అద్భుతంగా రాణించింది. ప్రపంచ కప్ చరిత్రలో ఆ జట్టుకిదే అత్యుత్తమ ప్రదర్శన. జోరు చూశాక వారి విజయం ఆపడం ఎవరిచేతా కాదనిపించింది. కప్ అందుకోవడమే తరువాయిని భావించారు. తొలిసారి ప్రపంచ చాంపియన్లు కావడం ఖాయమనిపించింది. న్యూజిలాండ్ తొలిసారి ప్రపంచ కప్ అందుకోవాలని ఆ దేశ ప్రజలేగాక ఇతర దేశాల అభిమానులు కోరుకున్నారు. ఆసీస్ ఇంతకుముందు నాలుగుసార్లు కప్ సొంతం చేసుకుంది కాబట్టి.. ఈసారి కివీస్కు రావాలని ఆకాంక్షించారు. అయితే కోట్లాది అభిమానుల కల కలగానే మిగిపోయింది. ఫైనల్ సమరంలో కివీస్ ఓడినా.. అత్యుత్తమ ప్రదర్శనతో అభిమానుల మనసులో విజేతగా నిలిచింది.