ఒకరూ, ఇద్దరూ కాదు... ఈ ఏడాది ఇప్పటి వరకు 24 మంది. అదీ మొన్న ఆదివారం ఒక్కరోజే నాలుగు గంటల వ్యవధిలో ఇద్దరు విద్యార్థులు. దేశంలోని అగ్రశ్రేణి ఇంజనీరింగ్, మెడికల్ విద్యాసంస్థల్లో ప్రవేశపరీక్షలకు కోచింగ్ ఇచ్చే కర్మాగారంగా పేరొందిన రాజస్థాన్‌లోని కోటాలో ఆత్మహత్యల మరణమృదంగం ఆగకుండా మోగుతోంది. గత ఏడాది ఇదే పట్నంలో 15 మంది విద్యార్థులు ప్రాణాలు తీసుకుంటే, ఈ ఏడాది ఇప్పటికి ఎనిమిది నెలల్లోనే అంతకు మించి అమాయకులు బలవన్మరణానికి దిగారు.
గత ఎనిమిదేళ్ళలో అత్యధిక ఆత్మహత్యల సంఖ్య ఇదే. సంక్షోభ తీవ్రతను ఇది ప్రతిబింబిస్తోంది. రెండు నెలల పాటు ఈ కోచింగ్ కేంద్రాల్లో పరీక్షలను నిలిపివేస్తూ స్థానిక పాలనా యంత్రాంగం ఆదేశాలు జారీ చేయాల్సి వచ్చిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఉన్నత చదువులు చదివి, జీవితంలో ఉజ్జ్వలంగా ఎదగాల్సిన భావి పౌరులు పరీక్షల అతి ఒత్తిడితో ఆయువు తీసుకుంటున్న విషాదం మరోసారి అందరినీ ఆత్మపరిశీలనకు పురిగొల్పుతోంది.
కోటాలో ఆత్మహత్యలు ఇవాళ కొత్త కావు. కోచింగ్‌లతో పాటు ఒత్తిడి తట్టుకోలేని విద్యార్థుల బలవన్మరణాలకూ ఈ పట్నం కొన్నేళ్ళుగా పేరుబడింది. అక్కడన్నీ వారాంతపు సెలవైనా లేకుండా రోజుకు 14 నుంచి 18 గంటల పాటు పిండి రుబ్బినట్టు పాఠాలు రుబ్బించే విద్యార్థి కర్మాగారాలే! వాటిలో పిల్లలు అనుభవించే మానసిక చిత్రవధ వర్ణనాతీతం. కఠినమైన పాఠ్యప్రణాళికను పూర్తి చేయాలనే ఒత్తిడి, నిద్ర లేని రాత్రులు, నిరంతరం అంచనా పరీక్షలు, ఎక్కడ లేని పోటీ, వైఫల్య భయం, వీటన్నిటికీ తోడు తల్లితండ్రులకూ – ఇంటికీ దూరంగా ఒంటరి జీవితం... ఇవన్నీ పసి మనసుల్ని ప్రాణాలు తీసుకొనేంతగా ప్రేరేపిస్తున్నాయి.
పిల్లలపై మానసిక ఒత్తిడి, విద్యావిధానంలోని లోపాల గురించి దశాబ్దాలుగా చర్చ జరుగుతూనే ఉంది. కోటా మాత్రం అవేవీ పట్టకుండా ఏటేటా ఫలితాలందిస్తూనే ఉంది. వెరసి, ఇవాళ్టికీ ఈ కోచింగ్ కర్మాగారానికి తమ పిల్లలతో తల్లితండ్రులు పోటెత్తుతున్నారు. ఏటా 2.5 లక్షల మంది విద్యార్థులు వస్తుంటారు. అగ్రశ్రేణి టీచర్‌కు సంవత్సరానికి కోటి రూపాయల జీతమిచ్చే అక్కడ కోచింగ్ రూ. 5 వేల కోట్ల వార్షిక వ్యాపారం.
సమాజంలో యువతరం ఆకాంక్షలు నిరంతరం పెరుగుతున్నాయి. ఆర్థికవ్యవస్థలో అవకాశా లేమో అంతకంతకూ తగ్గుతున్నాయి. అదే ఇవాళ పెను ప్రజారోగ్య సమస్యగా తయారైంది. కోటా లోని పరిణామాలు అందుకు ప్రతీక. వికాసాన్ని కల్పించాల్సిన విద్యను వ్యాపారంగా మార్చడంతో తలెత్తిన సంక్షోభానికి పరాకాష్ఠ. ర్యాంకులే ధ్యేయంగా ప్రైవేట్ విద్యా వ్యాపారులు సృష్టించిన ఈ తరహా సంక్షోభం తెలుగు రాష్ట్రాల్లోనూ గతంలో మనం చూసినదే. దీనికి ఏ ఒక్కరో కాదు...అందరం బాధ్యులమే.
సృజనాత్మక కళల పట్ల ఆసక్తి ఉంది మొర్రో అంటున్నా శాస్త్ర సాంకేతిక విద్య వైపు పిల్లల్ని నెట్టడం, తాము కాలేకపోయిన ఇంజనీరో – డాక్టరో తమ పిల్లలు కావాలనుకోవడం, తోటి వారితో పోలికల మూర్ఖత్వం... ఇవన్నీ మన తప్పిదాలే! కోటాలోనే కాదు, దేశవ్యాప్తంగా అన్నిచోట్లా పరిస్థితిదే! నేషనల్ క్రైమ్‌రికార్డ్స్ బ్యూరో 2021 నివేదిక ప్రకారం దేశంలో విద్యార్థుల ఆత్మ హత్యలు 4.5 శాతం పెరిగాయి. ఆ దుష్కీర్తిలో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తమిళనాడు ముందున్నాయి. అయిదేళ్ళుగా ఇవి పెరుగుతున్నాయనీ నివేదిక స్పష్టం చేసింది. ఇది తాజా ప్రమాద ఘంటిక.
కోటాలో ఎక్కువమంది విద్యార్థులు డిప్రెషన్‌తో బాధపడుతున్నారని 2018లో టాటా ఇన్‌స్టి ట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ నివేదిక వెల్లడించింది. తాజా సర్వే ప్రకారం అక్కడ ప్రతి 10 మందిలో నలుగురు మానసిక ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొంటున్నవారే. కోచింగ్ సంస్థల్ని నియంత్రిస్తూ రాష్ట్ర సర్కార్ ఓ బిల్లును ప్రతిపాదించినా, ఇంకా అమలులోకి రాలేదు. వారానికో రోజు ఒక పూట చదువు, మరోపూట వినోదమనే పద్ధతి పాటించాలనీ, పక్షానికోసారి పిల్లల మానసిక ఆరోగ్య పరీ క్షలు నిర్వహించాలనీ రాజస్థాన్ ప్రభుత్వ తాజా ప్రతిపాదన.
గదుల్లో సీలింగ్ ఫ్యాన్ల బదులు గోడలకు బిగించే ఫ్యాన్లు పెట్టాలని 2021లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ వారు చెప్పారట! ఈసారేమో స్ప్రింగులు, సెన్సార్‌తో కూడిన సీలింగ్ ఫ్యాన్లు పెడితే ఆత్మహత్యా యత్నం చేసినా సరే ఉరి బిగుసుకోదంటూ స్థానిక పాలనా యంత్రాంగం వింత ఆలోచన చేసింది. మేడపై నుంచి కిందకు దూకకుండా వలలు, జాలీలు కట్టడం లాంటి తెలివితేటలూ హాస్టళ్ళు చూపుతున్నాయి. ఇవేవీ సమ స్యకు శాశ్వత పరిష్కారం కావు. పైగా తమపై నిత్యం నిఘా ఉందంటూ పిల్లల మనసుపై అదనపు ఒత్తిడి. నిజానికి సామాజిక, ఆర్థిక వాస్తవాలకు తగ్గట్టు పిల్లల్ని సిద్ధం చేస్తూ, అండగా నిలిచే విద్యా వ్యవస్థ అవసరం. అసలు సమస్యను వదిలేసి తాత్కాలిక ఉపశమనాల్ని ఆశ్రయిస్తే ఉపయోగం లేదు.
పరీక్షల్లో తక్కువ మార్కులొచ్చాయనీ, నలుగురిలో తలెత్తుకోలేమనీ, ఇంట్లో బాధపడతారనీ... ఆయువు తీసుకోవాలనుకోవడం పిల్లల్లో మనం నూరిపోస్తున్న తప్పుడు విలువలకు తార్కాణం. పిల్లలు అన్నిటా అద్భుతంగా రాణించాలనే విజేత స్వభావపు వ్యసనం నుంచి మనం బయటపడాలి. పిల్లలు, తల్లితండ్రులు, అధ్యాపకులు, విద్యాసంస్థలు, విధాన నిర్ణేతలు – అందరూ కలసి ఇకనైనా సంక్షోభ పరిష్కారానికి అత్యవసర చర్యలు చేపట్టాలి.
పసిపిల్లల ప్రాణాలు తీస్తున్న ఈ అగ్రశ్రేణి ప్రవేశపరీక్షల విధానంపై సమగ్ర దృష్టి సారించాలి. ఇరుకిరుకు గదుల్లో పిల్లల్ని కుక్కి, కోళ్ళఫారమ్ లలో కోడిపిల్లల్లాగా పిల్లల్ని చదివించడం, పెంచడం ఏ సమాజానికీ ఆరోగ్యం కాదు. అందుకే ఇవి ఆత్మహత్యలు కాదు... సమాజం సామూహికంగా చేస్తున్న హత్యలు. ఈ జాతీయ సంక్షోభంపై ఇప్పటికైనా పాలకులు కళ్ళు తెరవకుంటే, ఆ పసిహృదయాల ఉసురు తగులుతుంది.
Comments
Please login to add a commentAdd a comment