కరోనాపై యుద్ధానికి టాటా గ్రూప్ శనివారం భారీ విరాళం ప్రకటించింది. రూ.500 కోట్లు ఇవ్వనున్నట్లు తొలుత టాటా ట్రస్టు వెల్లడించింది. అనంతరం రూ.1,000 కోట్ల విరాళాన్ని ‘టాటా సన్స్’ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ ప్రకటించారు. దీంతో టాటా గ్రూప్ మొత్తం రూ.1,500 కోట్ల విరాళం ప్రకటించినట్లయ్యింది.
న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా మహమ్మారిపై యుద్ధానికి టాటా గ్రూప్ శనివారం భారీ విరాళం ప్రకటించింది. రూ.500 కోట్లు ఇవ్వనున్నట్లు తొలుత టాటా ట్రస్టు వెల్లడించింది. అనంతరం రూ.1,000 కోట్ల విరాళాన్ని ‘టాటా సన్స్’ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ ప్రకటించారు. దీంతో టాటా గ్రూప్ మొత్తం రూ.1,500 కోట్ల విరాళం ప్రకటించినట్లయ్యింది.
కరోనా వైరస్ పీడితులకు అవసరమైన వెంటిలేటర్లను సాధ్యమైనంత త్వరగా అందజేస్తామని చంద్రశేఖరన్ పేర్కొన్నారు. వాటిని తయారు చేసేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టామన్నారు. దేశంలో.. ప్రపంచంలో కరోనా వ్యాప్తి ఆందోళన కలిగిస్తోందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వేగవంతమైన నివారణ చర్యలు అవసరమన్నారు. కరోనా నివారణకు టాటా ట్రస్టుతో కలిసి పని చేస్తామన్నారు.
కరోనా నివారణతోపాటు సహాయక కార్యకలాపాలకు రూ.500 కోట్ల విరాళాన్ని టాటా ట్రస్టు ప్రకటించింది. తాము ఇవ్వనున్న రూ.1,000 కోట్లతో డాక్టర్లు, వైద్య సిబ్బందికి వ్యక్తిగత రక్షణ పరికరాలు, కరోనా టెస్టింగ్ కిట్లు అందజేయనున్నట్లు టాటా సన్స్ తెలిపింది. కరోనాను అరికట్టే విషయంలో తక్షణమే స్పందించాల్సిన సమయం వచ్చిందని టాటా ట్రస్టు చైర్మన్ రతన్ టాటా వ్యాఖ్యానించారు. మానవ జాతి ఎదుర్కొంటున్న కఠినమైన సవాళ్లలో కరోనా కూడా ఒకటని తెలిపారు.
రూ.కోటి చొప్పున బీజేపీ ఎంపీల ఎంపీల్యాడ్స్
కరోనాపై పోరులో ప్రభుత్వానికి సాయపడేందుకు తమ పార్టీ ఎంపీలు రూ.1 కోటి చొప్పున ఎంపీల్యాడ్స్ కేటాయించనున్నట్లు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు. పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఒక నెల వేతనం విరాళంగా అందిస్తారని తెలిపారు. దీంతోపాటు తమ పార్టీ కార్యకర్తలు లాక్‌డౌన్‌తో ఇబ్బందిపడే 5 కోట్ల నిరుపేదలకు 21 రోజులపాటు అన్నదానం చేస్తుందన్నారు. బీజేపీకి లోక్‌సభ, రాజ్యసభల్లో కలిపి 386 మంది సభ్యులున్నారు. ఒక్కో ఎంపీకి ఎంపీల్యాడ్స్ కింద ఏడాదికి రూ.5 కోట్ల వరకు ఖర్చు చేసే వీలుంది. కేంద్రమంత్రి సురేశ్‌ప్రభు తన ఒక నెల వేతనాన్ని ప్రధానమంత్రి సహాయ నిధికి అందించనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. కాగా, ఎంపీలంతా తమ ఎంపీల్యాడ్స్ నుంచి రూ.కోటి విరాళంగా అందించాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సభ్యులను కోరారు.
సన్‌ఫార్మా రూ.25 కోట్లు: కరోనాపై పోరాటంలో ప్రభుత్వానికి సహకరించేందుకు సన్ ఫార్మా ఇండస్ట్రీస్ లిమిటెడ్ ముందుకు వచ్చింది. కరోనా వ్యాధి తీవ్రతను తగ్గించేందుకు రూ.25 కోట్ల విలువైన హైడ్రాక్సీ క్లోరోక్విన్, అజిత్రోమైసిన్ తదితర మం దులు, శానిటైజర్లను సరఫరా చేయనున్నట్లు ప్రకటించింది.
అత్యాధునిక వెంటిలేటర్లు అందిస్తాం: హ్యుండయ్
కరోనాపై పోరుకు దక్షిణ కొరియాలో వినియోగిస్తున్న అత్యాధునిక పరీక్ష కిట్లను అందించనున్న హ్యుండయ్ మోటార్స్ ప్రకటించింది. ఇవి 25 వేల మందికి ఉపయోగపడతాయని తెలిపింది.
ఒకరోజు వేతనం ఇవ్వండి: జీఎస్‌ఐ
కరోనాపై పోరులో సర్కారుకు బాసటగా నిలిచేందుకు ప్రధానమంత్రి సహాయ నిధికి ఒక రోజు వేతనం విరాళంగా ఇవ్వాలని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్‌ఐ) తన ఉద్యోగులను కోరింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా ఉన్న ఆరు జోన్ల అధిపతులకు వినతులు పంపినట్లు జీఎస్‌ఐ డీజీ శ్రీధర్ తెలిపారు.
కావాలంటే వెంటిలేటర్లు సరఫరా చేస్తాం: ట్రంప్
కరోనాపై పోరులో మిత్ర దేశాలకు సాయం అందించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ముందుకు వచ్చారు. వెంటిలేటర్లు, ఇతర వైద్య సామగ్రి ఉత్పత్తిని దేశీయంగా పెంచడంతోపాటు అవసరమైన దేశాలకు వాటిని అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. కరోనా బారినపడిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌తో తాను ఫోన్‌లో మాట్లాడినట్లు తెలిపిన ట్రంప్.. వెంటిలేటర్లు పంపించాలన్న ఒకే ఒక కోరికను బోరిస్ ఈ సందర్భంగా వెల్లడించారని వ్యాఖ్యానించారు. రానున్న 100 రోజుల్లో తమ కంపెనీలు లక్ష వెంటిలేటర్లను ఉత్పత్తి చేయనున్నాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment