ఏమిటో.. ఈ మాయ !
Published Fri, Dec 23 2016 1:26 AM | Last Updated on Thu, Mar 28 2019 5:27 PM
సాక్షి ప్రతినిధి, ఏలూరు : సర్కారు లెక్కల ప్రకారం రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో అభివృద్ధి చెందినవి 12. అందులో 6 మన జిల్లాలోనే ఉన్నాయి. వీటిలోనూ 4 నియోజకవర్గాలు మొదటి నాలుగు స్థానాల్లో నిలిచాయి. విజయవాడలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ఈ ప్రకటన చూసి ప్రజలతోపాటు టీడీపీ నాయకులూ ముక్కున వేలేసుకుంటున్నారు. కనీస అభివృద్ధికీ నోచుకోని.. ప్రజాప్రతినిధులు పట్టించుకోని నియోజకవర్గాలకు ఉన్నత స్థానాలు ఎలా వచ్చాయి, ఎక్కడ లెక్కల మాయ జరిగిందనే అంశాలపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఎమ్మెల్యేలు నియోజకవర్గాలపై దృష్టి పెట్టకుండా.. సొంత పనులు చేసుకుంటూ కాలం గడుపుతుంటే మొదటి 4 స్థానాలు ఎలా వచ్చాయి, ఎవరిని మేనేజ్ చేసి ఉంటారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. నీరు–ప్రగతి పథకంలో అవినీతికి పాల్పడిన వారికి ర్యాంకులు దక్కడం చర్చనీయాం శంగా మారింది. చంద్రబాబు ఇచ్చిన ర్యాంకులను చూసి పార్టీ శ్రేణులే నవ్వుకునే పరిస్థితి ఉంది.
అవినీతిలో అగ్రపీఠం.. ర్యాంకులోనూ ప్రథమం
రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచిన గోపాలపురం నియోజకవర్గాన్ని తీసుకుంటే.. నల్లజర్ల మండలం పడమర చోడవరంలో నీరు–చెట్టు పథకం కింద నాలుగు చెరువుల్లో చేపట్టిన పనుల్లో రూ.40 లక్షలకు పైగా అవినీతి చోటు చేసుకుంది. కలెక్టర్ కె.భాస్కర్ స్వయంగా విచారణ జరిపి ఈ విష యాన్ని నిర్థారించారు. ప్రత్యేక దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించి మూడు నెలల్లో నివేదిక వెల్లడిస్తామని ప్రకటిం చారు. ఇది గడిచి 9 నెలలైంది. ఆ విచారణ ఏమైందోగానీ.. భారీస్థాయిలో అవినీతి జరిగినా నీరు–ప్రగతి పనులు బ్రహ్మాం డంగా జరిగాయంటూ ముఖ్యమంత్రే స్వయంగా గోపాలపురం నియోజకవర్గానికి అభివృద్ధిలో తొలి ర్యాంకు ప్రకటించడంపై చర్చోపచర్చలు సాగుతున్నాయి. ఈ నియోజకవర్గంలో 20 గ్రామాలను ఏటా ముంపునకు గురిచేస్తున్న పిచ్చుక గండిపై వం తెన నిర్మాణం చేపడతామన్న హామీ అమలుకు నోచుకోలేదు. రోడ్ల పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. పింఛన్ల కోసం చేసుకున్న దరఖాస్తులు పెండింగ్‌లోనే ఉన్నాయి. స్వచ్ఛభారత్ పథకం కింద చేపట్టిన మరుగుదొడ్ల నిర్మాణం అస్తవ్యస్తంగా ఉంది. ఈ నియోజకవర్గానికి మొదటి స్థానం ఏ లెక్కల ప్రకారం వచ్చిందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
భీమవరానికి నంబర్–2 !?
