ప్రపంచ కప్ రెండో సెమీ ఫైనల్ సమరం రసవత్తరంగా సాగుతోంది.
సిడ్నీ: ప్రపంచ కప్ రెండో సెమీ ఫైనల్ సమరం రసవత్తరంగా సాగుతోంది. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ రెండు దశలుగా సాగింది. 34 ఓవర్ల పాటు కంగరూలకు ఎదురేలేదు. ఆసీస్ బ్యాటింగ్ లైనప్ ముందు భారత బౌలర్ల దగ్గర సమాధానమే లేకపోయింది. అయితే ఆ తర్వాత టీమిండియా బౌలర్లు అద్భుతంగా పుంజుకుని మ్యాచ్ను నియంత్రణలోకి తీసుకున్నారు.
15 పరుగులకే ఆసీస్ తొలి వికెట్ కోల్పోయింది. ఉమేష్ బౌలింగ్లో ఓపెనర్ వార్నర్ అవుటయ్యాడు. అయినా ఆ ప్రభావం కనపడకుండా కంగారూలు వేగంగా పరుగులు రాబట్టారు. ఫించ్, స్మిత్ దూకుడుగా ఆడుతూ భారత బౌలర్లకు చుక్కలు చూపించారు. 34 ఓవరల్లో ఆసీస్ 197/1 స్కోరు చేసింది. అప్పటికే స్మిత్ సెంచరీ చేయగా, ఫించ్ సెంచరీకి చేరువవుతున్నాడు. ఈ జోడీ మంచి దూకుడుమీదుంది. దీంతో కంగారూలు 350 పైచిలుకు స్కోరు చేస్తారనిపించింది. భారత అభిమానులు నిరాశకు గురయ్యారు.
అయితే ఆ మరుసటి ఓవర్ నుంచి మ్యాచ్ స్వరూపం మారిపోయింది. 35వ ఓవర్లో ఉమేష్.. స్మిత్ను అవుట్ చేసి బ్రేక్ ఇచ్చాడు. కాసేపటి తర్వాత అశ్విన్.. మ్యాక్స్వెల్ను, ఉమేష్.. ఫించ్ను పెవిలియన్ బాటపట్టించారు. వీరిద్దరూ పరుగు తేడాతో అవుటయ్యారు. దీంతో కంగారూల జోరుకు బ్రేక్ పడింది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ ఆసీస్ను కట్టడి చేశారు. మోహిత్.. క్లార్క్, వాట్సన్ను అవుట్ చేయగా, ఉమేష్ మరోసారి చెలరేగి ఫాల్కనర్ను అదే బాట పట్టించాడు. దీంతో ఆసీస్ అనుకుంత స్కోరు చేయలేకపో్యింది. చివరి 16 ఓవర్లలో భారత బౌలర్లు 6 వికెట్లు తీయగా.. ఆసీస్ 131 పరుగులు చేసింది. చివరి రెండు ఓవర్లలో దూకుడుగా ఆడిన ఆసీస్ 329 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కీలక సమయంలో భారత బౌలర్లు వికెట్ల తీయకుంటే ఆసీస్ మరో 50 పరుగులకు పైనే చేయగలిగేది!