
ఆసీస్ అదరహో...
సెమీ ఫైనల్ మ్యాచ్‌కు ముందు... ‘మీ మద్దతు మాకు కావాలి. పెద్ద సంఖ్యలో స్టేడియానికి తరలి రండి’ అంటూ స్వయంగా ఆసీస్ కెప్టెన్ తమ దేశ అభిమానులకు విజ్ఞప్తి చేశాడు. అనూహ్యంగా తమ సొంత మైదానంలో భారత ఫ్యాన్స్ ఎక్కువ సంఖ్యలో ఉండబోతున్నారనే మాట అతడిని కలవర పెట్టడంతో క్లార్క్ ఇలా పిలుపునిచ్చాడు. సిడ్నీ పిచ్ స్పిన్‌కు అనుకూలం అంటూ వార్తలు రావడంతో వార్న్‌నే నెట్స్‌కు పిలిపించుకొని సాధన చేయడం చూస్తే అతను భారత్‌తో మ్యాచ్ గురించి ఎంత ఆందోళన చెందాడో అర్థమవుతుంది.
నాలుగు నెలలుగా తాము వరుసగా దెబ్బ తీసిన జట్టే అయినా... భారత్ ప్రస్తుత ఫామ్, వరుస విజయాలు ఆస్ట్రేలియాలాంటి జట్టును కూడా భయపెట్టాయి. కానీ మ్యాచ్‌లో అక్కడక్కడ కొన్ని సార్లు ‘కంగారు’ పడినా... తమ స్థాయి, సత్తాను ప్రదర్శించి ధోని సేనను చిత్తు చేసింది. ముఖ్యంగా మ్యాచ్ ఆసాంతం కెప్టెన్ క్లార్క్ వ్యూహాలు అద్భుతంగా పని చేశాయి. ఎంత స్పిన్ అన్నా...తమ పేస్ బౌలింగ్‌నే నమ్ముకున్న అతను వారితోనే ఫలితం రాబట్టాడు.
సెంచరీల సైంధవుడు
ఆసీస్ గడ్డపై అడుగు పెట్టిననాటినుంచి స్టీవెన్ స్మిత్ భారత్ పాలిటి యముడిలా తయారయ్యాడు. నాలుగు టెస్టులలోనూ సెంచరీలు చేసిన అతను, ఇప్పుడు ఏకంగా మన ప్రపంచకప్‌కే టెండర్ పెట్టాడు. మరో చూడచక్కటి శతకంతో ఆసీస్‌ను ఫైనల్ చేర్చాడు. వార్నర్ అవుటైనప్పుడు జట్టు స్కోరు 15. మూడో స్థానంలో బరిలోకి దిగిన స్మిత్, 30 ఓవర్లకు పైగా క్రీజ్‌లో నిలిచి జట్టును నిలబెట్టాడు. వికెట్ల మధ్య చురుగ్గా పరుగెత్తుతూ, ఎలాంటి సాహసాలకు పోకుండా పరిస్థితులకు తగినట్లుగా ఆడాడు.
మధ్య ఓవర్లలో స్పిన్నర్లు కట్టడి చేస్తూ వచ్చినా...బంతి లెంగ్త్‌ను సరిగ్గా అంచనా వేస్తూ క్రీజ్‌లో కదిలిన అతను ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. బ్యాటింగ్‌తోనే అతను తన పని ముగించలేదు. టెస్టు కెప్టెన్‌గా సత్తా చాటిన స్మిత్, ఈ మ్యాచ్‌లోనూ తన తెలివితేటలు ప్రదర్శించాడు. స్టార్క్ బౌలింగ్‌లో రహానే బ్యాట్‌కు బంతికి తగిలిందనే విషయం బౌలర్, కీపర్ కూడా గుర్తించలేదు. కానీ స్మిత్ తాను గట్టి నమ్మకంతో ఉన్నానంటూ రివ్యూ కోసం పట్టుబట్టాడు. ధోనికి చక్కటి సహకారం అందిస్తున్న ఈ సమయంలో రహానే అవుట్ కావడం భారత్ ఆశలను దాదాపుగా ముగించింది. ఆ తర్వాత డెరైక్ట్ త్రోతో జడేజాను రనౌట్ చేసి స్మిత్ తన విలువేమిటో మళ్లీ చూపించాడు.
చెలరేగిన బౌలర్లు
328 పరుగులు చేసినా, భారత బ్యాటింగ్ బలం తెలిసిన క్లార్క్ నిశ్చింతగా ఉండిపోలేదు. ప్రధాన పేసర్లు ముగ్గురిని సమర్థంగా వాడుకున్న అతను, మిగిలిన బౌలర్లను కూడా చక్కగా ఉపయోగించుకున్నాడు. వారంతా కూడా తమ కెప్టెన్ నమ్మకాన్ని నిలబెట్టారు. పదే పదే షార్ట్ పిచ్ బంతులు విసిరి భారత బ్యాట్స్‌మెన్ అవుటయ్యేలా ఒత్తిడి పెంచగలిగారు. స్టార్క్ అయితే తన అద్భుత ఫామ్‌ను ఇక్కడా కొనసాగించాడు. ఇటీవల భారత్‌పై పెద్దగా ప్రభావం చూపలేకపోయిన జాన్సన్... సరిగ్గా అసలు సమయంలోనే స్పందించాడు.
ముఖ్యంగా కోహ్లిని చక్కటి షార్ట్ బాల్‌తో బోల్తా కొట్టించిన అతను... రోహిత్‌ను అద్భుతంగా బౌల్డ్ చేసి మ్యాచ్‌ను భారత్‌నుంచి లాక్కున్నాడు. ఇక కుర్రాడు హాజల్‌వుడ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆరంభంలోనే తన బౌలింగ్‌లో ధావన్ సునాయాస క్యాచ్ నేలపాలైనా...ఎక్కడా నియంత్రణ తప్పలేదు. ఓపెనర్లు చెలరేగుతున్న దశలో అతను తీసిన వికెట్ మ్యాచ్ దిశను మార్చింది. రైనా వికెట్‌తో ఫాల్క్‌నర్ కూడా తానూ ఓ చేయి వేశాడు. భారత్‌లాగా అజేయంగా సెమీస్‌కు చేరకపోయినా... కీలక మ్యాచ్‌లో తమ స్థాయికి తగ్గ ఆటతో అదరగొట్టింది.
- సాక్షి క్రీడావిభాగం