సాక్షి, న్యూఢిల్లీ: తమ రాజీనామాలను లోక్‌సభ స్పీకర్ ద్వారా ఆమోదింపజేసుకొని ప్రత్యేక హోదా సాధన పోరాటంలో చిత్తశుద్ధి నిరూపించుకున్నామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ సభ్యులు పేర్కొన్నారు. బుధవారం ఢిల్లీలో లోక్‌సభ స్పీకర్‌ను కలిసిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం చేసిన మోసానికి నిరసనగా తాము చేసిన రాజీనామాలను ఆమోదించాల్సిందేనని స్పీకర్‌కు తేల్చిచెప్పామని అన్నారు. రాజీనామాలను ఆమోదించేందుకు సూత్రప్రాయంగా అంగీకరించిన స్పీకర్ వ్యక్తిగతంగా ధ్రువీకరిస్తూ రీకన్ఫర్మేషన్ లేఖలు ఇవ్వాలని కోరారన్నారు. ఆ మేరకు విడివిడిగా లేఖలు అందజేశామని తెలిపారు. తమ రాజీనామాల ఆమోదంపై అధికారిక ప్రకటన వెలువడుతుందన్నారు. రాజీనామాలు డ్రామా కాదన్న విషయం నిరూపితమైందని వెల్లడించారు. వైఎస్సార్‌సీపీ వల్లే ప్రత్యేక హోదా సాధ్యమని, ఉప ఎన్నికల్లో గెలుపొంది ప్రజల అభీష్టాన్ని దేశానికి వినిపిస్తామని చెప్పారు. మీడియా సమావేశంలో ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, వరప్రసాదరావు, మిథున్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.
చంద్రబాబుకు ప్రజలే బుద్ధి చెబుతారు: మేకపాటి
ప్రత్యేక హోదా సాధన విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు విన్యాసాలను రాష్ట్ర ప్రజలంతా చూశారు. 14 నెలల పదవీకాలం ఉండగానే మేము చిత్తశుద్ధితో రాజీనామాలు చేశాం. ఇక పునరాలోచన లేదని, రాజీనామాలను ఆమోదించాలని స్పీకర్‌ను కోరాం. ఉప ఎన్నికలు వైఎస్సార్‌సీపీకి కొత్తేంకాదు. హోదా అవసరం లేదంటూ నాలుగేళ్లపాటు రాష్ట్రానికి చంద్రబాబు చేసిన ద్రోహాన్ని ప్రజలు గుర్తు పెట్టుకున్నారు. ఇప్పుడు ఆయన ఎన్ని డ్రామాలు ఆడిన విశ్వసించరు. సరైన సమయంలో ఆయనకు బుద్ధి చెబుతారు. కేంద్రంలో చక్రం తిప్పుతానంటున్న చంద్రబాబు వచ్చే సాధారణ ఎన్నికల్లో రాష్ట్రంలో రెండు ఎంపీ సీట్లు గెలిపించుకొని చూపించాలి.
ఎవరు ద్రోహం చేశారో వివరిస్తాం: వైవీ సుబ్బారెడ్డి
మా రాజీనామాల ఆమోదానికి స్పీకర్ అంగీకరించారు కాబట్టి ఉప ఎన్నికలకు వెళ్తాం. ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్రానికి ఎవరు నమ్మక ద్రోహం చేశారో ప్రజలకు వివరిస్తాం. నాలుగేళ్లపాటు కేంద్రంలో భాగస్వామిగా ఉండి ఎన్నడూ హోదా అడగని చంద్రబాబు యూటర్న్ తీసుకొని ఇప్పుడు ఆడుతున్న డ్రామాలను ప్రజలకు వివరిస్తాం. ప్రత్యేక హోదా ఆకాంక్ష ప్రజల్లో ఎంత తీవ్రంగా ఉందో ఉప ఎన్నికల్లో విజయం సాధించి కేంద్రానికి తెలియజేస్తాం. వైఎస్సార్‌సీపీ నుంచి ఇతర పార్టీల్లోకి ఫిరాయించిన ఎంపీల సభ్యత్వాలను రద్దు చేయాలని స్పీకర్‌ను కోరాం. ఈ అంశాన్ని ఇప్పటికే ప్రివిలేజ్ కమిటీకి పంపానని స్పీకర్ చెప్పారు.
చంద్రబాబు ఊసరవెల్లి: వరప్రసాదరావు
ప్రతి విషయంలో డ్రామాలు ఆడే చంద్రబాబుకు ఎవరు ఏం చేసినా డ్రామాలాగే అనిపిస్తుంది. నాలుగేళ్లలో ఒక్కసారి కూడా ప్రత్యేక హోదా కావాలని అడగని చంద్రబాబు ఉన్నట్టుండి ఉసరవెల్లిలా రంగు మార్చి హోదా కావాలి అంటున్నారు. ఎన్నికలకు రావాలంటూ సవాల్ విసురుతున్న చంద్రబాబుకు నిజంగా ధైర్యం ఉంటే.. డబ్బులు ఎర వేసి టీడీపీలో చేర్చుకున్న 23 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, ఎన్నికల్లో పోటీ చేయించేవాడు. చంద్రబాబు ధైర్యం ఏంటో ఇక్కడే తెలిసిపోయింది. ప్రత్యేక హోదా పోరాటానికి వైఎస్సార్‌సీపీ ఊపిరి పోస్తే.. దాన్ని నీరుగార్చేందుకు చంద్రబాబు ప్రయత్నించారు.
ప్రతి మాట నిలబెట్టుకున్నాం: మిథున్‌రెడ్డి
ప్రత్యేక హోదా పోరాటంలో చెప్పిన ప్రతి మాట నిలబెట్టుకున్నాం. కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టాం. పదవులకు రాజీనామా చేశాం. ఆమరణ దీక్షకు కూర్చున్నాం. ప్రత్యేక హోదా పోరాటం విషయంలో తెలుగుదేశం పార్టీ ఆడిన డ్రామాలను ప్రజలందరూ చూశారు. మా రాజీనామాల ఆమోదానికి స్పీకర్ అంగీకరించారు కాబట్టి ఇక ప్రజల్లోకి వెళ్తాం. ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్రం చేసిన మోసం, హోదా అవసరం లేదు ప్యాకేజీ ఇస్తే చాలంటూ టీడీపీ చేసిన నమ్మక ద్రోహాన్ని ప్రజలకు వివరిస్తాం.
టీడీపీకి ప్రజలే బుద్ధిచెబుతారు: అవినాశ్‌రెడ్డి
ప్రత్యేక హోదా సాధన కోసం చిత్తశుద్ధితో మేం చేసిన రాజీనామాలను ప్రజలు విశ్వసిస్తున్నారు. తప్పుడు రాజకీయాలు చేసే చంద్రబాబు, లోకేశ్‌ల సర్టిఫికెట్లు మాకు అవసరం లేదు. ఉప ఎన్నికలు రావని చంద్రబాబు అంటున్నారు. ఈ విషయం ఎన్నికల సంఘం ఆయనకు ఏమైనా చెప్పిందా? ఉప ఎన్నికలకు వైఎస్సార్‌సీపీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. విలువలు, ప్రజలను నమ్ముకొని రాజకీయాలు చేస్తుంది. చంద్రబాబులా డబ్బు, కుతంత్రాలతో రాజకీయాలు చేయదు. విలువలు వదిలేయాల్సిన రోజున రాజకీయాలే వదిలేస్తాం తప్ప తప్పుడు రాజకీయాలు ఎప్పటికీ చేయబోం. ఉప ఎన్నికల్లో బీజేపీ, టీడీపీలకు బుద్ధివచ్చేలా ప్రజలే తీర్పు ఇస్తారు.
Comments
Please login to add a commentAdd a comment