మన దేశంలో అంతర్జాతీయ శ్రేణి విద్యా సంస్థ ఒక్కటైనా లేదుగదా అనే దిగులు తీరింది. ప్రపంచవ్యాప్త ఉన్నత విద్యా సంస్థల జాబితాల్లో మన దేశానికి సంబంధించిన రెండు సంస్థలు తొలిసారి చోటు సంపాదించుకున్నాయి. ది టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్(టీహెచ్‌ఈ) ఈసారి విడుదల చేసిన వంద ఉన్నత శ్రేణి విద్యా సంస్థల జాబితాలో బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్‌సీ) ఒకటిగా నిలిచింది. మరో ర్యాంకింగ్ సంస్థ క్యూఎస్ వెలువరించిన 200 ఉన్నత స్థాయి విద్యా సంస్థల జాబితాలో ఢిల్లీ ఐఐటీ చేరింది.
ఈ సంస్థలు ఏటా ర్యాంకింగ్‌లు విడుదల చేయడం, అందులో మన సంస్థల పేర్లు లేకపోవడం...ఈ పరిస్థితిపై అనుకూల, వ్యతిరేక వ్యాఖ్యలు రావడం రివాజే. మన ఉన్నత విద్యా సంస్థలు ఆ స్థాయికి ఎప్పటికి చేరుకుంటాయన్న ఆవేదన వ్యక్తం చేసేవారు కొందరైతే...ఆ ర్యాంకింగ్‌లకు అనుసరించే విధానాన్ని, వర్థమాన దేశాలపట్ల వారికుండే చిన్నచూపునూ దుయ్యబట్టేవారు మరికొందరు. ఇక్కడ చదివి వెళ్లినవారు దిగ్గజాల దగ్గర పెద్ద పెద్ద సంస్థల్లో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నారని అలా దుయ్యబట్టేవారు గుర్తుచేసేవారు. మన ఉన్నత విద్యా సంస్థలు ర్యాంకులందించే సంస్థలకు తగిన సమాచారాన్ని ఇవ్వకపోవడంవల్లనే ఇలా జరుగుతోందని మరికొందరనేవారు. అయితే మన ఉన్నత విద్యా వ్యవస్థ తీరుతెన్నుల్ని...మన ప్రభుత్వాలు మొత్తంగా విద్యారంగంపై అనుసరిస్తున్న విధానాలనూ గమనిస్తే తప్ప ఈ వాదాల్లోని నిజానిజాలు తేలవు. మనకు ఇప్పుడొచ్చిన ర్యాంకులు కూడా అంత ఘనమైనవేమీ కాదు. వంద ఉన్నతశ్రేణి విద్యాసంస్థల జాబితాలో ఐఐఎస్‌సీ 99వ స్థానాన్ని పొందగా, 200 ఉన్నత శ్రేణి విద్యా సంస్థల్లో ఢిల్లీ ఐఐటీ 179వ స్థానాన్ని సంపాదించింది. ఐఐఎస్‌సీ నిరుడు పొందిన ర్యాంకు 327 అని గుర్తుంచుకుంటే ఈ ఏడాది అది ఎన్నివిధాల మెరుగైందో అర్థమవుతుంది.
మన దేశం గురించి మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడల్లా పొరుగునున్న చైనాను ప్రస్తావించుకోక తప్పదు. అంతర్జాతీయ విద్యా ర్యాంకింగుల్లో మనకంటే ఎప్పుడూ చైనాయే ముందుంటుంది. మనకంటే రెండేళ్లు ఆలస్యంగా వలస పాలననుంచి విముక్తి పొందిన చైనా ఇతర రంగాలతోపాటు విద్యా రంగంలోనూ దూసుకెళ్తున్నది. ముఖ్యంగా ఉన్నత విద్యారంగంలోకి అడుగుపెట్టే విద్యార్థుల సంఖ్య రీత్యా చూస్తే చైనాది ప్రపంచంలో తొలి స్థానం. మనది మూడో స్థానం. రెండు దేశాల్లోనూ ఉన్నత శ్రేణి విద్యా సంస్థల సంఖ్య తక్కువే. ఈ సంస్థలకు ప్రభుత్వాలపరంగా అందే నిధులతో పోల్చినా...అక్కడ లభించే నాణ్యతగల విద్యతో పోల్చినా మిగిలిన సంస్థలు వాటి దరిదాపుల్లోకి కూడా రావు. కనుకనే ఉన్నత విద్యా కోసం అటు చైనా నుంచి అయినా, ఇటు భారత్‌నుంచి అయినా ఏటా పెద్ద సంఖ్యలో విద్యార్థులు విదేశాలకు వెళ్తుంటారు.
కేవలం డబ్బుండబట్టే విద్యార్థులు ఇలా వెళ్తున్నారనుకోవడానికి లేదు. ఇటీవలే విడుదలైన ఒక నివేదిక ప్రకారం 2014-15లో అమెరికాలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థుల సంఖ్య లక్షా 32 వేల 888. ఇది అంతక్రితం సంవత్సరంకంటే 29.4 శాతం అధికం. వీరివల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థకు 360 కోట్ల డాలర్లు(సుమారు రూ. 23,760 కోట్లు) ఆదాయంగా లభించింది. అమెరికాలో ఉన్నత విద్యపై చూపుతున్న శ్రద్ధలో కొంచెమైనా మన ప్రభుత్వాలు చూపితే ఇన్ని వేల కోట్ల రూపాయలు అమెరికాకు తరలిపోయే పరిస్థితి ఉండదు. విద్యలో అమెరికాతో పోటీ పడటం మాట అటుంచి కనీసం చైనా కనబరుస్తున్న శ్రద్ధనైనా మన పాలకులు ప్రదర్శించలేకపోతున్నారు.
తమ ఉన్నత విద్యారంగం క్షీణ దశకు చేరువైన వైనాన్ని గమనించి 1995లో చైనా 'ప్రాజెక్టు 211' పేరిట ఒక పథకాన్ని ప్రకటించింది. దేశంలో వంద ఉన్నత శ్రేణి విశ్వవిద్యాలయాలను నెలకొల్పాలన్నది ఆ ప్రాజెక్టు ధ్యేయం. ప్రభుత్వంనుంచి వెల్లువలా వచ్చిపడిన నిధులతో ఉన్నత విద్యారంగంలో దిగ్గజాలనదగ్గవారిని ఆ యూనివర్సిటీలు అధ్యాపకులుగా నియమించుకున్నాయి. కనుకనే పరిశోధనలు జోరందుకున్నాయి. 2013లో ఆ యూనివర్సిటీలు 8,25,136 పేటెంట్లకు దరఖాస్తు చేయడం వీటి ఫలితమే. ఆ ఏడాది మన దేశంలో 43,031 దరఖాస్తులు దాఖలయ్యాయంటే మనం ఎక్కడున్నామో అర్ధం చేసుకోవచ్చు. సృజన, పరిశోధనలపై దృష్టి నిలపాలని యూపీఏ సర్కారు హయాంలో నిర్ణయించి అందుకోసం 2012లో ఒక బిల్లును కూడా రూపొందించారు. ఆ బిల్లు కాస్తా మూలనబడింది. ఉన్నతశ్రేణి విద్యా సంస్థలు నెలకొల్పేందుకు ఇతర మంత్రిత్వ శాఖలనూ అనుమతించేలా బిల్లును ప్రవేశపెట్టబోతున్నట్టు మొన్న ఏప్రిల్‌లో ఎన్డీయే సర్కారు ప్రకటించింది. పార్లమెంటు సమావేశాలు సరిగా సాగే పరిస్థితులుంటే ఇలాంటి బిల్లులపై కూలంకషంగా చర్చలు జరుగుతాయి. కానీ ఆ అవకాశమేదీ?
దేశంలో సాగుతున్న పరిణామాలను గమనిస్తే అసలు విద్యారంగాన్ని మన పాలకులు ఏం చేయదల్చుకున్నారన్న సందేహం తలెత్తుతుంది. ఉన్నత విద్యారంగాన్ని చైనా అందరికీ అందుబాటులో ఉండేలా రూపొందిస్తే మన దేశం అందుకు భిన్నమైన మార్గంలో పోతున్నది. ఈమధ్య నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ తో సంబంధం లేని పరిశోధక విద్యార్థులకు(నాన్ నెట్) ఫెలోషిప్ ఇవ్వదల్చుకోలేదని మానవ వనరుల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దానిపై ఆందోళనలు చెలరేగాక ఆ నిర్ణయం తాత్కాలికంగా ఆగింది. నిధుల కొరత పేరిట ఉన్నత విద్యను ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోర్సులు పెట్టి డబ్బున్నవారికే విద్య అంటున్నాయి. పేరుకు కొత్తగా ఐఐటీలు, ఐఐఎంలూ ప్రారంభిస్తున్నా వాటికి కావలసిన సదుపాయాల కల్పనలోనూ, నిధుల కేటాయింపులోనూ మొహం చాటేస్తున్నాయి. ఫీజుల ఖర్చును తడిసిమోపెడు చేస్తున్నాయి. ఇలాంటి దశలో ఉన్నత విద్యారంగం బాగుపడేదెప్పుడు? మన సంస్థలు ప్రపంచ ఖ్యాతి సాధించేదెన్నడు?