సాక్షి, అమరావతి/ సాక్షి విశాఖపట్నం/సాక్షి, న్యూఢిల్లీ: పారిశుధ్యం, పరిశుభ్రత నిర్వహణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ‘స్వచ్ఛ్ సర్వేక్షణ్’ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ రికార్డుల మోత మోగించింది. పరిశుభ్రమైన రాష్ట్రాల జాబితాలో ఆరో స్థానం (2018–19లో ర్యాంక్ 20) సాధించి సత్తా చాటింది. రాష్ట్రంలో పలు నగరాలు, పట్టణాలు కూడా జాతీయస్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు దక్కించుకున్నాయి. 2019–20కి కేంద్రం గురువారం ప్రకటించిన ర్యాంకుల్లో 10 లక్షల కంటే మించిన జనాభా ఉన్న నగరాల కేటగిరీలో విజయవాడ నాలుగో ర్యాంకు సాధించగా.. విశాఖపట్నానికి తొమ్మిదో ర్యాంకు దక్కింది. 10 లక్షల లోపు జనాభా ఉన్న నగరాల కేటగిరీలో తిరుపతికి ఆరో ర్యాంకు లభించింది. టీడీపీ ప్రభుత్వ హయాం (2018–19)లో టాప్– 20లో కూడా చోటు దక్కించుకోలేని నగరాలు
ఈసారి టాప్–10లోకి దూసుకెళ్లాయి. కాగా, జాతీయస్థాయిలో మొదటి ర్యాంకు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు దక్కింది. హైదరాబాద్ 23వ ర్యాంక్ సాధించింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పారిశుధ్య నిర్వహణపై చూపిన ప్రత్యేక శ్రద్ధతో రాష్ట్రం ర్యాంకుల్లో పైకి ఎగబాకింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విప్లవాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ ఇందుకు ఎంతో ఉపకరించింది. దీంతో విజయవాడ గతేడాది కంటే 8 స్థానాలు, విశాఖపట్నం 14 స్థానాలు, తిరుపతి రెండు స్థానాలు మెరుగుపరుచుకుని టాప్–10లో చోటు సాధించాయి.
4,242 నగరాలు/పట్టణాల పరిధిలో..
►4,242 నగరాలు/పట్టణాలు, 62 కంటోన్మెంట్ బోర్డుల పరిధిలో కేంద్రం సర్వే నిర్వహించింది.
►డిజిటల్ విధానంలో 28 రోజులపాటు నిర్వహించిన సర్వేలో భాగంగా 24 లక్షలకుపైగా ఫొటోలను జియోట్యాగింగ్ చేశారు.
►దాదాపు 2 కోట్ల మంది ప్రజల అభిప్రాయాలు సేకరించారు.
వివిధ కేటగిరీల్లో టాప్ ర్యాంకులు మనవే..
►100కుపైగా పట్టణ స్థానిక సంస్థలు ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఆరో ర్యాంక్ సాధించింది.
►10 లక్షల లోపు జనాభా కేటగిరీలో టాప్–100 ర్యాంకుల్లో రాజమహేంద్రవరం 51, ఒంగోలు 57, కాకినాడ 58, తెనాలి 75, కడప 76, చిత్తూరు 81, హిందూపూర్ 93, తాడిపత్రి 99 ర్యాంకులు దక్కించుకున్నాయి.
►10 లక్షల నుంచి 40 లక్షల జనాభా ఉన్న నగరాల కేటగిరీలో అతిపెద్ద శుభ్రమైన నగరంగా విజయవాడ ూ లక్ష నుంచి 3 లక్షలు జనాభా ఉన్న నగరాల కేటగిరీలో ఉత్తమ స్థిరమైన (సస్టైన్‌బుల్) చిన్ననగరంగా తిరుపతి
►50 వేల నుంచి లక్ష జనాభా ఉన్న కేటగిరీలో ఉత్తమ స్థిరమైన చిన్ననగరంగా చీరాల ూ 25 వేల నుంచి 50 వేల జనాభా ఉన్న కేటగిరీలో ఉత్తమ స్థిరమైన చిన్ననగరంగా ఆత్మకూరు ూ సౌత్ జోన్‌లో 50 వేల నుంచి లక్ష జనాభా కలిగినవాటిలో పరిశుభ్రమైన నగరంగా పలమనేరు ూ 25 వేలు లోపు జనాభా కలిగిన వాటిలో అతిచిన్న ఫాస్ట్ మూవింగ్ సిటీగా ముమ్మడివరం
సౌత్ జోన్‌లోనూ ఏపీదే అగ్రస్థానం
►50 వేల నుంచి లక్ష జనాభా కలిగిన నగరాల కేటగిరీలో సౌత్ జోన్‌లో టాప్–100 ర్యాంకుల్లో ఏకంగా 40 ర్యాంకులు రాష్ట్రానికి దక్కాయి. 1 నుంచి 8 ర్యాంకులు పలమనేరు, చీరాల, పుంగనూరు, కందుకూరు, మండపేట, పులివెందుల, నర్సాపూర్, తణుకు సాధించాయి.
►25 వేల నుంచి 50 వేల జనాభా ఉన్న నగరాల కేటగిరీలో టాప్–10లో పుట్టపర్తి 2, జమ్మలమడుగు 5, నిడదవోలు 6, రామచంద్రాపురం 7వ ర్యాంకులు సాధించాయి. ఈ కేటగిరీలో టాప్–100 ర్యాంకుల్లో మన రాష్ట్రానికి 32 ర్యాంకులు దక్కాయి.
రాష్ట్ర ప్రభుత్వానికి ఉపరాష్ట్రపతి అభినందనలు
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ్ సర్వేక్షణ్–2020 ర్యాంకుల్లో విజయవాడ, విశాఖపట్నం నగరాలు మెరుగైన స్థానాలు దక్కించుకున్నందుకు ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించారు. ‘పది లక్షలకు పైగా ఉన్న జనాభా కేటగిరీలో నాలుగో స్థానంలో విజయవాడ, 9వ స్థానంలో విశాఖపట్నం నిలవడం ఆనందదాయకం. ఏపీ ప్రభుత్వంతోపాటు ఆయా నగరాల అధికార యంత్రాంగానికి అభినందనలు’ అని ఆయన గురువారం ట్వీట్ చేశారు.
సీఎం వైఎస్ జగన్ అభినందనలు
స్వచ్ఛ సర్వేక్షన్ ర్యాంకుల్లో అత్యుత్తమ ప్రతిభ చూపినవారికి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. విజయవాడ, తిరుపతి, విశాఖ నగరాల్లోని కుటుంబాలు, పారిశుధ్య కార్మికులు, మున్సిపల్ అధికారులు, ఇతర భాగస్వాములను ఆయన ప్రశంసించారు.
Comments
Please login to add a commentAdd a comment