వర్సిటీలకు ర్యాంకింగ్‌లు అవసరం
ఏయూ క్యాంపస్: విశ్వ విద్యాలయాలకు జాతీయ, అంతర్జాతీయ ర్యాంకింగ్‌లు ఎంతో అవసరమని ఉన్నత విద్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సుమిత దావ్రా అన్నారు. ఏయూ పాలక మండలి సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏయూ అధికారులతో ఆమె సమావేశమై.. 15 అంశాలపై అధికారులు పనిచేస్తున్న తీరు, ప్రగతిని సమీక్షించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన పరిశోధనలు వర్సిటీకి అవసరమన్నారు. స్మార్ట్ క్యాంపస్‌గా ఏయూను తయారు చేయాలని సూచించారు. వర్సిటీ పూర్వవిద్యార్థుల సహకారం స్వీకరిస్తూ పరిశోధన ప్రాజెక్టులను సాధించాల్సి ఉందన్నారు. నాయకత్వం, పనిలో నాణ్యత, సామూహికంగా పనిచేసే తత్వాన్ని అలవరచుకోవడం ఎంతో అవసరమన్నారు. అందరికీ బాధ్యతలను పంచుతూ సమష్టిగా పనిచేయాలని, ఏయూ సాధిస్తున్న ప్రగతిని నాలెడ్జ్ మిషన్ వెబ్‌సైట్‌లో పొందుపరచాలని ఆదేశించారు. వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు మాట్లాడుతూ బోర్డ్ ఆఫ్ స్టడీస్‌లో పారిశ్రామిక నిపుణులను సభ్యులుగా నియమించి, వారి నుంచి విలువైన సూచనలు స్వీకరిస్తున్నామని చెప్పారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఈసీలో ఉంచి ఆమోదింపజేస్తామన్నారు. కార్యక్రమంలో వర్సిటీ రెక్టార్ ఆచార్య ఇ.ఏ నారాయణ, రిజిస్ట్రార్ ఆచార్య వి.ఉమా మహేశ్వరరావు, పాలక మండలి సభ్యుడు ఆచార్య ఎం.ప్రసాదరావు, ప్రిన్సిపాళ్లు సి.వి రామన్, డి.సూర్యప్రకాశరావు, గౌరీ శంకర్, గాయత్రీ దేవి, సి.హెచ్ రత్నం, రంగనాథం, ఎన్.ఎం యుగంధర్ పాల్గొన్నారు.