సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : పార్లమెంట్ నియోజకవర్గాల అభివృద్ధి నిధులు(ఎంపీ ల్యాడ్స్) రూ.కోట్లు విడుదలవుతున్నా ఖర్చుకావడం లేదు. ఎంపీలు ప్రతిపాదించిన పనులు, నిధుల విభజన, కేటాయింపుల్లో సమతూకం లేక పనులు అసంపూర్తిగా మిగులుతున్నాయి. ఐదేళ్లలో విడుదలైన నిధులు, పనులకు పొంతన కుదరడం లేదు. పార్లమెంట్ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు కేటాయించిన పనులు పూర్తయ్యాయా? లేదా? పర్యవేక్షణ జరపకుండా కొత్త పనులకు నిధులు వెచ్చిస్తున్నారు. 2009-10, 2010-11లలో ఏటా రూ.2 కోట్ల చొప్పున ఎంపీ నిధులు విడుదల కాగా ఈ తర్వాత రూ.5 కోట్లకు పెంచారు. ఎంపీలుగాృ ఎన్నికై ఇప్పటికే నాలుగున్నరేళ్లు పూర్తి కాగా ఆదిలాబాద్ ఎంపీ రాథోడ్ రమేశ్ కోటా రూ.19 కోట్లకు, రూ.15.58 కోట్లు విడుదల కాగా రూ.11.43 కోట్లు ఖర్చు చేశారు. పెద్దపల్లి డాక్టర్ వివేక్ జిల్లాలోని మూడు అసెంబ్లీ సెగ్మెంట్లలో నాలుగేళ్లలో తన కోటా కింద రూ.4.37 కోట్లు కేటాయించగా రూ.2.83 కోట్లు ఖర్చు చేశారు. మరో ఆరు నెలల్లో సాధారణ ఎన్నికలు జరిగే అవకాశం ఉండగా ఎంపీ కోటా కింద విడుదలయ్యే నిధులు ఎలా ఖర్చు చేస్తారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఆదిలాబాద్ ఎంపీ రాథోడ్ రమేశ్ నిధుల లెక్క..
ఆదిలాబాద్ ఎంపీ రాథోడ్ రమేశ్ ఐదేళ్లలో రూ.19 కోట్లు ఎంపీ ల్యాడ్స్ కింద విడుదలవుతాయన్న అంచనా మేరకు ఆయన 1,157 పనులకు ప్రతిపాదనలు చేసినట్లు రికార్డులు చెప్తున్నాయి. 2009-10లో రూ.2 కోట్లకు 284 పనులు ఆయన ప్రతిపాదించగా, ఆ సంవత్సరంలో రూ.1.80 కోట్ల విలువ చేసే 168 పనులు పూర్తయ్యాయి. 2010-11లో 138 పనులకు రూ.1.68 కోట్లు ఖర్చు చేశారు. 2011-12 నుంచి ఎంపీ కోటా రూ.5 కోట్లకు పెరగగా ఆ యేడు 356 పనులను ఆయన ప్రతిపాదించారు. అందులో రూ.4.22 కోట్లు ఖర్చు చేస్తే 213 పనులే పూర్తయ్యాయి. 2012-13లో రూ.5 కోట్లకు 298 పనులు ప్రతిపాదన చేయగా, రూ.3.73 కోట్లు ఖర్చు చేసి 160 పనులు పూర్తి చేశారు. అయితే 2013-14 సంవత్సరం కోటా మొదటి విడతలో రూ.1.54 కోట్లతో 117 పనులకు ప్రతిపాదించారు. ఎంపీగా ఆయన పదవీ కాలంలో విడుదలైన నిధులు, చేపట్టిన, పూర్తయిన పనుల వివరాలు చూస్తే ఏటా అనేక పనులు పెండింగ్‌లో ఉన్నాయి. మొత్తంగా ఆదిలాబాద్ ఎంపీ కోటా కింద విడుదలయ్యే రూ.19 కోట్లకు ప్రతిపాదించిన పనులు 1,157 కాగా, ఇప్పటి వరకు 619 పనులు మాత్రమే పూర్తయ్యాయి. పెండింగ్‌లో ఉన్న 538 పనులకు ఎప్పుడు నిధులు కేటాయిస్తారు? ఎప్పుడు ప్రారంభిస్తారు? అవెప్పుడు పూర్తవుతాయనేది చర్చనీయాంశంగా మారింది.
పెద్దపల్లి ఎంపీ కోటా కింద రూ.4.37 కోట్లు
పెద్దపల్లి ఎంపీ జి.వివేక్ ఆయన పార్లమెంట్ నియోజకవర్గం పరిధికి వచ్చే జిల్లాలోని మూడు అసెంబ్లీ సెగ్మెంట్లకు నాలుగేళ్లలో రూ.4.37 కోట్లతో 316 అభివృద్ధి పనులను ప్రతిపాదించారు. అందులో 100 పనుల కోసం రూ.2.83 కోట్లు ఖర్చు కాగా... 2013-14 సంవత్సరానికి సంబంధించిన నిధుల నుంచి ఇంకా జిల్లాకు వాటా కేటాయించలేదు. 2009-10లో 106 పనుల కోసం రూ.84.15 లక్షలు కేటాయించగా 39 పనులు పూర్తి చేశారు. 2010-11లో రూ.83.78 లక్షలు 47 పనులకు కేటాయిస్తే 19 పనులే చేపట్టారు.
2011-12లో పెరిగిన కోటా ప్రకారం 108 పనుల కోసం రూ.1.68 కోట్లు కేటాయించగా రూ.1.16 కోట్లు ఖర్చు చేసి 42 పనులు పూర్తి చేశారు. 2012-13లో రూ.1.02 కోట్లతో 55 పనులు ప్రతిపాదించగా... కొత్త పనులు చేపట్టకపోగా, గతంలో పెండింగ్ పనులకు రూ.48.50 లక్షలు చెల్లించినట్లు రికార్డులు చెప్తున్నాయి. 2013-14 సంవత్సరానికి విడుదలయ్యే ఎంపీ నిధుల కోటాలో ఇంకా జిల్లాలోని మూడు సెగ్మెంట్లకు ప్రతిపాదనలు చేసినట్లు ఇటీవల అధికారులు వెల్లడించిన ఎంపీ కోటా నిధులు, పనుల జాబితాలో లేదు. ఇదిలా వుండగా ఎంపీ కోటా కింద విడుదలయ్యే నిధుల కింద చేపట్టే అభివృద్ధి పనుల పర్యవేక్షణలో అధికారుల కూడ పారదర్శకంగా వ్యవహరించాలని ప్రజలు కోరుతున్నారు. అయితే ఎంపీలు సైతం వీలైనంత వరకు అసంపూర్తి పనులు లేకుండా చూసిన తర్వాతే... కొత్త పనులకు నిధులు కేటాయిస్తే బాగుంటుందంటున్నారు.
ఎంపీ ల్యాడ్స్.. ఏమిటీ ల్యాప్స్!
Published Sat, Dec 14 2013 6:20 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
Advertisement
Advertisement