సాక్షి, న్యూఢిల్లీ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల రాజీనామాలు భావోద్వేగపూరితంగా ఉన్నాయని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ వైఎస్సార్ సీపీ ఎంపీలు ఐదుగురు రాజీనామాలు చేసిన విషయం విదితమే. ప్రత్యేక హోదా సాధనకు ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, మిథున్‌రెడ్డి, అవినాష్‌రెడ్డిలు గత నెలలో స్పీకర్ ఫార్మెట్లో రాజీనామాలు చేశారు. స్వీకర్ కార్యాలయం నుంచి పిలుపురావడంతో ఎంపీలు మంగళవారం సాయంత్రం లోక్‌సభలోని స్పీకర్ కార్యాలయంలో సుమిత్రా మహాజన్‌ను కలుసుకుని తమ రాజీనామాలు ఆమోదించాలని కోరారు.
ఈ భేటీ అనంతరం సుమిత్రా మహాజన్ మాట్లాడుతూ... ‘రాష్ట్రంలో ఉన్న ఉద్వేగపూరిత పరిస్థితుల వల్ల రాజీనామాలు చేసినట్లు అనిపిస్తోంది. లోక్‌సభ స్పీకర్‌గా వాటన్నింటినీ అర్థం చేసుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది. రాజీనామాలపై పునరాలోచించుకోవాలని వైఎస్సార్ సీపీ ఎంపీలకు సలహా ఇచ్చా. జూన్ 5 లేదా 7వ తేదీలోపు మరోసారి కలవాలని ఎంపీలకు సూచించా. అప్పటికీ నిర్ణయం మారకపోతే రాజీనామాలు ఆమోదిస్తా.’ అని అన్నారు.
రాజీనామాలు ఆమోదించాలని కోరాం..
స్పీకర్‌తో సమావేశం ముగిసిన అనంతరం ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ... మా రాజీనామాలు ఆమోదించాలని కోరాం. రాజీనామాలపై పునరాలోచించుకోవాలని స్పీకర్ కోరారు. మేం మాత్రం తక్షణమే రాజీనామాలు ఆమోదించాలని కోరాం. కర్ణాటకలో ఇద్దరు ఎంపీలు రాజీనామాలు ఆమోదించారు. అదేవిధంగా మా రాజీనామాలు కూడా ఆమోదించాలని కోరాం. స్పీకర్ ఫార్మాట్‌లోనే రాజీనామాలు చేశాం. రాజీనామాలు ఆమోదిస్తారని ఆశిస్తున్నాం.
రాజీనామాలు చేసి ప్రజల్లోకి వెళితే.. ప్రత్యేక హోదాకు బలం చేకూరుతుందని మా నమ్మకం. రాజీనామాలు ఆమోదించకపోతే మళ్లీ వచ్చి అడుగుతాం. హోదాపై టీడీపీకి చిత్తశుద్ధి లేదు. టీడీపీ ఎంపీలు కూడా మాతోపాటు రాజీనామాలు చేసిఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. మా ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన‍్నట్లు కొన్నారు. అసెంబ్లీ స్పీకర్ ఎందుకు వారిపై చర్యలు తీసుకోవడం లేదు. చంద్రబాబువన్నీ డ్రామాలే. ప్రత్యేక హోదా వచ్చేవరకూ పోరాటం చేస్తూనే ఉంటాం.’ అని స్పష్టం చేశారు.
రాజీనామాలు ఆఖరి అస్త్రం...
స్పీకర్ ఫార్మాట్‌లోనే రాజీనామాలు చేశామని ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి తెలిపారు. ఐదుగురు ఎంపీల రాజీనామాలు ఆమోదించాలని స్పీకర్‌ను కోరామని, హోదా కోసం ఆఖరి అస్త్రంగా రాజీనామాలు చేశామన్నారు. తక్షణమే రాజీనామాలు ఆమోదించాలని కోరామని, రాజీనామాలు ఆమోదించకపోతే మళ్లీ వచ్చి అడుగుతామని మేకపాటి అన్నారు.
హోదాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం...
ప్రత్యేక హోదాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ఎంపీ వరప్రసాద్ అన్నారు. ‘ఫిరాయింపుల అంశాన్ని కూడా స్పీకర్‌ను అడిగాం. ప్రివిలేజ్ కమిటీకి పంపామని స్పీకర్ చెప్పారు. వెంటనే చర్యలు తీసుకోకపోతే ఆ చట్టానికి అర్థం లేదు. స్వార్థ రాజకీయాల కోసం బీజేపీతో నాలుగేళ్లు అంటకాగి ఇప్పుడు కాంగ్రెస్ వైపు వెళుతున్నారు. ప్రజలు గమనిస్తున్నారు. చంద్రబాబుకు కచ్చితంగా గుణపాఠం చెబుతారు.’ అని ఆయన వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు భయపడుతున్నారు..
ప్రజల్లోకి వెళ్లేందుకు చంద్రబాబు నాయుడు భయపడుతున్నారని ఎంపీ మిథున్ రెడ్డి ఎద్దేవా చేశారు. రాజీనామాలు చేస్తే ఓటమి పాలవుతారనే భయం బాబుకు ఉందని అన్నారు. ఎంపీల రాజీనామాలు ఆమోదించాలని స్పీకర్‌ను కోరామని, ఉప ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని మిథున్ రెడ్డి స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment