సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయి రేటింగ్, ర్యాంకింగ్స్‌లో తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు మరోసారి దేశంలోనే అట్టడుగు స్థానంలో నిలిచాయి. దేశంలోని 51 డిస్కంలలో టీఎస్‌ఎన్పి డీసీఎల్ 47వ ర్యాంకు, టీఎస్‌ఎస్పీడీసీఎల్ 43వ ర్యాంకుతో సరిపెట్టుకున్నాయి. ఈ మేరకు డిస్కంల 11వ వార్షిక రేటింగ్స్, ర్యాంకింగ్స్ నివేదికను కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మెరుగైన రేటింగ్, ర్యాంకింగ్ కలిగి ఉంటేనే డిస్కంలకు ప్రభుత్వరంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రుణాలు లభించనున్నాయి. ఈ మేరకు కేంద్రం లంకె పెట్టడంతో ఈ రేటింగ్స్ కీలకంగా మారాయి. రాష్ట్ర డిస్కంలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నట్లు ఈ నివేదిక స్పష్టం చేసింది.
డీ–గ్రేడ్‌కి అడుగు దూరంలో ...
డిస్కంల ఆర్థిక సుస్థిరతకు 75, పనితీరు సమర్థతకు 13, బయటి నుంచి ప్రభుత్వం/ఈఆర్సీల మద్దతుకు 12 కలిపి మొత్తం 100 స్కోరుకిగాను ఆయా డిస్కంలు సాధించిన స్కోరు ఆధారంగా వాటికి.. ఏ+, ఏ, బీ, బీ–, సీ, సీ–, డీ అనే గ్రేడులను కేటాయించింది. కీలక అంశాల్లో డిస్కంల వైఫల్యాలకు నెగెటివ్ స్కోర్‌ను సైతం కేటాయించింది. ఎస్పీడీసీఎల్ 10.8 స్కోరు సాధించి ‘సీ–’ గ్రేడ్‌ను, ఎన్పి డీసీఎల్ 6.6 స్కోరును సాధించి ‘సీ–’ గ్రేడ్‌ను పొందింది. చిట్టచివరి స్థానమైన ‘డీ గ్రేడ్’లో మేఘాలయ డిస్కం మాత్రమే నిలిచింది.
దేశం మొత్తం బకాయిల్లో 15% మనవే...
జెన్‌కో, ట్రాన్స్‌కోలకు దేశంలోని అన్ని డిస్కంలు చెల్లించాల్సిన బకాయిలు 2021–22 నాటికి రూ.2.81 లక్షల కోట్లకు ఎగబాకినట్టు కేంద్రం పేర్కొంది. అందులో ఎస్పీడీసీఎల్ వాటా ఏకంగా 10.3 శాతం కాగా, ఎన్పీడీసీఎల్ వాటా 4.3 శాతం కావడం గమనార్హం. జెన్‌కోల నుంచి డిస్కంలు కొనుగోలు చేసే విద్యుత్‌కు సంబంధించిన బిల్లులను 45 రోజుల్లోగా చెల్లించాల్సి ఉండగా ఎస్పీడీసీఎల్ 375 రోజులు, ఎన్పీడీసీఎల్ 356 రోజుల కిందటి నాటి బిల్లులను బకాయిపడ్డాయి. అంటే మన డిస్కంలు విద్యుదుత్పత్తి సంస్థలకు బకాయిల చెల్లింపులకు కనీసం ఏడాది సమయాన్ని తీసుకుంటున్నాయి.
దేశంలోనే అట్టడుగున మన డిస్కంలు
Published Wed, Apr 12 2023 3:04 AM | Last Updated on Wed, Apr 12 2023 3:04 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment