సాక్షి, అనంతపురం : తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతాపార్టీలు నాలుగేళ్ల పాటు ప్రజలను మోసం చేశాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. సోమవారం అనంతపురంలో జరుగుతున్న వంచన గర్జన దీక్షలో ప్రసంగించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వెనుక బడిన జిల్లాల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయించడం లేదని మండిపడ్డారు. నాలుగేళ్లపాటు రాష్ట్రాన్ని వంచించిన పార్టీలు మళ్లీ మోసం చేయడానికి ప్రజల ముందుకు వస్తున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
గతంలో హోదా కోసం దీక్షలు, ఉద్యమాలు చేసిన వారిపై కేసులు పెట్టిన తెలుగుదేశం ప్రభుత్వానికి ప్రత్యేక హోదా గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. ప్రజలను మభ్యపెట్టడానికే తెలుగుదేశం నేతలు దొంగదీక్షలు చేస్తున్నారంటూ విమర్శించారు. ప్రజలు టీడీపీని దొంగ దీక్షలను ప్రజలు గమనిస్తున్నారని, త్వరలోనే గుణపాఠం చెబుతారని అన్నారు. విభజన హామీలను నెరవేర్చకుండా టీడీపీ, బీజేపీలు రాష్ట్ర ప్రజలకు మోసం చేశారని ద్వజమెత్తారు. నాలుగేళ్లుగా టీడీపీ అవినీతి పాలన చేస్తుందని అన్నారు.
చట్టప్రకారం రాష్ట్రానికి రావాల్సిన హక్కులను చంద్రబాబు కాలరాశారని బొత్స మండిపడ్డారు. విభజన హామీల అమలుకై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి పోరాడుతోందని బొత్స సత్యనారాయణ అన్నారు. విభజన హామీల అమలు కోసం వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఉద్యమాలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. తెలుగుదేశం, బీజేపీలు చేసిన మోసాలపై ప్రజలకు అప్రమత్తం చేయడానికే వంచనపై గర్జన దీక్ష చేపట్టినట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment