
వాషింగ్టన్: వివిధ దేశాల్లో వ్యాపారాలకు అనువైన పరిస్థితులకు సంబంధించి విడుదల చేసే ’డూయింగ్ బిజినెస్’ నివేదికను నిలిపివేయాలని ప్రపంచ బ్యాంకు నిర్ణయించింది. చైనాతో పాటు కొన్ని దేశాలకు ర్యాంకింగ్‌లు ఇచ్చే విషయంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు ఇందుకు కారణం. 2018, 2020 నివేదికల్లో డేటాపరమైన అవకతవకలు, బ్యాంకు సిబ్బంది నైతిక విలువలు పాటించకపోవడం వంటి ఆరోపణలపై అంతర్గతంగా విచారణ నిర్వహించిన నేపథ్యంలో డూయింగ్ బిజినెస్ నివేదికను నిలిపివేయనున్నట్లు ప్రపంచ బ్యాంకు వెల్లడించింది.
అప్పట్లో వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ జిమ్ యోంగ్ కిమ్, సీఈవో క్రిస్టలీనా జార్జియేవా.. ఆమె సలహాదారు ఒత్తిడి మేరకు చైనాకు మెరుగైన ర్యాంకింగ్ లభించేలా వరల్డ్ బ్యాంక్ సిబ్బంది డేటాను మార్చేశారని ఈ వ్యవహారంపై విచారణ జరిపిన న్యాయసేవల సంస్థ విల్మర్‌హేల్ నిర్ధారించింది. అయితే, ప్రస్తుతం అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్)కి డైరెక్టరుగా ఉన్న జార్జియేవా ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. విచారణ నివేదికలో వెల్లడైన విషయాలతో విభేదిస్తున్నట్లు స్పష్టం చేశారు. మరోవైపు, ప్రపంచ బ్యాంకు ఈ వివాదంపై సమగ్రమైన విచారణ నిర్వహించాలని, విశ్వసనీయతను పాటించాలని చైనా విదేశాంగ శాఖ అభిప్రాయపడింది. గత రెండు దశాబ్దాలుగా ఐఎంఎఫ్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వంటి అంతర్జాతీయ సంస్థలపై పట్టు సాధించేందుకు చైనా ప్రయతి్నస్తున్న నేపథ్యంలో తాజా పరిణామాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment