మన ఉన్నత విద్యాసంస్థల బోధనా ప్రమాణాలెలా వున్నాయో, విద్యార్థులు తమ జ్ఞాన తృష్ణను తీర్చుకోవడానికి, తమ ప్రతిభాపాటవాలను మెరుగుపరచుకునేందుకు అవి ఎలా దోహదపడుతున్నాయో, పరిశోధనలకు ఆ విద్యాసంస్థలిచ్చే ప్రాధాన్యతలేమిటో తెలుసుకోవడానికి ఏటా ఆ సంస్థలు పొందే ర్యాంకులే ప్రమాణం. వాటి ఆధారంగానే విద్యార్థులు తమ తదుపరి గమ్యస్థానమేదో నిర్ణయించుకుంటారు. ఆ ఉన్నత విద్యాసంస్థలు సైతం తమను తాము సమీక్షించుకోవడానికి, లోటుపాట్లను సరిదిద్దుకోవడానికి, మెరుగుపడటానికి ఈ జాబితా దోహదపడుతుంది. గురువారం కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ర్యాంకుల జాబితాను ప్రకటించడంలో వున్న పరమార్థం ఇదే. ఎప్పటిలాగే ఐఐటీలు ముందు వరసలో వున్నాయి. తొలి పది ర్యాంకుల్లో ఏడు ఆ సంస్థలవే. అత్యున్నత శ్రేణి విద్యాసంస్థగా మద్రాసు ఐఐటీ నిలిచింది. బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్‌సీ) ద్వితీయ స్థానంలో వుంది. గత అయిదారేళ్లుగా ఆందోళనలతో హోరెత్తుతూ, మొన్న జనవరిలో చానెళ్ల సాక్షిగా గూండాల దాడులతో తల్లడిల్లిన జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్‌యూ) సైతం గతంలోవలే చదువుల్లో మెరిసింది. అది ఓవరాల్ కేటగిరిలో 8వ స్థానంలో, యూనివర్సిటీల కేటగిరీలో రెండో స్థానంలో వుంది. దేశవ్యాప్తంగా రగిలిన ఎన్నార్సీ, సీఏఏ వ్యతిరేక ఉద్యమాల తర్వాత ప్రముఖంగా వార్తల్లో నిలిచిన ఢిల్లీలోని జమియా మిలియా గత మూడేళ్లుగా వస్తున్న 12వ ర్యాంకు నుంచి ముందుకు కదిలి 10వ ర్యాంకులో నిలిచి ఔరా అనిపించుకుంది. వాస్తవానికి ఆ సంస్థ 2016నాటికి 83వ ర్యాంకులో వుండేదని గుర్తుంచుకుంటే... అక్కడి అధ్యాపకశ్రేణి దీక్షాదక్షతలు అర్ధమవుతాయి. విశ్వవిద్యాలయాల కేటగిరీలో హైదరాబాద్‌లోని కేంద్రీయ విశ్వవిద్యాలయం ఆరో ర్యాంకులోవుంటే, ఇంజనీరింగ్ కేటగిరిలో హైదరాబాద్ ఐఐటీ ఎనిమిదో స్థానంలో వుంది. న్యాయ విశ్వవిద్యాలయాల్లో హైదరాబాద్ నల్సార్‌ది మూడో ర్యాంకు.
ఒకప్పుడు మన పురాతన విద్యాకేంద్రాలు నలంద, తక్షశిల ప్రపంచానికి విజ్ఞాన కాంతులు వెదజల్లాయి. ఆ విశ్వవిద్యాలయాల్లో విద్వత్తును గడించడానికి పొరుగునున్న చైనా మొదలుకొని దూరతీరాల్లోని గ్రీస్ వరకూ ఎన్నో దేశాల నుంచి విద్యార్థులు వచ్చేవారు. అయితే అలాంటి ఘనత క్రమేపీ కొడిగట్టడం మొదలైంది. ఏటా అంతర్జాతీయ స్థాయిలో వివిధ సంస్థలు ప్రకటించే ర్యాంకుల్లో మన ఉన్నతశ్రేణి విద్యా సంస్థలు ఎక్కడో వుంటున్నాయి. జాతీయ స్థాయిలో మెరిసే విద్యాసంస్థలు కూడా అంతర్జాతీయ పోటీలో చివరాఖరికి పోతున్నాయి. మూడు రోజుల క్రితం ప్రకటించిన క్యూఎస్ 2021 ప్రపంచ విశ్వవిద్యాలయాల ర్యాంకుల్లో మన ఉన్నతశ్రేణి విద్యాసంస్థల తీరు ఆశాజనకం అనిపించదు. తొలి వంద విశ్వవిద్యాలయాల్లో మన దేశానికి చెందిన సంస్థ పేరు ఒక్కటీ లేదు. తొలి 200 ర్యాంకుల్లో మాత్రం బొంబాయి, ఢిల్లీ ఐఐటీలు, బెంగళూరు ఐఐఎస్‌సీ వున్నాయి. బొంబాయి ఐఐటీ 172(నిరుడు 152), ఢిల్లీ ఐఐటీ 193(నిరుడు 182), ఐఐఎస్‌సీ 185(నిరుడు 184) స్థానాల్లో వున్నాయి. ఈసారి మన దేశంలోని ఐఐటీల్లో మొదటి స్థానం పొందిన మద్రాసు ఐఐటీ క్యూఎస్‌లో 275వ స్థానంలో వుంది. మన విద్యాసంస్థలన్నీ గత జాబితాతో పోలిస్తే బాగా వెనకబడివున్నాయి. నిరుడు ప్రకటించిన జాబితాలోని 1,000 విద్యాసంస్థల్లో భారత సంస్థలు 25 వుండగా, ఈసారి అవి 21కే పరిమితమయ్యాయి. క్యూఎస్ ర్యాంకుల్ని విశ్వసించవద్దన్న ఢిల్లీ ఐఐటీ డైరెక్టర్ రాంగోపాల్‌రావు ప్రకటన సరైందే కావొచ్చు. ర్యాంకుల నిర్ణయానికి అంతర్జాతీయ సంస్థలు తీసుకునే కొలమానాలు సరైనవి కాకపోవచ్చు. కానీ మెరుగైన స్థాయి ర్యాంకులు రాకపోవడం, ఉన్న స్థితినుంచి మరింత కిందికి దిగజారడం అందరిలో అసంతృప్తి కలిగిస్తుందన్నది వాస్తవం. రాంగోపాల్‌రావు చెబుతున్నదాన్నిబట్టి ఈ ర్యాంకుల కోసం అధ్యాపకశ్రేణిలో, విద్యార్థుల్లో విదేశీయులెంత అనే అంశాలు పరిగణనలోకి తీసుకుంటారు. బోధన, పరిశోధన తదితర అంశాల్లో కూడా తమ ప్రమాణాలకు అనుగుణంగా లేకుంటే ఆమేరకు పాయింట్లు తగ్గిస్తారు. క్యూఎస్ తరహాలోనే టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్(టీహెచ్‌ఈ), షాంఘై జియావో టాంగ్ యూనివర్సిటీ తదితరాలు ప్రపంచశ్రేణి విద్యాసంస్థల జాబితాలను ప్రకటిస్తుంటాయి. దాదాపు అన్నిటా మనం తీసికట్టే.
మన విద్యాసంస్థలకు ప్రపంచశ్రేణి గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా రెండేళ్లక్రితం మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎన్. గోపాలస్వామి నేతృత్వంలో 13మందితో సాధికార నిపుణుల కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ పబ్లిక్ రంగంలో పది, ప్రైవేటు రంగంలో పది ఉన్నత విద్యాసంస్థలను ఎంపిక చేస్తుందని, ఆ జాబితాలో చోటు లభించిన సంస్థలకు ఏటా రూ. 1,000 కోట్ల చొప్పున సమకూరుస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. జాబితాలో నిరుడు మద్రాస్ ఐఐటీ, ఖరగ్‌పూర్ ఐఐటీ, ఢిల్లీ యూనివర్సిటీ, బెనారస్ హిందూ యూనివర్సిటీ, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం వున్నాయి. ఆ కార్యక్రమం అనుకున్నట్టే సాగుతున్నదో లేదో తెలియదుగానీ, అంతర్జాతీయ ర్యాంకుల్లో మన స్థితి మెరుగుపడటం మాట అటుంచి, మరింత కిందకు పోతోంది. ఘనతర విద్యాసంస్థలుగా మనం ప్రకటించుకున్నందుకైనా అవి అంతర్జాతీయంగా మెరుగైన తీరును ప్రదర్శిస్తే దేశంలోని ఇతర సంస్థలకు స్ఫూర్తిదాయకమవుతాయి. మార్గదర్శకంగా నిలుస్తాయి. అంతర్జాతీయ ర్యాంకులు, వాటి విశ్వసనీయత సంగతలావుంచి మన విద్యాసంస్థలు బోధనలో, పరిశోధనలో మరింత పదునెక్కాల్సిన అవసరం వుంది. ఆ సంస్థలకు తగిన వనరులను కల్పించని ప్రభుత్వాల వైఖరి మారితేనే ఇవి మెరుగుపడతాయన్నది కూడా అందరికీ తెలుసు. ర్యాంకులు వెల్లడైనప్పుడల్లా ఆయా విద్యాసంస్థలు మాత్రమే కాదు...పాలకులు సైతం తమ విధానాలు సమీక్షించుకోవాలి. సవరించుకోవాలి. అప్పుడు మాత్రమే విద్యారంగంలో గత వైభవం సాధ్యమవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment