ఉన్నత చదువులు చదువుకుని శిఖరాగ్రాన్ని అందుకోవాలని కలగన్న విద్యార్థిని ఐశ్వర్య చివరకు బలవన్మరణానికి పాల్పడటం మన విద్యా వ్యవస్థలో అమలవుతున్న అస్తవ్యస్థ విధానాలకు అద్దం పడుతోంది. మన పాలకులు ప్రాథమిక విద్యారంగంలో చాలా కృషి చేసినట్టు కనబడతారు. 14 ఏళ్ల వయసొచ్చేవరకూ ఉచిత నిర్బంధ విద్యను అమలు చేస్తున్న పాలకులు ఆ తర్వాత ‘మీ చావు మీరు చావండ’ని వదిలేస్తున్నారు. చదువుల్లో రాణిస్తూ పైపైకి ఎదగాలని కలగంటున్నవారికి మాత్రం ఎలాంటి దారీ చూపడం లేదు.
దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి అమల్లోకి తెచ్చిన ఫీజు రీయింబర్స్‌మెంటు పథకంవంటివి దేశంలో చాలాచోట్ల లేవు. కనుకనే విద్యా వ్యాపారం వేయి తలల నాగుపాములా విద్యార్థుల్ని కబళిస్తోంది. యువతను ఊరిస్తూ, వారి ఆకాంక్షల్ని సొమ్ము చేసుకోవ డానికి ప్రయత్నిస్తోంది. దాన్ని కూడా దాటుకుని ముందుకెళ్ల గలిగినవారికి ఉన్నత విద్య ఖరీదైన వ్యవహారంగా మారుతోంది. ఈ వైకుంఠపాళిలో అత్యంత ప్రతిభావంతురాలైన ఐశ్వర్య బలైపో యింది. ఆమె నిరుడు ఇంటర్మీడియెట్‌లో 98.5 శాతం మార్కులు సాధించడమే కాదు...ఢిల్లీ యూని వర్సిటీకి చెందిన పేరెన్నికగన్న లేడీ శ్రీరాం కాలేజీలో బీఎస్సీ మ్యాథ్స్(ఆనర్స్)లో సీటు కూడా సంపాదించుకుంది. అందుకోసం ఆ నిరుపేద కుటుంబం తమ ఇంటిని తాకట్టుపెట్టి రూ. 2 లక్షలు సమకూర్చవలసివచ్చింది. రెండో కుమార్తెను పాఠశాల మాన్పించవలసివచ్చింది.
‘సా విద్యా యా విముక్తయే’(విముక్తి ప్రసాదించేదే విద్య’) అన్న మకుటాన్ని ధరించిన ఆ కళాశాల ఆచరణలో ఐశ్వర్యవంటి నిరుపేద యువతులకు నిజంగా అక్కరకొస్తోందా? ఐశ్వర్య అక్కడ చేరడానికి ఆ కుటుంబం పడిన పాట్లు గమనించినా, ఆ చదువును కొనసాగించడం అసాధ్యమని నిర్ణయించుకుని ఆమె తనువు చాలించిన తీరు చూసినా ఆ కళాశాల ప్రకటిత ఉద్దేశానికీ, అక్కడ చదువుకునే నిరుపేద పిల్లల సమస్యలకూ పొంతన లేని వైనం వెల్లడవుతుంది. ఆ కళాశాలనుంచి మెరికల్లాంటివారు బయటికొస్తున్నారు. అందులో సందేహం లేదు. ఇప్పుడు భిన్నరంగాల్లో కీలక స్థానాల్లో వున్న అనేకమంది మహిళలు అక్కడ చదువుకున్నవారే. మయన్మార్ నేత ఆంగ్‌సాన్ సూకీ, బ్రిటానియా ఎండీ వినితా బాలి, బోఫోర్స్ స్కాంను బయటపెట్టిన చిత్రా సుబ్రహ్మణ్యం, ఐఎంఎఫ్‌లో కీలక పదవిలో వున్న గీతా గోపీనాథ్, ఇంకా అనేకమంది నాయకులు, ఉన్నతాధికారులు, ప్రముఖ జర్న లిస్టులు, రచయితలు ఒకప్పుడు ఆ కళాశాల విద్యార్థినులే.
ఐశ్వర్య చదువుకు లేడీ శ్రీరాం కళాశాలలో ఎదురైన అడ్డంకులు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఇంటర్మీడియెట్‌లో ప్రతిభ చూపినందుకు ఆమెకు ఇన్‌స్పైర్ పథకం కింద ఇవ్వాల్సిన ఉపకారవేతనం తొలి విడత మొత్తం ఎన్నడో మార్చిలో అందవలసివుండగా ఎనిమిది నెలలుగా అది పెండింగ్‌లో వుండిపోయింది. సెకండియర్ అయ్యాకే దాన్ని అందిస్తామని చెప్పారట. పైగా ఆ కాలేజీకి అను బంధంగా వుండే హాస్టల్‌ని సైతం కరోనా పేరుతో మార్చి 15న మూసేశారు. మొదటి సంవత్సరానికి మాత్రమే హాస్టల్ వుంటుందని, సెకెండియర్ విద్యార్థులు సొంత ఏర్పాట్లు చేసుకోవాలని విద్యార్థిను లకు వర్తమానం పంపారు.
అందుకు కారణాలేమైనా చెప్పవచ్చుగానీ... అవి సహేతుకమైనవి కాదు. సుప్రీంకోర్టు ఓబీసీ కోటా విషయంలో జారీచేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సివస్తోందని ప్రిన్సిపాల్, యాజమాన్యం నోటీసు జారీ చేసి చేతులు దులుపుకున్నారు. మిగిలిన రెండు సంవత్సరాలూ ఐశ్వర్యవంటి నిరుపేద విద్యార్థులు ఖరీదైన దేశ రాజధాని నగరంలో ఎలా మనుగడ సాగించాలో, చదువులెలా పూర్తిచేసుకోవాలో వారి బుర్రలకు తట్టలేదు. హాస్టల్ మూసివేతపై చర్చలకొస్తామని చెప్పిన విద్యార్థి సంఘానికి జవాబు లేదు. సెప్టెంబర్ 27న హాస్టల్ ఖాళీ చేయాలని ఐశ్వర్యకు తాఖీదు వచ్చింది.
ఢిల్లీ వంటిచోట పేయింగ్ గెస్ట్‌గా వుండాలన్నా నెలకు రూ. 30,000 తప్పనిసరి. పైగా ఈమధ్య మొదలైన ఆన్‌లైన్ విద్య అంతరాలను మరింతగా పెంచింది. రోజూ జరిగే 6, 7 తరగతుల కోసం ఒక మంచి ల్యాప్‌ట్యాప్, చదువుకు ఆటంకంలేకుండా మెరుగైన డేటాతో వైఫై కనెక్షన్ వుంటే తప్ప విద్యార్థుల అవసరాలు తీరవు. ఈ అవకాశంలేనివారు చదువుకు దూరం కావాల్సిందే. తరగతి గదినుంచి నిష్కారణంగా విద్యార్థిని గెంటేయడానికీ, దీనికి పెద్ద తేడా ఏమీ లేదు.
మన దేశంలో జరిగే ఎన్నికల్లో ఉద్యోగాలు, ఉపాధి చర్చకొస్తాయిగానీ... చదువులకు మాత్రం ఎప్పుడూ చోటుండదు. మంగళవారం ఫలితాలు వెలువడుతున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికలే తీసు కుంటే అక్కడ పది లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఒకరంటే, కాదు... కాదు 19 లక్షల ఉద్యోగాలిస్తామని మరొకరు హామీలిచ్చారు. ముఖ్యమంత్రిగా వున్న నితీష్‌కుమార్ అయితే ‘మేం ఇప్పటికే చాలా ఉద్యోగాలు ఇచ్చేశాం’ అని చెప్పారు. కానీ ప్రతిభగల పిల్లల్ని పాడె ఎక్కిస్తున్న విద్యారంగ అస్తవ్యస్థ విధానాల గురించి మాత్రం అక్కడ చర్చ లేదు.
అక్కడే కాదు... చాలా రాష్ట్రాల్లో చదువులపై సమగ్ర మైన చర్చ జరగడం లేదు. విద్యను ఆధునికీకరిస్తామని చెబుతున్న జాతీయ విద్యావిధానం కూడా ప్రైవేటు విశ్వవిద్యాలయాలు స్వతంత్రంగా, ఇష్టానుసారం ఫీజులు నిర్ణయించుకోవడానికి అనుమతి స్తోంది. అయితే సామాజిక బాధ్యతగా కనీసం 20 శాతంమంది పిల్లలకు ఉచిత విద్య, మరో 30 శాతంమందికి ఉపకారవేతనాలు ఇవ్వడం తప్పనిసరి చేస్తారట. ఆచరణలో ఇదేమవుతుందో చూడాలి. ఏదేమైనా తన మరణంతో ఐశ్వర్య ఉన్నత విద్యలో వున్న అంతులేని అగాధాలను బయట పెట్టింది. రకరకాల కారణాలతో ప్రతిభగల నిరుపేద పిల్లలకు తలుపులు మూసుకుంటున్న ఉన్నత విద్యాసంస్థల తీరును బయటపెట్టింది. ఈ లోపాలను సవరించి అందరికీ విద్యను అందుబాటులోకి తీసుకురావడం, ఆర్థిక కారణాలతో ప్రతిభగల విద్యార్థులు చదువుకు దూరం కాకుండా చూడటం పాలకుల బాధ్యత.
Comments
Please login to add a commentAdd a comment