visakha city police commissioner
-
విశాఖలో.. భద్రతకు భరోసా
దొండపర్తి (విశాఖ దక్షిణ): నేర నియంత్రణతో పాటు ప్రజల భద్రతకు భరోసా కల్పించేలా విశాఖను సురక్షిత నగరంగా తీర్చిదిద్దనున్నారు. ఇందుకోసం నగర పోలీస్ శాఖ కసరత్తు చేస్తోంది. ప్రత్యేకంగా సొసైటీ ఫర్ విశాఖ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్(వీసీఎస్‌సీ) ఏర్పాటుకు నగర పోలీస్ కమిషనర్ సి.హెచ్.శ్రీకాంత్ సంసిద్ధులయ్యారు. ఇందుకోసం పరిశ్రమలు, ఐటీ, హెల్త్‌కేర్, ఫార్మా, రియల్ ఎస్టేట్, హాస్పిటాలిటీ వంటి పలు రంగాలకు చెందిన ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమై ప్రశాంత విశాఖకు చేపట్టాల్సిన చర్యలపై చర్చిస్తున్నారు. కాస్మోపాలిటన్ సిటీగా.. విశాఖ పారిశ్రామిక, ఐటీ, పర్యాటక ఇలా అన్ని రంగాల్లో విశేషాభివృద్ధి దిశగా పయనిస్తోంది. దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున పరిశ్రమలు నగరానికి తరలివస్తున్నాయి. అలాగే విశాఖ అందాలను తిలకించేందుకు విదేశీ పర్యాటకులు సైతం ఆసక్తి చూపిస్తున్నారు. అన్ని రంగాల్లో దూసుకుపోతున్న విశాఖ కాస్మోపాలిటన్ సిటీగా రూపాంతరం చెందుతోంది. సిటీ ఆఫ్ డెస్టినీగా పేరుపొందిన విశాఖను ప్రశాంత నగరంగా తీర్చిదిద్దేందుకు పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. కొత్తగా వీసీఎస్‌సీ ఏర్పాటుకు చర్యలు నగరంలో నేర నియంత్రణ కోసం ఇప్పటికే ప్రధాన జంక్షన్లు, ప్రాంతాల్లోనే కాకుండా కాలనీల్లోనూ పోలీస్ శాఖతో పాటు జీవీఎంసీ కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాయి. అయితే నగర పరిధి విస్తరిస్తుండడం, కొత్తగా పరిశ్రమలు ఏర్పాటవుతుండడం, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు విశాఖకు వస్తుండడంతో మరింత భద్రతా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని పోలీస్ శాఖ గుర్తించింది. చదవండి: కాకినాడలో రామ్‌గోపాల్ వర్మ సందడి.. దీనికి అనుగుణంగా నిఘా వ్యవస్థను మరింత విస్తృతం చేయాలని నిర్ణయించింది. దీనికి పరిశ్రమలు, వ్యాపార సంస్థలు, ప్రజల నుంచి సహాయ సహకారాలు అవసరమన్న విషయాన్ని అన్ని వర్గాల వారికి అవగాహన కలిగిస్తున్నారు. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖలో ముఖ్యంగా మహిళలు, పిల్లల భద్రత, రోడ్ సేఫ్టీ, సైబర్ సేఫ్టీ, క్రైం మానిటరింగ్ వంటి రక్షణ చర్యలను మరింత పకడ్బందీగా అమలయ్యే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని నగర పోలీస్ కమిషనర్ శ్రీకాంత్ నిర్ణయించారు. ఇందుకోసం సిసీటీవీ, సైబర్ ల్యాబ్ వంటి సాంకేతికతను పెంపొందించేందుకు సొసైటీ ఫర్ విశాఖపట్నం సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ (వీసీఎస్‌సీ) ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. సాంకేతికతతో నేరాలకు అడ్డుకట్ట అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిఘా వ్యవస్థను మరింత పటిష్ట పరుచుకోవాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం ప్రభుత్వం, పోలీస్ శాఖ చేపట్టాల్సిన అన్ని చర్యలు తీసుకుంటున్నాం. సొసైటీ ఫర్ విశాఖపట్నం సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ ఏర్పాటు చేసి.. అందులో అందరి భాగస్వామ్యం అవసరమన్న విషయాన్ని తెలియజేస్తున్నాం. –సీహెచ్.శ్రీకాంత్, విశాఖ పోలీస్ కమిషనర్ -
ప్రతీదానికి 'పద్ధతి' అంటాడు...
సీపీ అమిత్‌గార్గ్ బదిలీకి టీడీపీ ఎమ్మెల్యేల పట్టు హైదరాబాద్ స్థాయిలో జోరుగా లాబీయింగ్ హోంమంత్రితో భేటీ... మా పనులు చేయడంలేదని ఫిర్యాదు సీఎంకు చెప్పండంటూ తప్పించుకున్న చినరాజప్ప చక్రం తిప్పుతున్న వివాదాస్పద ఎమ్మెల్యే 'అన్నింటికీ రూల్స్ అంటారు.. పద్ధతిగా వెళ్లాలంటారు... పోలీసులే అలా ఉంటే ఇక మేమెందుకు?.. అతని అండ చూసుకొని దిగువస్థాయి అధికారులూ మమ్మల్ని పట్టించుకోవట్లేదు. అధికార పార్టీ ఎమ్మెల్యేలమైనప్పటికీ పోలీస్ స్టేషన్లో మా మాట చెల్లడం లేదు... మావాళ్ల పనులు జరగడం లేదు. ఈ పరిస్థితికి కారణమైన పోలీస్ బాస్ మాకొద్దే వద్దు.. అతన్ని తక్షణమే బదిలీ చేయండి'.. ఇదీ నగర టీడీపీ ఎమ్మెల్యేల డిమాండ్. నిబంధనల మేరకు వ్యవహరిస్తున్న నగర పోలీస్ కమిషనర్ అమిత్ గార్గ్‌ను వదిలించుకోవాలన్న తమ డిమాండ్‌పై అధికార టీడీపీ ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై మళ్లీ ఒత్తిడి ప్రారంభించారు. అమిత్గార్గ్పై టీడీపీ ఎమ్మెల్యేలు కొంతకాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నది బహిరంగ రహస్యమే. తాజాగా మళ్లీ గళమెత్తి ఆయన్ను బదిలీ చేయాల్సిందేనని హోంమంత్రితో పాటు సీఎం కార్యాలయం ఉన్నతాధికారుల వద్ద పట్టుబట్టినట్టు సమాచారం. ప్రధానంగా నగరానికి చెందిన ఓ వివాదాస్పద ఎమ్మెల్యే చొరవ తీసుకొని ఒత్తిడి తీసుకురావస్తుండటం గమనార్హం. తమ అడ్డగోలు వ్యవహారాలకు అడ్డంకిగా నిలుస్తున్నందునే సీపీని బదిలీ చేయించడానికి చురుగ్గా పావులు కదుపుతున్నారు. ఆయన ఉంటే మేం పమీ చేయలేం ... సీపీని ఈసారి ఎలాగేనా బదిలీ చేయించాలన్న ధేయ్యంతో నగర టీడీపీ ఎమ్మెల్యేలు చురుగ్గా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే వారు నగరంలో రెండుమూడుసార్లు సమావేశమై సీపీ వ్యవహారంపై చర్చించారు. ఆయన్ని బదిలీ చేయించాలని మంత్రుల ద్వారా చెప్పించారు. కానీ పోలీసు ఉన్నతాధికారులు సానుకూలంగా స్పందించకపోవడంపై ఎమ్మెల్యేలు గుర్రుగా ఉన్నారు. త్వరలో ఐపీఎస్ అధికారుల బదిలీలు ఉంటాయన్న సమాచారంతో మరోసారి బదిలీ అంశాన్ని తెరపైకి తెచ్చారు. హోంమంత్రి చినరాజప్ప దృష్టికి సీపీ వ్యవహరాన్ని తీసుకువెళ్లారు. పోలీస్ స్టేషన్లలో కూడా తమ మాట చెల్లడం లేదని.. ఎమ్మెల్యేగా తమను గుర్తించడం లేదని ఫిర్యాదు చేసినట్లు సమాచారం. సీపీని చూసుకునే ఇతర పోలీస్ అధికారులు కూడా తమను పట్టించుకోవడం లేదని కూడా చెప్పుకొచ్చారు. కాగా దీనిపై హోం మంత్రి చినరాజప్ప నుంచి వారికి స్పష్టమైన హామీ లభించలేదని సమాచారం. ఐపీఎస్ స్థాయి అధికారుల పోస్టింగులు నేరుగా సీఎం చేంద్రబాబే చూసుకుంటున్నారని చెప్పి ఆయన తప్పుకున్నారు. దాంతో ఎమ్మెల్యేలు సీఎం చంద్రబాబును అసెంబ్లీలో కలిసేందుకు ప్రయత్నించారు. కానీ మహిళా దినోత్సవ కార్యక్రమల్లోపాల్గొనేందుకు ఆయన వెళ్లిపోవడంతో అవకాశం దక్కలేదు. దాంతో సీఎం కార్యాలయ ఉన్నతాధికారులను కలిసి సీపీ అంశాన్ని ప్రస్తావించినట్లు తెలుస్తోంది. జీవీఎంసీ ఎన్నికలనాటికి తాము పట్టుసాధించాలంటే సీపీని బదిలీ చేసి తమకు ఉఅనుకూలుడైన అదికారిని నియమించాలని కోరారు. ఆ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లాలని చెప్పారు. చక్రం తిప్పుతున్నది ఆయనే.... నగరానికి చెందిన ఓ వివాదాస్పద ఎమ్మెల్యేనే సీపీ అమిత్ గార్గ్ బదిలీకి ప్రధానంగా పట్టుబడుతున్నారు. నగర పార్టీ బాధ్యత తనదిగా చెప్పుకుంటూ ఆయన ఈ అంశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. నగరంలో కొన్ని నెలలు క్రితం జరిగిన ఓ అనుమానస్పద మృతి కేసులో ఆ ఎమ్మెల్యే పాత్ర వివాదాస్పదమైంది. అదే విధంగా ఆయన పరిధిలోనే ప్రైవేట్ గ్యాంగ్‌లు విచ్చలవిడిగా చెలరేగిపోతున్నాయి. దీనిపై కూడా పోలీసులు కఠినంగా వ్యవహరించారు. పోలీసు అధికారులు తన మాట వినకుండా రూల్స్‌కు కట్టుబడటం ఆ ఎమ్మెల్యేకు ఆగ్రహం తెప్పించింది. దాంతో సీపీపై కొంత అసంతృప్తితో ఉన్న సహచర ఎమ్మెల్యేలను కూడగట్టి ఆయన్ను బదిలీ చేయించడానికి కొంతకాలంగా ప్రయత్నిస్తున్నారు. తాజాగా జీవీఎంసీ ఎన్నికల అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ సీపీ అమిత్ గార్గ్ బదిలీకి పట్టుబడుతున్నారు. ఈ బదిలీ రాజకీయాలు పోలీస్ అధికారుల మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నాయని కొందరు అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.