ఇంటర్నెట్ లేనిదే నిమిషం గడవని పరిస్థితి. ఎంటర్‌టైన్‌మెంట్ నుంచి ఆన్‌లైన్ చదువుల దాకా.. ఆర్థిక లావాదేవీల నుంచి నిత్యావసరాల బుకింగ్ దాకా.. స్మార్ట్ ఫోన్, ట్యాబ్లెట్, కంప్యూటర్.. ఏదైనా ఇంటర్నెట్ అత్యవసరంగా మారిపోయింది.
ఈ ఇంటర్నెట్ ఎంత వేగంగా ఉంటే.. మన పని అంత వేగంగా పూర్తవుతుంది. ఈ క్రమంలో ఊక్లా సంస్థకు చెందిన స్పీడ్‌టెస్ట్ వెబ్‌సైట్.. ఏప్రిల్ నెలకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఏయే దేశాల్లో సగటు ఇంటర్నెట్ వేగం ఎంత అన్నదానిపై ర్యాంకింగ్స్ ఇచ్చింది.
♦ మొబైల్ ఇంటర్నెట్ విభాగంలో 36.35 ఎంబీపీఎస్ స్పీడ్‌తో భారత్ 60వ స్థానంలో నిలిచింది. మార్చిలో భారత్ ర్యాంకు 64కాగా.. నెలలో నాలుగు స్థానాలు ఎగబాకింది. ఫిక్స్‌డ్ బ్రాడ్‌బ్యాండ్ విభాగంలో 51.12 ఎంబీపీఎస్‌తో 83వ స్థానంలో నిలిచింది. మార్చితో పోలిస్తే ఒక ర్యాంకు ఎగబాకింది.
♦ మొబైల్ ఇంటర్నెట్‌కు సంబంధించి 138 దేశాలకు ర్యాంకులు ఇవ్వగా.. యెమెన్ (3.38 ఎంబీపీఎస్), అఫ్గానిస్తాన్ (4.46), క్యూబా (4.48), వెనెజువెలా (6.90), హైతీ (8.03) అట్టడుగు స్థానాల్లో నిలిచాయి.
♦ ఫిక్స్‌డ్ బ్రాడ్‌బ్యాండ్‌కు సంబంధించి 180 దేశాలకు ర్యాంకులు ఇవ్వగా.. క్యూబా (1.97 ఎంబీపీఎస్), అఫ్గానిస్తాన్ (2.31), సిరియా (3.93), తుర్క్‌మెనిస్తాన్ (4.03), యెమెన్ (4.29) అట్టడుగు స్థానాల్లో నిలిచాయి.
♦ ప్రపంచవ్యాప్తంగా సగటున మొబైల్ ఇంటర్నెట్ వేగం 42.07 ఎంబీపీఎస్‌కాగా.. ఫిక్స్‌డ్ బ్రాడ్‌బ్యాండ్ వేగం 80.12 ఎంబీపీఎస్ కావడం గమనార్హం.
♦ ప్రపంచంలో సగటున 100 ఎంబీపీఎస్ కంటే ఎక్కువ నెట్ స్పీడ్‌ను పరిగణనలోకి తీసుకుంటే.. మొబైల్ ఇంటర్నెట్‌లో కేవలం పది దేశాలు, ఫిక్స్‌డ్ బ్రాడ్‌బ్యాండ్‌లో కేవలం 33 దేశాలు మాత్రమే ఈ వేగాన్ని అందుకున్నాయి.
– సాక్షి, సెంట్రల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment