సాక్షి, విశాఖపట్నం: విశ్వ నగరి విశాఖను స్వచ్ఛత విషయంలోనూ అత్యున్నతమైన నగరంగా తీర్చిదిద్దే బాధ్యతను ప్రజలు భుజానికెత్తుకున్నారు. సిటిజన్ ఫీడ్ బ్యాక్ ప్రారంభమైనప్పటి నుంచి టాప్–3లో కొనసాగుతున్న విశాఖ నగరం.. చివరి రోజు ముగిసేసరికి పర్సంటేజ్ పరంగా మూడో స్థానంలో, ఫీడ్ బ్యాక్ అందించిన ప్రజల సంఖ్య పరంగా చూస్తే అగ్రస్థానంలో నిలిచింది.
తొలి రోజు నుంచీ అదే జోరు..
దేశ వ్యాప్తంగా ఆయా నగరాలకు కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు ప్రదానం చేస్తోంది. నగరాల్లో ఉండే మౌలిక సదుపాయాలు, పారిశుధ్య నిర్వహణ, బహిరంగ మలమూత్ర విసర్జన నిర్మూలన, ఇళ్లల్లో మరుగుదొడ్ల నిర్మాణం, రవాణా వ్యవస్థ, చెత్తశుద్ధి నిర్వహణ మొదలైన అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ అవార్డులకు నగరాలను ఎంపిక చేస్తోంది. గతేడాది టాప్–9లో చోటు దక్కించుకున్న విశాఖ.. ఈ ఏడాది టాప్–5లో ఉండాలనే సంకల్పంతో ముందుకెళ్తోంది. గత తప్పిదాలు పునరావృతం కాకుండా జీవీఎంసీ అధికారులు ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేలా ప్రత్యేక కార్యాచరణ అమలు చేశారు.
దీంతో సిటిజన్ ఫీడ్ బ్యాక్ ప్రారంభమైన జనవరి 1 నుంచి చివరి రోజైన మార్చి 31వ తేదీ వరకు ప్రజలు విశేషంగా స్పందించారు. 31 శాతం మంది ప్రజలు స్పందించడంతో 100 నగరాల్లో విశాఖ మూడో స్థానంలో నిలిచింది. దేశంలో అన్ని నగరాలలో కంటే విశాఖ ప్రజలే అత్యధిక సంఖ్యలో స్పందించడం విశేషం. ఇక, టాప్ 10లో ఏపీ నుంచి విశాఖ తప్ప ఏ నగరం కూడా చోటు దక్కించుకోలేకపోయింది. ఫీడ్ బ్యాక్ విషయంలో సహకారం అందించిన నగర ప్రజలకు జీవీఎంసీ కమిషనర్ జి.సృజన, అదనపు కమిషనర్, స్వచ్ఛ సర్వేక్షణ్ నోడల్ అధికారి డాక్టర్ వి.సన్యాసిరావు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment