
టాపర్లను ఓడించి.. కప్ కొట్టేశారు
ప్రపంచ కప్లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, భారత్, దక్షిణాఫ్రికా టైటిల్ ఫేవరెట్లు. ఈ నాలుగు జట్లే సెమీస్ చేరాయి. ఆసీస్ ప్రపంచ చాంపియన్ కావడానికి, మిగిలిన మూడు జట్లు బోల్తాపడటానికి ఒకటే కారణం. కంగారూలు పోరాటపటిమతో ఒత్తిడిని జయించగా.. ఇతర మూడు జట్లు ఒత్తిడికి చిత్తయ్యాయి. కంగారూలు సొంతగడ్డపై టైటిల్ ఫేవరెట్లను, టాపర్లను మట్టికరిపించి ప్రపంచ చాంపియన్లు కాగా.. తొలిసారి ప్రపంచ కప్ సాధించాలని ఆశించిన మరో ఆతిథ్య జట్టు న్యూజిలాండ్ రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది. లీగ్ దశలో కివీస్ చేతిలో ఓడిన ఆసీస్.. ఫైనల్లో ప్రతీకారం తీర్చుకుని ఏకంగా కప్ అందుకుంది.
లీగ్ దశలో ఆసీస్ ఓ మ్యాచ్లో (కివీస్తో) ఓడిపోగా.. భారత్, న్యూజిలాండ్ ఆయా గ్రూపుల్లో టాపర్లుగా నిలిచాయి. నాకౌట్ సమరంలో ఆసీస్కు ఈ రెండు జట్లూ ఎదురుపడ్డాయి. సెమీస్లో ఆసీస్.. టీమిండియాతో తలపడింది. ధోనీసేన అప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. సెమీస్లోనూ అదే జోరు కొనసాగిస్తుందని భావించారు. అయితే కీలక పోరులో ధోనీసేన ఒత్తిడికి గురైంది. కంగారూలు పోరాటపటిమతో భారత్పై ఘనవిజయం సాధించారు. తొలుత ఆసీస్ భారీ స్కోరు సాధించగా.. టీమిండియా లక్ష్యఛేదనలో విఫలమైంది. ఇక గ్రాండ్ ఫైనల్లో కంగారూలకు కివీస్ ఎదురైంది. సెమీస్లో సఫారీలపై భారీ లక్ష్యం సాధించిన కివీస్కు టోర్నీలో ఓటమే లేదు. అలాంటి కివీస్ జట్టు కీలక ఫైనల్ పోరులో చతికిలపడింది. బ్యాటింగ్లో బలోపేతంగా కనిపించిన కివీస్ తక్కువ స్కోరుకు ఆలౌటైంది. ఆసీస్ లక్ష్యాన్ని సాధించి ఐదోసారి ప్రపంచ కప్ కొట్టేసింది.