సాక్షి, సిటీబ్యూరో: స్వచ్ఛ సర్వేక్షణ్–2018లో హైదరాబాద్ 27వ ర్యాంక్‌లో నిలిచింది. లక్ష జనాభాపైబడిన నగరాల్లో గ్రేటర్‌కు ఈ ర్యాంకు ప్రకటించారు. గతేడాది జనాభాతో సంబంధం లేకుండా 434 నగరాల్లో హైదరాబాద్ 22వ స్థానంలో నిలవగా, ఈసారి లక్ష జనాభా మించిన 500 నగరాలతో పోటీపడి 27వ స్థానంలో నిలిచింది. గతం కంటే ఈసారి మరింత ఉన్నత ర్యాంక్‌ను సాధించేందుకు ఎంతో కృషి చేసి, దేశంలోనే ఘనవ్యర్థాల నిర్వహణలో ఉత్తమ రాజధానిగా అగ్రస్థానంలో నిలిచిన హైదరాబాద్.. స్వచ్ఛ ర్యాంకింగ్‌ల్లో మాత్రం పడిపోయింది. అయితే ఇతర మెట్రో నగరాలైన బెంగళూరు, కోల్‌కత్తా, చెన్నై కంటే ముందంజలోనే ఉండడం గమనార్హం.
గత సంవత్సరం 29వ స్థానంలో నిలిచిన గ్రేటర్ ముంబై ఈసారి 18వ స్థానంలో నిలిచి, హైదరాబాద్ కంటే ముందుంది. తెలంగాణలోని ఇతర కార్పొరేషన్లు, మునిసిపాలిటీల కంటే జీహెచ్‌ఎంసీ ముందంజలో నిలిచింది. గతంలో చిన్న పట్టణాలు, పెద్ద నగరాలు అన్నింటికీ కలిపి స్వచ్ఛ ర్యాంకులు ప్రకటించగా, ఈసారి లక్ష జనాభా మించిన నగరాలకు ప్రత్యేకంగా ర్యాంకులు ప్రకటించింది. స్వచ్ఛ కార్యక్రమాల అమలులో జీహెచ్‌ఎంసీ ముందున్నా.. ప్రజల ఫీడ్‌బ్యాక్‌లో మార్కులు తగ్గినందున ఓవరాల్ ర్యాంక్ తగ్గింది. దీంతో ఈ సంవత్సరం ప్రజలను మరింత ఎక్కువగా భాగస్వాములను చేసేందుకు జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది.
ప్రజాస్పందన తగ్గినందునే..
ప్రస్తుత 2018 స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మొత్తం మూడు విభాగాలకు కలిపి 4,000 మార్కులకు నిర్వహించిన సర్వేలో జీహెచ్‌ఎంసీకి 3,083 మార్కులు వచ్చాయి. వీటిలో సేవల ప్రగతికి 1400 మార్కులకు 973 లభించగా, స్వచ్ఛతకు నగరవాసుల స్పందనకు కేటాయించిన 1400 మార్కుల్లో 942 మాత్రమే వచ్చాయి. స్వచ్ఛ భారత్ మిషన్ ప్రతినిధులు స్వచ్ఛ కార్యక్రమాలపై నేరుగా జరిపిన క్షేత్రస్థాయి పరిశీలనలో 1200 మార్కులకు 1177 వచ్చాయి. 2016లో నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్‌లో నగరానికి 2000 మార్కుల్లో 1355 (67.70శాతం), 2017లో 1605 (80శాతం) మార్కులు, ప్రస్తుత 2018లో 4000 మార్కులకు 3,083 మార్కులు (77శాతం) లభించాయి.
రాష్ట్రంలోని ఇతర కార్పొరేషన్ల ర్యాంకులు..
గ్రేటర్ హైదరాబాద్‌కు 27వ స్థానం అనంతరం వరంగల్ కార్పొరేషన్‌కు 31వ స్థానం, సూర్యాపేట మున్సిపాలిటీ 45వ స్థానం, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ 73 స్థానంలోను నిలిచాయి.
ఇప్పటి దాకా జరిగిన స్వచ్ఛ ర్యాంకింగ్‌లో పాల్గొన్న పట్టణాలు, గ్రేటర్ ర్యాంకు ఇలా..
సంవత్సరం పట్టణాలు జీహెచ్‌ఎంసీ
2015 476 275
2016 73 19
2017 434 22
2018 500 27
ఈసారి మొత్తం 4041 నగరాలో స్వచ్ఛ ర్యాంకింగ్‌లో పాల్గొనగా, లక్ష జనాభా దాటిన నగరాలకు ప్రత్యేకంగా ర్యాంకులు ఇచ్చారు.
దేశంలోని వివిధ కార్పొరేషన్ల ర్యాంకుల తీరిదీ..
నగరం 2017 2018
హైదరాబాద్ 22 27
గ్రేటర్ ముంబై 29 18
బెంగళూర్ 210 216
చెన్నై 235 100
ప్రజల భాగస్వామ్యం పెంచుతాం
స్వచ్ఛ కార్యక్రమాల అమల్లో మంచి మార్కులే వచ్చినప్పటికీ, కేవలం ప్రజా స్పందన మార్కులే తగ్గాయి. ఈ అనుభవంతో ఈ ఏడాది వారి భాగస్వామ్యం పెంచుతాం. గతేడాది ఐదు లక్షల మంది విద్యార్థులతో చైతన్య కార్యక్రమాలు నిర్వహించగా, ఈసారి పది లక్షల మందికి అవగాహన కల్పిస్తాం. అలాగే నగరంలోని నాలుగున్నర లక్షల స్వయం సహాయక సంఘాల మహిళలను కూడా భాగస్వాములను చేస్తాం. ఈ సంవత్సరం స్వచ్ఛ కార్యక్రమాలను జూన్ 5న పర్యావరణ దినోత్సవంనాడే ప్రారంభించాం. ఇందులో భాగంగా కాలనీలతో పాటు పాఠశాలలు, కార్యాలయాలు, హోటళ్లు, ఫంక్షన్ హాళ్లకు కూడా స్వచ్ఛ ర్యాంకింగ్ ఇవ్వాలని నిర్ణయించాం. – డా.బి.జనార్దన్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్
Comments
Please login to add a commentAdd a comment