టాప్-10లో ఫెడరర్..
మెల్బోర్న్:ఇటీవల ముగిసిన ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ స్లామ్ పురుషుల సింగిల్స్లోవిజేతగా నిలిచిన స్విస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ తన ర్యాంకును మెరుగుపరుచుకున్నాడు. ఆస్ట్రేలియా ఓపెన్ ను గెలిచిన తరువాత ఫెడరర్ టాప్-10లో నిలిచాడు. తాజాగా విడుదల చేసిన ఏటీపీ ర్యాంకింగ్స్ లో ఫెడరర్ పదో స్థానానికి ఎగబాకాడు.
ఆస్ట్రేలియా ఓపెన్లో తన పూర్వపు ఫామ్ను అందుకున్న ఫెడరర్.. ఆ టోర్నీలో ఆద్యంత నిలకడగా రాణించి టైటిల్ ను ఎగురేసుకుపోయాడు. ఆదివారం జరిగిన తుది పోరులో ఫెడరర్ 6-4, 3-6, 6-1, 3-6, 6-3 తేడాతో స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్పై విజయం సాధించి గ్రాండ్ స్లామ్ను సొంతం చేసుకున్నాడు. హోరాహోరీగా సాగిన పోరులో ఫెడరర్ తన అనుభవాన్నిఉపయోగించి నాదల్ కు చెక్ పెట్టాడు. దాంతో ప్రపంచ ర్యాంకింగ్స్లో పైకి ఎగబాకాడు. మరొకవైపు మహిళల సింగిల్స్ లో విజేతగా నిలిచిన అమెరికా నల్ల కలువ సెరెనా విలియమ్స్ తిరిగి తన టాప్ ర్యాంకును సొంతం చేసుకుంది. ఈ గ్రాండ్ స్లామ్కు ముందు రెండో ర్యాంకులో ఉన్న సెరెనా.. టైటిల్ ను కైవసం చేసుకోవడంతో నంబర్ వన్ స్థానానికి చేరింది.