జులన్‌... నంబర్‌వన్‌ | Jhulan Goswami top ranked in womens bowling rankings | Sakshi
Sakshi News home page

జులన్‌... నంబర్‌వన్‌

Published Tue, Mar 5 2019 1:12 AM | Last Updated on Tue, Mar 5 2019 1:12 AM

Jhulan Goswami top ranked in womens bowling rankings - Sakshi

 దుబాయ్‌: ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ఎనిమిది వికెట్లు తీసి భారత మహిళల జట్టుకు సిరీస్‌ లభించడంలో కీలకపాత్ర పోషించిన టీమిండియా వెటరన్‌ పేసర్‌ జులన్‌ గోస్వామి... అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) మహిళల బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని అలంకరించింది. సోమవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో జులన్‌ టాప్‌ ర్యాంక్‌ను అందుకుంది. గత ర్యాంకింగ్స్‌లో మూడో స్థానంలో నిలిచిన 36 ఏళ్ల జులన్‌ ఈసారి రెండు స్థానాలు ఎగబాకి నంబర్‌వన్‌ స్థానానికి చేరుకుంది. బెంగాల్‌కు చెందిన జులన్‌ ఖాతాలో 730 ర్యాంకింగ్‌ పాయింట్లున్నాయి. 2016 ఫిబ్రవరిలో తొలిసారి వరల్డ్‌ నంబర్‌వన్‌ బౌలర్‌గా అవతరించిన జులన్‌ ఆ తర్వాత తన టాప్‌ ర్యాంక్‌ను కోల్పోయింది.

మళ్లీ ఇంగ్లండ్‌తో తాజా వన్డే సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేసి నంబర్‌వన్‌ స్థానాన్ని అందుకుంది. ఇప్పటివరకు 177 వన్డేలు ఆడిన జులన్‌ 218 వికెట్లు తీసింది. భారత్‌కే చెందిన మరో పేస్‌ బౌలర్‌ శిఖా పాండే 13వ ర్యాంక్‌ నుంచి ఐదో ర్యాంక్‌కు చేరుకుంది. దాంతో 2010 తర్వాత టాప్‌–5లో ఇద్దరు భారత పేస్‌ బౌలర్లు నిలువడం ఇదే ప్రథమం. 2010లో రుమేలీ ధర్, జులన్‌ టాప్‌–5లో నిలిచారు. బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో భారత్‌కే చెందిన స్మృతి మంధాన 797 పాయింట్లతో టాప్‌ ర్యాంక్‌లో కొనసాగుతోంది. 2012 తర్వాత అటు బౌలింగ్‌ విభాగంలో... ఇటు బ్యాటింగ్‌ విభాగంలో భారత ప్లేయర్లు నంబర్‌వన్‌ స్థానంలో ఉండటం ఇదే తొలిసారి. 2012లో జులన్‌ గోస్వామి... మిథాలీ రాజ్‌ ఈ ఘనత సాధించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement