మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్‌లో డిఫెండింగ్ చాంపియన్ బరిలోకి దిగిన సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ తన జోరును కొనసాగిస్తున్నాడు. పురుషుల సింగిల్స్ సెమీ ఫైనల్లో స్విస్ దిగ్గజం రోజర్ ఫెడరర్‌పై గెలిచి ఫైనల్ బెర్తును ఖాయం చేసుకున్నాడు. ఈ రోజు జరిగిన సెమీస్‌లో జొకోవిచ్ 7-6(7/1), 6-4, 6-3 తేడాతో ఫెడరర్‌పై గెలిచి తుది పోరుకు అర్హత సాధించాడు. దాంతో ఫెడరర్‌తో ముఖాముఖి రికార్డును జొకోవిచ్ 27–23కు పెంచుకున్నాడు. ఇప్పటివరకూ ఏడుసార్లు ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ స్లామ్‌లు గెలిచిన జొకోవిచ్ మరో టైటిల్‌పై కన్నేశాడు. జొకోవిచ్ 2008, 2011, 2012, 2013, 2015, 2016, 2019ల్లో ఆస్ట్రేలియా ఓపెన్ గెలిచాడు. తాజా విజయంతో ఎనిమిదోసారి ఫైనల్లోకి ప్రవేశించాడు. ఇప్పటి వరకు ఈ టోర్నీలో సెమీఫైనల్ చేరిన ఏడుసార్లూ జొకోవిచ్ టైటిల్‌తో తిరిగి వెళ్లడం విశేషం. ఇప్పటివరకూ జొకోవిచ్ 16 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సాధించగా, 17వ టైటిల్ రేసులో నిలిచాడు.
ఈ రోజు జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో తొలి సెట్ టై బ్రేక్‌కు దారి తీసింది. జొకోవిచ్-ఫెడరర్‌లు ఇద్దరూ హోరాహోరీగా తలపడటంతో ఆ సెట్ కాస్తా టై బ్రేక్‌కు వెళ్లింది. కాగా, టై బ్రేక్‌లో జొకోవిచ్ వరుస పెట్టి పాయిట్లు సాధించి ఫెడరర్‌ను కష్టాల్లోకి నెట్టాడు. ఈ క్రమంలోనే 7/1 టై బ్రేక్ పాయింట్లతో సెట్‌ను కైవసం చేసుకున్నాడు. ఇక రెండో సెట్‌లో ఫెడరర్ పోరాడినప్పటికీ జొకోవిచ్ జోరు ముందు తలవంచక తప్పలేదు. మూడో సెట్ ఏకపక్షంగా జరగడంతో జొకోవిచ్ సెట్‌తో మ్యాచ్‌ను కైవసం చేసుకుని ఫైనల్ పోరుకు సిద్ధమయ్యాడు. రెండో సెమీ ఫైనల్లో థీమ్-జ్వరేవ్‌ల మధ్య విజేతతో జొకోవిచ్ ఆమీతుమీ తేల్చుకోనున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment