నీరసిస్తున్న ‘స్వచ్ఛ’ దీక్ష | People No Response To Swachh Survekshan | Sakshi
Sakshi News home page

నీరసిస్తున్న ‘స్వచ్ఛ’ దీక్ష

Published Fri, Jan 3 2020 8:05 AM | Last Updated on Fri, Jan 3 2020 8:05 AM

People No Response To Swachh Survekshan - Sakshi

తడి పొడి చెత్త విభజనపై ప్రజలకు సూచనలిస్తున్న కమిషనర్‌ సృజన

సాక్షి, విశాఖపట్నం : దేశ వ్యాప్తంగా ఆయా నగరాలకు కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డులు ప్రదానం చేస్తోంది. మొదటి మూడేళ్లలో 5, 3, 7 స్థానాల్లో నిలిచిన విశాఖ గతేడాది మాత్రం దారుణంగా చతికిలపడుతూ ఏకంగా 23వ స్థానానికి పరిమితమైపోయింది. దీనికి కారణం ప్రజలు దీనిపై స్పందించకపోవడం, అవగాహన రాహిత్యమనే చెప్పుకోవాలి. కారణమేదైనా మరోసారి స్వచ్ఛ సర్వేక్షణ్‌లో నగరం మురిసి మెరవాలంటే ప్రజలే కీలక పాత్ర పోషించాలి్సన అవసరం ఉంది. కానీ ఆశించినంత స్పందన మాత్రం ప్రజల నుంచి రావడం లేదు. దీంతో ఈ ఏడాది తొలిసారిగా ప్రవేశపెట్టిన లీగ్‌ దశల్లో విశాఖ గతేడాదితో పోలిస్తే రెండడుగులు ముందుకు వెళ్లినా ఫైనల్లో టాప్‌–10లో నిలిపేందుకు ఈ పెర్ఫార్మెన్స్‌ సరిపోదనే చెప్పాలి.

ఈ ఏడాది కాస్తా విభిన్నంగా...
స్వచ్ఛ సర్వేక్షణ్‌లో గత నాలుగేళ్లలో జరిగిన పోటీల్లో ప్రజలు చూపించిన చొరవ ప్రస్తుతం కనిపించడం లేదు. ఈసారి విభిన్నంగా సర్వేక్షణ్‌ పోటీని విభజించారు. ఈసారి మూడు క్వార్టర్లుగా విభజించి స్వచ్ఛ సర్వేక్షణ్‌ లీగ్‌–2020గా మార్చారు. ఏప్రిల్‌ నుంచి జూన్, జూలై నుంచి సెప్టెంబర్, అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌ వరకూ ప్రతి 3 నెలల్ని ఓ భాగంగా విభజించారు. అనంతరం జనవరి 4 నుంచి 31 వరకూ వార్షిక ప్రగతిపై ఢిల్లీ బృందాలు నేరుగా ఫీడ్‌ బ్యాక్‌ను తీసుకోనున్నాయి. చివరిగా మార్చిలో ర్యాంకులు వెల్లడించనున్నాయి. ప్రతి లీగ్‌లోనూ 2 వేల మార్కులుంటాయి. ఆ క్వార్టర్‌లోని ప్రతి నెలా 5వ తేదీలోపు ఆ నెలలో స్వచ్ఛ సర్వేక్షణ్‌కు సంబంధించి నిర్వహించిన పనులు, ఇతరత్రా వివరాలను కచ్చితంగా పొందుపరచాలి. దీన్నే మేనేజ్‌మెంట్‌ ఇన్ఫర్‌మేషన్‌ సిస్టమ్‌(ఎంఐఎస్‌)గా పిలుస్తారు.

ఈ ఎంఐఎస్‌లో ఆ నెలలో ఎలాంటి స్వచ్ఛత పనులు చేపట్టారన్న వివరాలను వార్డుల వారీగా నమోదు చెయ్యాలి. ఇలా పొందుపరిచిన వివరాల్ని సరిచూసేందుకు ప్రజల నుంచి ఫీడ్‌ బ్యాక్‌ను ఆ క్వార్టర్‌ చివరి నెలలో తీసుకుంటారు. దీని ప్రకారం మార్కులు కేటాయిస్తుంటారు. దీనికి తోడు ప్రతి క్వార్టర్‌లోనూ 1300 మార్కులకు తగ్గకుండా రావడంతో పాటు యావరేజ్‌ ర్యాంకులో 200 మార్కులు వస్తే 5 శాతం వెయిటేజీ ఇస్తారు. మొదటి రెండు క్వార్టర్లలోని ఎంఐఎస్‌లో ఎలాంటి డాక్యుమెంట్లు అప్‌లోడ్‌ చెయ్యకపోయినా పరిగణనలోకి తీసుకుంటారు. చివరి లీగ్‌లో మాత్రం అన్నింటికీ సంబంధించిన మొత్తం డాక్యుమెంట్లు అప్‌లోడ్‌ చెయ్యాల్సిందే. 12 అంశాలపై లీగ్‌ దశలో కాల్స్‌ రూపంలోనూ, యాప్‌ రూపంలోనూ సిటిజన్‌ ఫీడ్‌ బ్యాక్‌ తీసుకోనున్నారు. లీగ్‌కు సంబంధించిన డాక్యుమెంట్లన్నీ డిసెంబర్‌ 24కల్లా వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చెయ్యాల్సిందే. లీగ్‌లో పర్ఫార్మెన్స్‌కు 25 శాతం వెయిటేజీ లభిస్తుంది. లీగ్‌ దశ పూర్తి కాగానే జనవరి 4 నుంచి 31 వరకు దేశవ్యాప్తంగా కీలక సర్వే జరగనుంది.

మొదటి లీగ్‌లో 18 రెండో లీగ్‌లో 24
ప్రజల నుంచి వ్యాలిడేషన్‌ ద్వారా మార్కులు నిర్ధారించే ఈ లీగ్‌ దశ ఫలితాల్ని డిసెంబర్‌ 31న కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రభుత్వ ప్రోత్సాహం, జీవీఎంసీ ఉద్యోగులు, కార్మికులు నగరాన్ని స్వచ్ఛంగా ఉంచేందుకు తీసుకుంటున్న చర్యల కారణంగా 10 లక్షల పైచిలుకు జనాభా ఉన్న కేటగిరిలో విశాఖ నగరం 19వ స్థానంలో నిలిచింది. గతేడాది టాప్‌–10 లో ఉన్న విజయవాడ మాత్రం 20వ స్థానానికి పరిమితమైంది. అయితే రెండో క్వార్టర్‌లో మాత్రం నగర ప్రజలు అంతగా స్పందించకపోవడంతో మార్కుల్లో వెనుకబడిన విశాఖ 24వ స్థానానికి పరిమితమైపోయింది. విజయవాడ మాత్రం రెండో లీగ్‌లో 2 స్థానాలు మెరుగుపరచుకొని 20లో నిలిచింది. మొత్తంగా లీగ్‌–1లో 3,971 నగరాలు పాల్గొనగా విశాఖ 267వ స్థానంలో నిలవగా విజయవాడ మాత్రం 284 స్థానానికి పరిమితమైంది. లీగ్‌–2లో మొత్తం 4,157 నగరాల్లో విజయవాడ 288 ర్యాంకు సాధించగా విశాఖ మాత్రం ఏకంగా 409 నగరానికి పడిపోయింది.

పౌరుల స్పందనే ముఖ్యం.. కానీ..
లీగ్‌ దశలో 12 కేటగిరీల్లో జీవీఎంసీ చేసిన పనులకు తమ తరఫున మార్కులు వేసుకుంటారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌ బృందం ఆ మార్కులకు అనుగుణంగా సిటిజన్‌ వ్యాలిడేషన్‌ని ఫోన్‌ కాల్స్‌ ద్వారా తీసుకుంటుంది. వివిధ వర్గాల ప్రజల నుంచి ఫోన్‌ కాల్స్‌ ద్వారా జీవీఎంసీ వివరాలు అడుగుతుంది. వాటికి అనుకూల సమాధానం వస్తే వ్యాలిడేషన్‌లో ఎక్కువ మార్కులు వేస్తారు. ఫలితంగా మార్కులు పెరిగి ర్యాంకు పెరిగేది. లీగ్‌–1, లీగ్‌–2లో స్వచ్ఛభారత్‌ మిషన్‌ నుంచి వచ్చిన కాల్స్‌ని నగర ప్రజలు చాలా మంది రిసీవ్‌ చేసుకోకపోవడంతో పాటు నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో చాలా మార్కులను నగరం కోల్పోయింది. దీని వల్ల తొలి రెండు లీగ్స్‌లో సరైన స్థానాన్ని సంపాదించుకోలేకపోయింది. లీగ్‌–3 కూడా డిసెంబర్‌–31తో పూర్తయ్యింది. ఈ ర్యాంకుల్ని ఈ నెలలోనే ప్రకటించనున్నారు. ఆ లీగ్‌లోనైనా మంచి స్థానం సాధిస్తే ఫైనల్‌ ర్యాంక్‌కు తోడ్పడుతుంది.

4 నుంచి అసలైన ‘స్వచ్ఛ’ పరీక్ష
స్వచ్ఛ భారత్‌ మిషన్‌ (అర్బన్‌), ఎంఐఎస్‌ డేటా నవీకరణ ద్వారా 12 సేవాస్థాయి ధ్రువీకరణ ద్వారా ఒక్కో క్వార్టర్‌కు 2 వేల మార్కులు కేటాయిస్తారు. రెండు కేటగిరీలుగా ర్యాంకులు ఇస్తారు. ఈ నెల 4 నుంచి అసలైన పరీక్ష మొదలవ్వనుంది.

లీగ్‌ ర్యాంకులు స్వచ్ఛ సర్వేక్షణ్‌–2020 ఫలితాల్ని నిర్దేశిస్తాయి. ఇవి వార్షిక సర్వేకు 25 శాతం వెయిటేజీ ఇస్తాయి.
జనవరి 4 నుంచి 31 వరకు జరిగే ఈ సర్వేలో పౌరులు స్వయంగా పాల్గొనవచ్చు.
స్వచ్ఛతా హెల్ప్‌లైన్‌ నంబర్‌ 1969కి పౌరులు ఫోన్‌ చేసి తమ ప్రాంతంలోని పరిశుభ్రత, తదితర అంశాలపై ఫీడ్‌ బ్యాక్‌ తెలియపరచవచ్చు. లేదా స్వచ్ఛతా యాప్, స్వచ్ఛ  సర్వేక్షణ్‌–2020 పోర్టల్‌ ద్వారా గానీ, ఓట్‌ ఫర్‌ యువర్‌ సిటీ యాప్‌ ద్వారా గానీ పౌరులు స్పందన తెలియజేయవచ్చు.

ఉత్తమ స్థానంలో నగరాన్ని నిలబెడదాం
స్వచ్ఛ సర్వేక్షణ్‌–2020 నిబంధనలను ప్రతి ఒక్కరూ బాధ్యతగా అనుసరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా గార్బేజ్‌ ఫ్రీ సిటీ అమలు కోసం చర్యలు తీసుకోవాలని అధికారులు, సిబ్బందిని ఆదేశించాం. తడిపొడి చెత్త విభజన, సేకరణ, రవాణాకు అధిక ప్రాధాన్యమిస్తున్నాం. చెత్త ప్రోసెసింగ్‌ దినచర్యగా మారుతోంది. ఇప్పటివరకు ఉన్న 7 తడి చెత్త, 5 పొడిచెత్త ప్రోసెసింగ్‌ యూనిట్లు పూర్తి సామర్థ్యంతో వినియోగిస్తున్నాం. ఓఎఫ్‌డీ ప్లస్‌ ప్లస్‌ నగరంగా కొనసాగేందుకు జీవీఎంసీ పరిధిలో ఉన్న 328 కమ్యూనిటీ, పబ్లిక్‌ టాయిలెట్స్‌ నిర్వహణలో లోపాలు లేకుండా సమర్థవంతంగా నిర్వహిస్తున్నాం. ప్రజలంతా చెత్తను వేరు చేసి ఇస్తూ సిబ్బందికి సహకరించాలి. 2020 స్వచ్ఛ సర్వేక్షణ్‌లో విశాఖను మళ్లీ టాప్‌లో నిలబెట్టేందుకు అందరం కలిసి పనిచేద్దాం. ఈ నెల 4 నుంచి వచ్చే స్వచ్ఛ సర్వేక్షణ్‌ బృందానికి ప్రజలంతా సహకరించాలని కోరుతున్నాం.
– జి.సృజన, జీవీఎంసీ కమిషనర్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement