సాక్షి, విశాఖపట్నం: దేశంలో, రాష్ట్రంలో ప్రస్తుతం విచిత్ర పరిస్థితులున్నాయని వైఎస్సార్ సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. బ్యాంకుల్లో డబ్బుల్లేవు.. జనం ఇబ్బందులు పడుతున్నారని కేంద్ర ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వాల అంకెల గారడీ తప్ప.. అభివృద్ధి లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని బొత్స ధ్వజమెత్తారు. అంతేకాక కిడ్నాప్‌లు, హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్నారని.. ఆ తర్వాత ప్యాకేజీకి ఒప్పుకున్నారని ఆయన విమర్శించారు.
ప్రత్యేక హోదా కోసం గత నాలుగేళ్ల నుంచి వైఎస్సార్ సీపీ ఉద్యమాలు చేస్తుందన్నారు. ఇప్పుడు ఎన్నికలు దగ్గరపడ్డాయి కాబట్టి టీడీపీ నేతలు హోదా పేరుతో డ్రామాలాడుతున్నారని బొత్స విరుచుకుపడ్డారు. ‘పార్లమెంట్‌లో వైఎస్సార్ సీపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టింది. ముందు కాదని చెప్పినా.. ఆ తర్వాత టీడీపీ కూడా అదే దారిలోకి వచ్చింది. ఎంపీలు రాజీనామాలు చేస్తే దండగన్నారు.. హేళన కూడా చేశారు. బంద్‌లో పాల్గొన్న వారిపై కేసులు పెట్టారు. ఓ వైపు హోదా అంటూనే.. మరోవైపు పోరాటాన్ని నీరు గారుస్తున్నార’ని బొత్స సత్యనారాయణ ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment