
సాక్షి, వరంగల్ అర్బన్: దేశవ్యాప్తంగా నగరాలు, పట్టణాలకు మధ్య నిర్వహించే స్వచ్ఛ సర్వేక్షణ్ 2019 పోటీలకు గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ సన్నద్ధమవుతోంది. పోటీల్లో అత్యుత్తమ ర్యాంక్ సాధించేందుకు అధికార యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. స్వచ్ఛత ప్రణాళికలపై దృష్టి కేంద్రీకరించింది. ఇటీవల కేంద్రం థర్డ్ పార్టీ బృందం క్యూసీఐ రాష్ట్రవ్యాప్తంగా నగరాలు, పట్టణాల్లో నిర్వహించిన సర్వేలో వరంగల్ నగరం 3వ ర్యాంక్ సాధించింది. ఈ నేపథ్యంలో కమిషనర్ వీపీ గౌతమ్, ఎంహెచ్‌ఓ రాజారెడ్డి, డిప్యూటీ కమిషనర్ ప్రశాంతి స్వచ్ఛ సర్వేక్షణ్‌లోని మార్గదర్శకాలపై శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, జవాన్లకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఉత్తమ ర్యాంక్ కోసం వ్యూహాలను రచించి, అమలుకు ఆదేశాలు ఇచ్చారు.
కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛభారత్ మిషన్ ద్వారా నగరాలు, పట్టణాలను స్వచ్ఛమైన నివాస ప్రాంతాలుగా మార్చాలన్న లక్ష్యంతో గత నాలుగేళ్లుగా గ్రేటర్‌లో స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. తొలి ఏడాది 2016లో స్వచ్ఛ సర్వేక్షణ్‌లో 73 నగరాల పోటీలో గ్రేటర్ వరంగల్ 32 ర్యాంక్ సాధించింది. 2017 సంవత్సరంలో 28వ ర్యాంక్ సాధించింది. ఇక 2018లో 31 ర్యాంక్‌ను దక్కించుకుంది. 2019లో ఉత్తమ ర్యాంక్‌ను సాధించేందుకు ప్రణాళిక లక్ష్యాల తయారీలో నిమగ్నమయ్యారు.
4,231 నగరాలు, పట్టణాలతో పోటీ
దేశవ్యాప్తంగా స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీలో 4,231 నగరాలు పోటీ పడుతున్నాయి. గతంలో ఎన్నాడూ లేని విధంగా పోటీ పెరిగింది. ఈ క్రమంలో గ్రేటర్ వరంగల్ అధికార యంత్రాంగం విరామం లేకుండా ప్రజల్లో అవగాహన కల్పిస్తూ శ్రమిస్తూ ఉత్తమ స్వచ్ఛ నగర కల సాకారం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.
సమయం రోజులే..
స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీ దగ్గర పడుతోంది. 2019 జనవరి 4 నుంచి ఫిబ్రవరి 4వ తేదీల్లో ఎప్పడైనా స్వచ్ఛ సర్వేక్షణ్ థర్డ్ పార్టీ క్యూసీఐ బృందాలు నగరాలు, పట్టణాల్లో తనిఖీ చేస్తాయి. స్వచ్ఛ సర్వేక్షణ్‌కు వస్తున్న బృందాల్లోని సీనియర్ అసెసర్లు నగరంలో క్షేత్ర స్థాయిలో పర్యటిస్తారు. ప్రజల అభిప్రాయాలు, వ్యక్తిగత మరుగుదొడ్లు, పబ్లిక్ టాయిలెట్ల పరిశుభ్రత, దేవాలయాలు, మసీదు, చర్చిలు, ఆర్టీసీ బస్‌స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, చెత్త సేకరిస్తున్న విధానం, అందుకు వినియోగిస్తున్న పారిశుద్ధ్య సిబ్బంది, వాహనాలు, సేకరించిన చెత్త నిల్వ కేంద్రాలు, చెత్త ప్రాసెసింగ్ తదితర వివరాలను మదింపు చేస్తారు. ప్రత్యేక ప్రశ్నవళి ద్వారా ప్రజలను ప్రశ్నించి వివరాలను రాబట్టుకుంటారు.
శ్రమించాల్సిందే..
మునిసిపాలిటీల వారీగా పరిస్థితి చూస్తే దేశవ్యాప్త పోటీలో సత్తా చాటడానికి చాలా సన్నద్ధత అవసరం. బహిరంగ మల మూత్ర విసర్జనను వంద శాతం నిషేధించాలి. ప్రతి ఇంటి నుంచి తడి, పొడి చెత్త వేరు చేసి అందించాలి. వేరు చేసేలా పారిశుద్ద్య కార్మికులు బాధ్యతగా తీసుకొని చేయించుకోవాలి. కార్మికులకు, జవాన్లకు నైపుణ్యాలపై శిక్షణ ఇప్పించాలి. సామర్థ్యాలను పెంచాలి. స్వచ్ఛత విషయంలో ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించాలి. గ్రేటర్ సిబ్బంది ఏదైనా కొత్తగా ప్రయత్నించాలి. ప్రజల ఫీడ్ బ్యాక్, నివాసాల పరిశుభ్రతపై అప్రమత్తం చేయాలి. గత ఏడాది కంటే బహిరంగ మల,మూత్ర విసర్జనలో వరంగల్ ఓడీఎఫ్ సర్టిఫికేట్‌ను సాధించింది. అంతేగాక అమ్మవారిపేటలో మల,మూత్ర వ్యర్థాల శుద్ధీకరణ అదనపు ప్లాంట్‌తో గ్రేటర్ వరంగల్‌కు కలిసోచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
ఇంటింటా తడి,పొడి చెత్త సేకరణ వంద శాతం జరగడం లేదు. సేకరించిన తడి చెత్తను శుద్ధీకరణ బాగా వెనుకబడిపోయాం. ప్లాంట్లు ఉన్నా శుద్ధీకరణ నిలిచిపోయింది. అంతేగాక వరంగల్‌ను ఓడీఎఫ్‌గా ప్రకటించినప్పటికీ ఇప్పటికే నగరంలో వీధికో చోట బహిరంగ మల, మూత్ర విసర్జన జరుగుతోంది. 8 వేలకు పైగా కుటుంబాలకు మరుగుదొడ్లు లేక బయటికి వెళ్తున్నారు. సెప్టిక్ ట్యాంకులు లేక 12 వేల ఇళ్ల నుంచి నేరుగా మల,మూత్ర వ్యర్థాలు కాల్వల్లోకి పారుతున్నాయి. ప్లాస్టిక్ వాడకం నిషేధంలో ఉంది. కానీ విచ్ఛలవిడిగా అమ్మకాలు, కొనుగోలు, వాడకం జరుగుతోంది. ఈ పరిణామాలు మార్కులకు గండికొట్టనున్నాయి. అందువల్ల గ్రేటర్ అధికార యంత్రాంగం స్వచ్ఛ సర్వేక్షణ్‌పై శ్రమించాల్సి ఉంది. ప్రజలను జాగృతం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.
విభాగాల వారీగా మార్కులు ఇలా
సర్వీస్ లెవెల్ బెంచ్ మార్కు |
1,250 |
థర్డ్ పార్టీ అసెసర్ల క్షేత్ర స్థాయి పరిశీలన |
1,250 |
సిటిజన్ ఫీడ్ బ్యాక్ ప్రజల అభిప్రాయానికి |
1,250 |
సర్టిఫికేషన్, ఓడీఎఫ్, గార్బేజీ ఫ్రీ సిటీ, కెపాసిటీ బిల్డింగ్ |
1,250 |