మిస్ యూ ‘పప్’
మైకేల్ క్లార్క్... ఆస్ట్రేలియా క్రికెట్‌లో ఎప్పటికీ గుర్తుండిపోయే పేరు. ఆటగాడిగా, నాయకుడిగా, స్నేహితుడిగా మైదానంలో, బయటా కూడా అందరి మనసులు దోచుకున్న వ్యక్తి. మైదానంలో ఈల వేసి సహచరులను సరదాగా పిలుస్తాడు... మైదానం వెలుపల కష్టమొస్తే పెద్దన్నలా అండగా నిలబడతాడు. అందుకే తను ఆటగాళ్లు మెచ్చిన కెప్టెన్ అయ్యాడు. 2011లో పాంటింగ్ రిటైర్‌మెంట్ తర్వాత సారథిగా బాధ్యతలు తీసుకున్న ‘పప్’... 33 ఏళ్లకే వన్డేలకు వీడ్కోలు చెపుతాడని ఆనాడు ఊహించి ఉండడు. అయితేనేం... తన కల సాకారం చేసుకుని సగర్వంగా వీడ్కోలు పలికాడు.
గత రెండేళ్లుగా గాయాలతో సతమతమవుతూ, వన్డేల్లో తమ జట్టులోనే పెరిగిన పోటీలో అడపాదడపా వెనకబడుతున్నాడనే విమర్శలను మోస్తూ... అతి కష్టమ్మీద ప్రపంచకప్ ఆడాడు. నిజానికి ఈ టోర్నీకి ముందు తను బరిలోకి దిగుతాడో లేదో తెలియని సందిగ్దం. భారత్‌తో తొలి టెస్టు తర్వాత పూర్తిగా విశ్రాంతి తీసుకున్నాడు. ప్రపంచకప్ సమయానికి కోలుకుంటానని హామీ ఇచ్చి జట్టు సారథ్య బాధ్యతలు తీసుకున్నాడు. అయినా టోర్నీలో తొలి రెండు మ్యాచ్‌లు ఆడలేకపోయాడు. అయితే ఎలాగైనా ప్రపంచకప్ ఆడాలి, స్వదేశంలో టైటిల్ గెలవాలనే తపనతోనే చాలా వేగంగా గాయం నుంచి కోలుకుని బరిలోకి దిగాడు.
భారత్‌తో సెమీస్ ముగియగానే తాను వన్డేలకు వీడ్కోలు చెబుతున్నట్లు ప్రకటించాడు. తన శరీరం అన్ని ఫార్మాట్లలో ఆడేందుకు సహకరించడం లేదని, టెస్టుల్లో ఎక్కువ కాలం ఆడాలనే కోరికతో వన్డేల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించాడు. దీంతో ఫైనల్‌కు ముందే సహచరుల్లో పట్టుదల పెంచాడు. ఇక న్యూజిలాండ్‌తో మ్యాచ్ ద్వారా తన కెప్టెన్సీ ముద్రను స్పష్టంగా చూపించాడు. ప్రతి న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్‌కు ఎలాంటి ఫీల్డింగ్ ఉండాలో సిద్ధమై వచ్చాడు. అలాగే తన వనరులను అత్యంత సమర్థంగా వాడుకుని తానెందుకు అద్భుతమైన కెప్టెనో మరోసారి నిరూపించాడు. -సాక్షి క్రీడా విభాగం