భీమవరం నియోజకవర్గానికి రాష్ట్ర స్థాయిలో రెండో ర్యాంక్ ప్రకటించారు.అభివృద్ధి పనులు పడకేసిన.. సంక్షేమ పథకాలకు దూరంగా ఉన్న తమ నియో జకవర్గానికి రెండో స్థానం వచ్చిందంటే మిగిలిన నియోజకవర్గాల్లో పరిస్థితి మరింత అధ్వానంగా ఉంటుందన్న అభిప్రాయం టీడీపీ నేతల్లో వ్యక్తం అవుతోంది. వీరవాసరం–పెనుమంట్ర రహదారిలో వీరవాసరం మొదలుకొని చింతలకోటిగరువు వంతెన వరకూ రహదారి పెద్దపెద్ద గోతులతో అధ్వానంగా తయారైంది. భీమవరం–లోసరి రహదారి పనులు ప్రారంభించి ఏళ్లు గడిచిపోతున్నాయి. యనమదుర్రు డ్రెయిన్‌పై చేపట్టిన వంతెన నిర్మాణాలకు మోక్షం కలగలేదు. వీరవాసరం మండలంలో ఎన్టీఆర్ అభయ హస్తం పింఛన్ల కోసం 1,939 మంది దరఖాస్తు చేసుకోగా, పెండింగ్‌లో ఉన్నాయి. భీమవరం మండలంలో 485 పింఛను దరఖాస్తులు రాగా, ఒక్కరికీ మంజూరు కాలేదు.
మట్టిని అమ్ముకున్నందుకు 3వ ర్యాంక్
మూడవ ర్యాంక్ పొందిన ఉంగుటూరు నియోజకవర్గానికి వెళితే.. నీరు–చెట్టు పథకం పనులు నిబంధనలకు విరుద్ధంగా జరిగాయి. అధికార పార్టీ నాయకులే రైతుల పేరిట బినామీలుగా వ్యవహరించి బిల్లులు డ్రా చేశారు. మట్టిని అమ్ముకున్నారు. పుష్కర నిధులు రూ.40 లక్షలతో ఉప్పాకపాడు–బొమ్మిడి మధ్య నిర్మించిన రోడ్డు పనుల్లో అవినీతి చోటుచేసుకుంది. పనుల్లో నాణ్యత లోపించి రాళ్లు పైకి వచ్చాయి.
సమస్యల కుప్పకు 4వ స్థానం
కుప్పలు తెప్పలుగా సమస్యలు పేరుకుపోయిన ఉండి నియోజకవర్గానికి 4వ స్థానం దక్కింది. రైతుల పాలిట శాపంగా పరిణమించిన ఉండి ఆక్విడెక్ట్ నిర్మాణం చేపట్టకపోవడంతో 11 వేల ఎకరాల్లో పంట ముంపునకు గురవుతోంది. ఎన్టీఆర్ వైద్యసేవ అమలు తీరు అంతంత మాత్రంగానే ఉంది. వేలిముద్రలు పడక 400 మంది వృద్ధులు పింఛను అందుకోలేక ఇబ్బంది పడుతుండగా, 900 మందికి పింఛన్లు పెండింగ్‌లో ఉన్నాయి.
ఆ రెండుచోట్లా అంతే
8వ ర్యాంక్ పొందిన నిడదవోలు నియోజకవర్గంలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. గ్రామాల్లో ఇప్పటికీ సరైన డ్రెయినేజీ వ్యవస్థ లేక ప్రజలు ఇళ్లముందే గుంతలు తవ్వుకుని మురుగును పారిస్తున్నారు. తణుకు నియోజకవర్గం విషయానికి వస్తే.. గత ఏడాది మొదటి స్థానంలో ఉండగా ఇప్పుడు 9వ స్థానానికి పడిపోయింది. తణుకు, ఇరగవరం, అత్తిలి మండలాల్లో 2,683 మంది పింఛన్ల్ల కోసం దరఖాస్తుల చేసుకోగా, రెండేళ్లుగా వీరిలో ఒక్కరికీ మంజూరు కాలేదు. మీకోసం కార్యక్రమాల్లో వచ్చిన దరఖాస్తుల్లో వెయ్యికి పైగా ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు.
Advertisement