కెరీర్ బెస్ట్ ర్యాంక్‌లో హైదరాబాద్ బ్యాటర్
69 స్థానాలు ఎగబాకిన తిలక్ వర్మ
మళ్లీ నంబర్‌వన్ ఆల్‌రౌండర్‌గా హార్దిక్ పాండ్యా
ఐసీసీ టి20 ర్యాంకింగ్స్
దుబాయ్: దక్షిణాఫ్రికాతో టి20 సిరీస్‌లో రెండు సెంచరీలతో విజృంభించిన భారత యువ ఆటగాడు ఠాకూర్ తిలక్ వర్మ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టి20 ర్యాంకింగ్స్‌లో అదరగొట్టాడు. సఫారీలపై ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచిన తిలక్ వర్మ ఐసీసీ బుధవారం విడుదల చేసిన టి20 బ్యాటింగ్ తాజా ర్యాంకింగ్స్‌లో తొలిసారి టాప్–10లోకి ప్రవేశించడమే కాకుండా... కెరీర్ అత్యుత్తమంగా 3వ స్థానానికి చేరుకున్నాడు.
ఈ క్రమంలో తిలక్ 69 స్థానాలు ఎగబాకడం విశేషం. ఈ జాబితాలో ఆ్రస్టేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ (855 పాయింట్లు) తొలి స్థానంలో ఉండగా... ఇంగ్లండ్ ప్లేయర్ ఫిల్ సాల్ట్ (828 పాయింట్లు) రెండో ర్యాంక్‌లో ఉన్నాడు. ప్రస్తుతం భారత్ నుంచి అత్యుత్తమ ర్యాంక్ గల ఆటగాడిగా తిలక్ వర్మ (806 పాయింట్లు) నిలవగా... సూర్యకుమార్ (788 పాయింట్లు) ఒక స్థానం కోల్పోయి నాలుగో ర్యాంక్‌కు పరిమితమయ్యాడు.
భారత్ నుంచి యశస్వి జైస్వాల్ (8వ ర్యాంక్) కూడా టాప్–10లో చోటు దక్కించుకున్నాడు. ఇదే సిరీస్‌లో రెండు సెంచరీలతో సత్తా చాటిన ఓపెనర్ సంజూ సామ్సన్ 22వ ర్యాంక్‌కు చేరాడు.
నాలుగు నెలల తర్వాత...
ఆల్‌రౌండర్ల జాబితాలో హార్దిక్ పాండ్యా నాలుగు నెలల తర్వాత మళ్లీ అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ ఏడాది జూన్ 29న తొలిసారి నంబర్‌వన్ ర్యాంక్ కు ఎగబాకిని పాండ్యా ఆ తర్వాత తన టాప్ ర్యాంక్‌ను కోల్పోయాడు.
అయితే దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో అటు బ్యాట్‌తో ఇటు బంతితో రాణించిన హార్దిక్ 244 పాయింట్లతో మళ్లీ నంబర్‌వన్ ర్యాంక్‌లో నిలిచాడు. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో భారత్ నుంచి అత్యుత్తమంగా రవి బిష్ణోయ్ ఎనిమిదో ర్యాంక్‌లో ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment