ఆక్రందన.. ఆవేదన
- తుఫాన్ బాధితుల అష్టకష్టాలు
- సాయం అందక, వేదన తీరక జనం అగచాట్లు
- అన్ని చోట్లా అక్రమాలు, అన్యాయాలు
- అందని నీరు, ఆహార పొట్లాలు
- సామాన్యుల్లో ఆగ్రహావేశాలు
సుడిగాలి గొడ్డలి వేటు తగిలిన విశాఖజిల్లా తెప్పరిల్లడానికి అష్టకష్టాలూ పడుతోంది. అస్తవ్యస్తమైన జనజీవనం తేరుకోవడానికి అన్నిశక్తులూ కూడదీసుకుంటోంది. అందుకు దోహదపడాల్సిన పాలనావ్యవస్థ మాత్రం అట్టడుగు వర్గాల ప్రజలకు అందుబాటులో లేదన్న ఆవేదన వ్యక్తమవుతోంది. సాయం ఆశించిన స్థాయిలో అందడం లేదన్న ఆక్రందన ఆగ్రహంగా రూపాంతరం చెందుతోంది. సాయం పక్కదారి పడుతోందన్న నిరసన నలుదిశలా వ్యక్తమవుతోంది. మరోవైపున కీలకమైన విద్యుత్ సరఫరా పునరుద్ధరణ అవరోధాలు దాటుకుంటూ నెమ్మదిగా సాగుతూ ఉండగా నీటి సమస్య మాత్రం అదే స్థాయిలో అవస్థలు పెడుతోంది.
సాక్షి, విశాఖపట్నం : గంటలు రోజులవుతున్నాయి. పెనుతుఫాన్ తాకిడి కారణంగా నెలకొన్న దుర్భర పరిస్థితులు అతి నెమ్మదిగా తిరుగుముఖం పడుతున్నాయి. అయితే అనేక ఈ సంక్షోభ పరిస్థితిలో అందాల్సిన సాయం ఆశించిన స్థాయిలో లేదన్న నిరాశానిస్పృహలు ఎల్లెడలా వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా తుఫాన్ కారణంగా తీవ్రంగా దెబ్బ తిన్న అట్టడుగు వర్గాల వారి అవస్థలు ఇప్పటికీ చెప్పనలవికాకుండా ఉన్నాయి. ఆహారం కోసం, నీటి కోసం వీరు చేస్తున్న దీనాలాపాలు జిల్లా నలుమూలలా ప్రతిధ్వనిస్తున్నాయి. ఖర్చు భరించగలిగే వారి పరిస్థితి కాస్త ఫర్వాలేదనిపించినా, రెక్కాడితే కాని డొక్కాడని వారి పరిస్థితులే దయనీయంగా ఉన్నాయి.
చాలా చోట్ల సాయం పక్కదారి పడుతుం డడంతో బాధితుల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికుతున్నాయి. తుఫాన్ అనంతరం మత్స్యకార ప్రాంతాలు, మురికివాడల్లో పరిస్థితి దయనీయంగా తయారైంది. ఆహార పొట్లాలతో వాహనం వస్తే చాలు ఎగబడి లాక్కునే పరిస్థితి కనిపిస్తోంది. ప్రతి ఇంటికీ ఆహారం-మంచినీళ్లు యుద్ధ ప్రాతిపదికన పంపిణీ చేస్తామన్న ప్రభుత్వం ఆచరణలో విఫలమవుతోంది. వేలాది మంది బాధితులు ఆహార పొట్లాల కోసం గంటల తరబడి నిరీక్షిస్తున్నా ఫలితం లేకుండా ఉంది. ఆహారం అందడం లేదన్న ఆవేదన అందరి నుంచి వినిపిస్తోంది.
వివిధ ప్రాంతాల నుంచి నగరానికి తరలించిన నిత్యావసరాల పంపిణీ బాధ్యతను స్థానిక ఎమ్మెల్యే లు తమ అనుచరులకు కట్టబెట్టడంతో వారు పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఏలూరు ఎంపీ, దెందులూరు ఎమ్మెల్యేలు పంపించిన నిత్యావసరాలు, కాయగూరలను విశాఖ వెంకోజీ పాలెంలో స్థానిక నాయకులు తమకు నచ్చిన ప్రాంతాల్లో మాత్రమే పంపిణీ చేస్తుండడం తో అక్కడివారు మండిపడ్డారు. దాంతో పంపిణీని నిలిపేశారు. కలెక్టరేట్‌కు తరలించిన ఆహార పొట్లాలు అందక జాలరిపేట, రెల్లివీధివాసులు శాపనార్ధాలు పెడుతుండడంతో పోలీసులు కల్పించుకుని వారిని చెదరగొట్టారు.
జిల్లాలో శిథిలాల తొలగింపు ఒక్కోచోట ఒక్కో విధంగా ఉంది. జాతీయ రహదారిపై, ప్రధాన రహదారులపై పను లు జోరుగా సాగుతున్నాయి. కానీ అంతర్గత రహదారులు, మారు మూల ప్రాంతాల్లో నేలకొరిగిన వృక్షాలు, విద్యుత్ స్తంభాల తొలగింపు పనులు ప్రభుత్వం చెబుతున్నట్టుగా చకచకా సాగడం లేదు. ఉన్నత వర్గాల వారుంటున్న ప్రాంతాలకిస్తున్న ప్రాధాన్యాన్ని సందుగొందులు, మురికివాడలకు ఇవ్వడం లేదనే విమర్శలు విన్పిస్తున్నాయి.
బాధితులను అందరి కంటే ముందుగా ఆదుకోవాల్సిన అధికారులు పత్తా లేకుండా పోయారన్న ఆక్షేపణ వినిపిస్తోంది. మరొక పక్క రాష్ర్టంలోని 12 కార్పొరేషన్లతో పాటు 50 మున్సిపాల్టీల నుంచి సుమారు ఏడువేల మంది కార్మికులొచ్చినా వారికి ఏం చేయాలో చెప్పేవారే లేకుండా పోయారు. వారిని పట్టిం చుకునే వారూ లేరు. గోపాలపట్నం, గాజువాక ప్రాంతాల్లో అతికష్టమ్మీద విద్యుత్ సరఫరాను పునరుద్దరించగలిగారు. పెట్రోల్ బంకుల వద్ద రద్దీ కాస్త తగ్గింది. నిత్యావసరాల ధరలు అందుబాటులోకి వచ్చినా సక్రమంగా లభించడం లేదు. దాదాపు అన్ని దుకాణాలు తెరుచుకున్నాయి. అంతా నష్టాన్ని అంచనా వేసే పనిలో పడ్డారు.
ఎవరూ పట్టించుకోలేదు..
మామిడిచెట్టుకూలిపోయి ఇల్లుమొత్తం ధ్వంసమైంది. నేను, నా కుమార్తెలు మొండిగోడల మధ్యే కాలం గడుపుతున్నాం. ఎవరూ పట్టించుకోలేదు. చెట్టు తొలగించలేదు. ఆహార పొట్లాలు కూడా లభించలేదు.
- మీనాక్షమ్మ, ఊర్వశి సెంటర్, గౌరీనగర్
మంచినీళ్లు లేవు..
నాలుగురోజులుగా మంచినీళ్లందక చాలా ఇబ్బందులు పడుతున్నాం. బోర్లు పనిచేయడం లేదు. నల్లాల్లో మంచినీళ్లు రావడం లేదు. ట్యాంకర్లు ఎప్పుడొస్తున్నాయో తెలియడం లేదు. మా గోడు ఎవరూ పట్టించుకోవడం లేదు.
- రత్నమాల, మహిళా సంఘం నాయకురాలు, కైలాసపురం
ఆహారపొట్లాలేవీ?
అక్కయ్యపాలెం గోలీలిపాలెంలో 200 కుటుంబాలకు పైగా ఉంటున్నాం. నాలుగు రోజులుగా ఏ ఒక్కరూ మాసందులోకి తొంగిచూడలేదు. ఆహార పొట్లాలు కాదు కదా కనీసం మంచినీళ్లు కూడా పంపిణీ చేయలేదు.
- ఎన్.రమ, గోలీలిపాలెం