సీహెచ్.శ్రీకాంత్, విశాఖ పోలీస్ కమిషనర్
దొండపర్తి (విశాఖ దక్షిణ): నేర నియంత్రణతో పాటు ప్రజల భద్రతకు భరోసా కల్పించేలా విశాఖను సురక్షిత నగరంగా తీర్చిదిద్దనున్నారు. ఇందుకోసం నగర పోలీస్ శాఖ కసరత్తు చేస్తోంది. ప్రత్యేకంగా సొసైటీ ఫర్ విశాఖ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్(వీసీఎస్‌సీ) ఏర్పాటుకు నగర పోలీస్ కమిషనర్ సి.హెచ్.శ్రీకాంత్ సంసిద్ధులయ్యారు. ఇందుకోసం పరిశ్రమలు, ఐటీ, హెల్త్‌కేర్, ఫార్మా, రియల్ ఎస్టేట్, హాస్పిటాలిటీ వంటి పలు రంగాలకు చెందిన ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమై ప్రశాంత విశాఖకు చేపట్టాల్సిన చర్యలపై చర్చిస్తున్నారు.
కాస్మోపాలిటన్ సిటీగా..
విశాఖ పారిశ్రామిక, ఐటీ, పర్యాటక ఇలా అన్ని రంగాల్లో విశేషాభివృద్ధి దిశగా పయనిస్తోంది. దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున పరిశ్రమలు నగరానికి తరలివస్తున్నాయి. అలాగే విశాఖ అందాలను తిలకించేందుకు విదేశీ పర్యాటకులు సైతం ఆసక్తి చూపిస్తున్నారు. అన్ని రంగాల్లో దూసుకుపోతున్న విశాఖ కాస్మోపాలిటన్ సిటీగా రూపాంతరం చెందుతోంది. సిటీ ఆఫ్ డెస్టినీగా పేరుపొందిన విశాఖను ప్రశాంత నగరంగా తీర్చిదిద్దేందుకు పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది.
కొత్తగా వీసీఎస్‌సీ ఏర్పాటుకు చర్యలు
నగరంలో నేర నియంత్రణ కోసం ఇప్పటికే ప్రధాన జంక్షన్లు, ప్రాంతాల్లోనే కాకుండా కాలనీల్లోనూ పోలీస్ శాఖతో పాటు జీవీఎంసీ కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాయి. అయితే నగర పరిధి విస్తరిస్తుండడం, కొత్తగా పరిశ్రమలు ఏర్పాటవుతుండడం, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు విశాఖకు వస్తుండడంతో మరింత భద్రతా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని పోలీస్ శాఖ గుర్తించింది.
చదవండి: కాకినాడలో రామ్‌గోపాల్ వర్మ సందడి..
దీనికి అనుగుణంగా నిఘా వ్యవస్థను మరింత విస్తృతం చేయాలని నిర్ణయించింది. దీనికి పరిశ్రమలు, వ్యాపార సంస్థలు, ప్రజల నుంచి సహాయ సహకారాలు అవసరమన్న విషయాన్ని అన్ని వర్గాల వారికి అవగాహన కలిగిస్తున్నారు. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖలో ముఖ్యంగా మహిళలు, పిల్లల భద్రత, రోడ్ సేఫ్టీ, సైబర్ సేఫ్టీ, క్రైం మానిటరింగ్ వంటి రక్షణ చర్యలను మరింత పకడ్బందీగా అమలయ్యే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని నగర పోలీస్ కమిషనర్ శ్రీకాంత్ నిర్ణయించారు. ఇందుకోసం సిసీటీవీ, సైబర్ ల్యాబ్ వంటి సాంకేతికతను పెంపొందించేందుకు సొసైటీ ఫర్ విశాఖపట్నం సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ (వీసీఎస్‌సీ) ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.
సాంకేతికతతో నేరాలకు అడ్డుకట్ట
అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిఘా వ్యవస్థను మరింత పటిష్ట పరుచుకోవాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం ప్రభుత్వం, పోలీస్ శాఖ చేపట్టాల్సిన అన్ని చర్యలు తీసుకుంటున్నాం. సొసైటీ ఫర్ విశాఖపట్నం సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ ఏర్పాటు చేసి.. అందులో అందరి భాగస్వామ్యం అవసరమన్న విషయాన్ని తెలియజేస్తున్నాం.
–సీహెచ్.శ్రీకాంత్, విశాఖ పోలీస్ కమిషనర్
Comments
Please login to add a commentAdd a comment