సాక్షి, చిలకలూరిపేట: మీ గ్రామంలో పారిశుద్ధ్య పరిస్థితి ఎలా ఉంది?.. మీ పట్టణంలో స్వచ్ఛతకు ఏ ర్యాంకు ఇవ్వవచ్చు?.. మీ ప్రాంతంలో స్వచ్ఛత విషయంలో అధికారుల పనితీరు ఎలా ఉంది?.. ఇలాంటి అంశాలపై ఇక ప్రజలే న్యాయనిర్ణేతలు. వారి అభిప్రాయం మేరకే ర్యాంకు నిర్ధారిస్తారు. ఇందు కోసం ఓ యాప్ రూపొందించి, దానిద్వారా అభిప్రాయాలను సేకరిస్తున్నారు. ఈ యాప్‌ద్వారా నిర్భయంగా మన అభిప్రాయాలు వెల్లడించి పారిశుధ్ధ్యాన్ని మెరుగు చేసుకొనే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఈ యాప్‌పై అవగాహన పెంచుకోవటం ద్వారా స్వచ్ఛతలో మనమూ భాగస్వాములు కావచ్చు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛభారత్ నినాదంతో పరిసరాల పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాయి. పల్లెల్లో పారిశుధ్ధ్య సమస్యలను ప్రజలు స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకువెళుతుంటారు. కాని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసి న స్వచ్ఛసర్వేక్షణ్ గ్రామీణ్ – 2019 సర్వే యాప్ ద్వారా నేరుగా పల్లె, పట్టణ ప్రజలే తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే అవకాశం కల్పించింది. దేశవ్యాప్తంగా స్వచ్ఛర్యాంకుల్లో మన జిల్లాస్థానాన్ని నిర్ధారించేందుకు జిల్లా ప్రజలే తమ ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఈ యాప్‌ద్వారా సర్వేలో పాల్గొనవచ్చు. సెప్టెంబర్ 25 తేదీవరకు యాప్ ద్వారా అభిప్రాయం తెలిపే అవకాశం ఉంది.
నాలుగు విధాలుగా సర్వే..
స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ కింద ప్రధానంగా నాలుగు విధాలుగా సర్వే చేయనున్నారు. అభిప్రాయాలను ర్యాంకుల ప్రాతిపదికగా తీసుకుంటారు. ప్రజా సంబంధిత ప్రదేశాల్లో ప్రత్యేక్ష పరిశీలనకు 25శాతం, పారిశుద్ధ్య ప్రమాణాలకు అనుగుణంగా పురోగతి ఉంటే 25 శాతం, యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో ప్రజాభిప్రాయ సేకరరణతో పాటు గ్రామాల్లో ప్రజలు నేరుగా ఇచ్చే ఫీడ్‌బ్యాక్‌కు 25శాతం, అధికారులు సమర్పించే ధ్రువీకరణకు, మరుగుదొడ్ల వినియోగంపై కలిపి 25శాతం మార్కులు కేటాయించారు. ఆయా అంశాల్లో ప్రజా స్పందన ఎక్కువగా ఉంటే జిల్లాకు మెరుగైన ర్యాంకు వచ్చే అవకాశం ఉంది.
ప్రజాభిప్రాయ సేకరణ..
గ్రామాల్లో పారిశుద్ధ్యం, పరిశుభ్రత తెలుసుకొనేందుకు ప్రజల నుంచి అభిప్రాయాలను ప్రభుత్వాలు సేకరిస్తున్నాయి. ప్రజలు చెప్పిన అభిప్రాయాలతో దేశవ్యాప్తంగా జిల్లాలకు ర్యాంకులు ఇస్తారు. ప్రధానంగా గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల సద్వినియోగం, కాల్వల శుభ్రత, తాగునీటి ట్యాంకుల క్లోరినేషన్ తదితర అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. జిల్లా యంత్రాంగం ఇచ్చే నివేదికలతో పాటు జిల్లావ్యాప్తంగా పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, పీహెచ్‌సీలు, వారపు సంతలు, పంచాయతీ కార్యాలయాలు ఉన్న చోట, జన సంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోని ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటారు. స్వచ్ఛత పురోగతిపై ఆరా తీస్తారు. దేశవ్యాప్తంగా 698 జిల్లాల్లో 17,475 గ్రామాల పరిధిలోని ఎంపిక చేసిన 87,375 పబ్లిక్ ప్రదేశాలలో ఈ సర్వేను నిర్వహిస్తారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 13 జిల్లాలలో 379 గ్రామాలు ఎంపిక చేశారు.
యాప్‌లో ఇలా...
ఆండ్రాయిడ్ అప్లికేషన్ ఉన్న ఫోన్‌లో ఒక నంబర్‌తో ఒక సారి మాత్రమే స్వచ్ఛసర్వేక్షణ్ గ్రామీణ్ – 2019 సర్వేలో ప్రజలు తమ అభిప్రాయాలను తెలియజేయాల్సి ఉంటుంది. ముందుగా సెల్‌ఫోన్‌లో ప్లేస్టోర్ నుంచి ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. యాప్ ఇన్‌స్టాలేషన్ తర్వాత అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. దానికి ఓకే బటన్ నొక్కాలి. తరువాత ఎస్‌ఎస్‌జీ సిటిజన్ ఫీడ్‌బ్యాక్ పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో రాష్ట్రం, జిల్లా, లాంగ్వేజ్, కాలమ్స్ వివరాలను పూర్తి చేశాక రెండు పేజీల్లో నాలుగు ప్రశ్నలు, నాలుగు ఆప్షన్లతో కనిపిస్తాయి.
1. మీరు స్వచ్ఛసర్వేక్షణ్ గ్రామీణ్ గురించి విన్నారా..? 2. స్వచ్ఛభారత్ అమలుతో మీ గ్రామంలో సాధారణంగా పరిశుభ్రత ఎంత వరకు మెరుగుపడింది? 3. ఘనవ్యర్ధాలను సురక్షితంగా పారవేయటానికి ఏర్పాట్లు ఉన్నాయా..? 4. ద్రవ వ్యర్ధాల కోసం గ్రామస్థాయిలో ఏర్పాట్లు జరగాయా? అనే ప్రశ్నలకు ఫీడ్‌బ్యాక్ ఇవాల్సి ఉంటుంది. వారి అభిప్రాయాన్ని తెలియజేసిన తరువాత సబ్‌మిట్ బటన్ నొక్కితే సర్వే పూర్తి అవుతుంది. అయితే జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఈ సర్వేపై తగిన ప్రచారం లేని కారణంగా ఎంతవరకు ప్రజాభిప్రాయం వెల్లడౌతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. స్వచ్ఛత, పరిశుభ్రత పెంచుకునేందుకు ప్రజలు తమ అభిప్రాయాన్ని వెల్లడించే అవకాశాన్ని ఈ వి«ధానం కల్పిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment