తుస్సుమన్న తొలి సభ | Chandrababu Election First Meeting Was Utter Flop | Sakshi
Sakshi News home page

తుస్సుమన్న తొలి సభ

Published Sun, Mar 17 2019 10:04 AM | Last Updated on Sun, Mar 17 2019 10:14 AM

Chandrababu Election First Meeting Was Utter Flop - Sakshi

టీడీపీ తిరుపతి ఎన్నికల శంఖారావం సభలో ఖాళీగా దర్శనమిస్తున్న కుర్చీలు

సాక్షి, తిరుపతి: టీడీపీ ఎన్నికల తొలి సభ తుస్సుమనిపించింది. ఎన్నికల  నేపథ్యంలో పార్టీ కేడర్‌లో ఉత్తేజాన్ని  నింపుతుందనుకున్న  మొదటి  సభ  టీడీపీ  శ్రేణుల్లో నిరుత్సాహన్ని నింపింది. మరో వైపు తొలి సభకే జనం లేక వెలవెలబోవడంతో టీడీపీ అధినేత చంద్రబాబు ఆ పార్టీ జిల్లా నేతలపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తిరుపతి తారకరామ స్టేడియంలో శనివారం టీడీపీ బూత్‌ లెవల్‌ కన్వీనర్లు, సేవా మిత్రలు, పార్టీ ఇతర కేడర్‌తో ఎన్నికల శంఖారావాన్ని ప్రారంభించారు. తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు సభ ప్రారంభించి 3 గంటలకు ముగించాల్సి ఉంది.

అయితే మధ్యాహ్నం 1 గంటకు 2 వేల మంది కూడా జనం లేకపోవడంతో సభను కొంత సమయం వాయిదా వేయమని చంద్రబాబు సూచించారు. దీంతో రంగంలోకి దిగిన కొందరు నేతలు నగరంలో జనాన్ని తరలించేందుకు అవస్థలు పడ్డారు. ఎట్టకేలకు చంద్రబాబు సభకు చేరుకునే సమయానికి సగం కుర్చీలు నిండాయి. దీంతో కార్యక్రమం మధ్యాహ్నం 2.50 గంటలకు ప్రారంభించాల్సి వచ్చింది. సభా వేదికపైకి వచ్చిన చంద్రబాబు కుర్చీలు ఖాళీగా కనిపించడంతో అవాక్కయ్యారు.

జిల్లా నాయకులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. జిల్లా కార్యక్రమం కావడంతో జన సమీకరణలో ఎవరికి వారు చేతులెత్తేశారు. సభ వెలవెలబోయింది. వర్ల రామయ్య, మంత్రి అమరనాథ రెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థిపై చంద్రబాబు మండిపడినట్లు పార్టీ శ్రేణులు వెల్లడించాయి. తొలి సభలోనే జనం లేకపోతే ప్రజల్లోకి ఎలాంటి సంకేతాలు వెళతాయో తెలుసా? అంటూ ఆయన తనదైన శైలిలో చురకలంటించారు. 

చప్పగా సాగిన ప్రసంగం
ఎన్నికల సమర శంఖారావం పేరుతో టీడీపీ తిరుపతిలో నిర్వహించిన సభ చప్పగా సాగడంతో కేడర్‌ నిరుత్సాహంతో వెనుదిరిగింది. మాట్లాడిందే మళ్లీ మళ్లీ మాట్లాడడంతో కార్యకర్తల్లో అయోమయం నెలకొంది. మోదీ, కేసీఆర్, జగన్‌ పేర్లు ప్రస్తావిస్తూ.. ప్రతిసారీ ఏం తమ్ముళ్లూ మనం ఎవరికైనా భయపడతామా? అంటూ పదే పదే చెప్పడం కేడర్‌లో కొంత అసహనం కనిపించింది. ప్రతి మాటకు చివరిన ఔనా, కాదా తమ్ముళ్లూ? అంటూ బోరు కొట్టించారు.

డ్రైవర్లకు మేలు చేశానని చెప్పుకునేందుకు చంద్రబాబు పదే పదే నేను నంబర్‌ వన్‌ డ్రైవర్‌గా ఉంటాను అంటూ చెప్పుకున్నారు. ఎన్నికల శంఖారావం సభలో చంద్రబాబు మాటల్లో కరుకుదనం కనిపించలేదు. కచ్చితత్వం లేదు. చెప్పిందే చెప్పి.. పాత పాటనే పాడుతూ  కేడర్‌లో నిరుత్సాహాన్ని నింపారు. సాధారణ సమావేశంలా సాగిందని, ఎన్నికల శంఖారావంలా లేదని ప్రతి ఒక్కరూ నిరుత్సాహంగా వెనుతిరిగారు.

అసంతృప్తుల డుమ్మా
ఎన్నికల్లో టికెట్లను ఆశించి భంగపాటుకు గురైన కొందరు నేతలు టీడీపీ ఎన్నికల శంఖారావానికి డుమ్మా కొట్టారు. తిరుపతిలో సుగుణమ్మ అభ్యర్థిత్వాన్ని కేడర్‌ మొత్తం వ్యతిరేకించింది. అయినా చంద్రబాబు ఆమె వైపే మొగ్గుచూపారు. దీంతో చాలామంది నేతలు సభకు డుమ్మాకొట్టారు. ఆమెను వ్యతిరేకించిన నరసింహయాదవ్, పులుగోరు మురళీకృష్ణారెడ్డి మాత్రం సభకు హాజరయ్యారు.

పార్టీ సీనియర్‌ నాయకుడు, రాష్ట్ర కార్యదర్శి నీలం బాలాజి, కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ ఊకా విజయ్‌కుమార్, డాక్టర్‌ ఆశాలత, బుల్లెట్‌ రమణ తదితరులు హాజరు కాలేదు. శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు, నగరి నియోజక వర్గానికి చెందిన ముఖ్యమైన నాయకులు, మదనపల్లె నాయకులు, పలమనేరు, పూతలపట్టు నుంచి ముఖ్యమైన నాయకులు, ద్వితీయ శ్రేణి నాయకులు సభకు హాజరు కాకపోవడం గమనార్హం!   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement